బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనాలనుకుంటే ముందుగా ఆన్‌లైన్ ద్వారా రూ.2వేలు చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చేతక్.కామ్ వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడ అవసరమైన వివరాలు పొందు పరిచి నచ్చిన స్కూటర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రీ బుకింగ్‌ని రద్దు చేసుకుంటే వెయ్యి రూపాయలు రీఫండ్ వస్తుంది.
బజాజ్ సంస్థ ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ తొలుత తమిళనాడుతో మొదలుపెట్టి కర్నాటక, మహారాష్ట్ర ఇప్పుడు తెలంగాణాలో సేల్స్ ప్రారంభించింది. మిగిలిన కంపెనీల తరహాలో కాకుండా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నగరంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తెస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి, బేగంపేట, కాచిగూడలలో ఉన్న బజాజ్ చేతక్ షోరూమ్‌లలో ఈ స్కూటర్లను అందుబాటులో ఉంచారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రర్ చేసుకున్న వారు ఈ షోరూమ్‌లకు వెళ్లి స్కూటర్ డెలివరీని తీసుకోవాల్సి ఉంటుంది.
బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి సంబంధించి ప్రీమియం, ఆర్బన్ అనే రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం నాలుగు రంగుల్లో లభిస్తుండగా అర్బన్ రెండు రంగుల్లో లభిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రీమియం వేరియంట్ ఒక్కటే అమ్మకానికి సిద్ధంగా ఉంది.
బజాజ్ చేతక్ ప్రీమియం హైదరాబాద్ ఎక్స్‌షోరూం ధర రూ.1,50,461 ఉండగా ఆన్‌రోడ్ ధర రూ. 1,89,175లుగా ఉంది. బజాజ్ అర్బన్ ఎక్స్‌షోరూం ధర రూ. 1,00,000గా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి రిజిస్ట్రేషన్ ఛార్జీలను మాఫీ చేసింది.
ఫుల్‌గా ఛార్జ్ చేసిన బ్యాటరీతో ఎకానమీ మోడ్‌లో 90 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసేందుకు 5 గంటల సమయం పడుతుంది. క్విక్ ఛార్జింగ్ ఆప్షన్‌లో గంట సేపు ఛార్జ్ చేస్తే 25 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. దీంతో కనీసం 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు.
మూడేళ్లు లేదా 50,000 కిలోమీటర్ల ప్రయాణం వరకు స్కూటర్, లిథియం ఐయాన్ బ్యాటరీపై బజాజ్ సంస్థ వారంటీ అందిస్తోంది. టైర్లపై వన్ ఇయర్ వారంటీ ఇస్తోంది. ఈ స్కూటర్‌కి డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా బజాజ్ పేర్కొంది. దీనికి సంబంధించి ఐపీఎస్ 67 సర్టిఫికేట్ ఉన్నట్టు చెబుతోంది. స్కూటర్ కొనే ఆసక్తి ఉన్న వారు చేతక్.కామ్ వెబ్‌సైట్‌లో టెస్ట్ రైట్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
హైదరాబాద్ కంటే ముందు బజాజ్ ఆటో చేతక్ కోసం మరో రెండు ప్రముఖ నగరాలైన పూణే, బెంగళూరులో ఈ నెల ప్రారంభంలో బుకింగ్‌లను తిరిగి ప్రారంభించింది. ఏప్రిల్‌లో మొదటి దశ బుకింగ్‌లలో అధిక డిమాండ్ కారణంగా కంపెనీ బుకింగ్ ప్రక్రియను 48 గంటల్లో నిలిపివేసింది.
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మైసూర్, మంగళూరు, ఔరంగాబాద్, నాగ్‌పూర్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఆసక్తి గల కొనుగోలుదారులు కంపెనీ టోకెన్ మొత్తంగా రూ2,000 చెల్లించాల్సి ఉంటుంది. బజాజ్ ఆటో 2022 నాటికి మరో 20 నగరాలకు విస్తరించాలని యోచిస్తోంది.
బజాజ్ చేతక్ 3.8 kW ఎలక్ట్రిక్ మోటార్‌పై పనిచేస్తుంది, అలాగే 5హెచ్‌పి పవర్, 16.2ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పూర్తి ఛార్జ్‌పై బ్యాటరీ ఎకో మోడ్‌లో 90 కి.మీ వరకు ప్రయాణిస్తుందని బజాజ్ పేర్కొంది.