వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శనం చేసుకోవడం కోసం భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకున్నవారికి పునర్జన్మ ఉండదని, మోక్షం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు భక్తులంతా సిద్ధమవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.
మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిగా చెబుతుంటారు. ఈ రోజున స్వామి వారిని దర్శించుకుంటే సకాల పాపాలు తొలగిపోయి, కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. రాత్రి సమయం అయిన దక్షిణాయనం పూర్తిచేసుకుని దేవతలకు పగటి సమయం అయిన ఉత్తరాయణం ప్రారంభం అవుతోంది. ఈ సందర్భంగా నిద్రనుంచి మేల్కొనే శ్రీమన్నారాయణుడిని ఉత్తరద్వారనుంచి వెళ్లి దర్శనం చేసుకుంటారు.
వైకుంఠ ఏకాదశి రోజున చాలా మంది ఉపవాసంతో ఉంటారు. ఈ రోజు అస్సలు అన్నం అస్సలు తినకూడదని పండితులు చెబుతుంటారు. దీనివెనకాల ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. దీని ప్రకారం మధుకైటవులు అనే రాక్షసులకు ముక్తిని ప్రసాదించి వారికి ఉత్తరద్వార దర్శనం కల్పించింది ఈరోజే. ఇదే రోజు మురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఆ మురాసరుడు నివశించే ప్రదేశం అన్నం..అందుకే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని, అన్నం అస్సలు తినకూడదని పండితులు చెబుతుంటారు.
ఈరోజున పాలు, పండ్లను తీసుకుంటూ ఉండాలి. రోజంతా భగవంతుడి ధ్యానంలో ఉంటూ, సంధ్యాసమయంలో పూజ పూర్తిచేసి రాత్రంతా జాగరణ చేస్తారు. అన్నపానీయాలకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తంటారు. వైకుంఠ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాన్ని పఠించినా, విన్నా పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. ఉపవాస నియమాల ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి ముందు రాత్రి నేలపై నిద్రించాలి. ఏకాదశి రోజున ఎవరినీ దూషించవద్దు, మంచి ఆలోచనలనతో ఉండాలని పండిలు చెబుతుంటారు.