2023లో కర్కాటక రాశివారి ఫలితాలు

First Published | Dec 4, 2022, 9:45 AM IST

నూతన సంవత్సరం 2023 లో  ఓ రాశివారికి  చిన్న పనికి కూడా విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం శుభకార్యాల కోసం డబ్బు విపరీతంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు అమ్మాల్సి రావటం భాదిస్తుంది

Astro

ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.
 

Vijaya Rama krishna


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):

2023 సంవత్సరంలో  గ్రహాల మార్పు వల్ల ఈ ఏడాది కాలానుగుణంగా ఈ రాశి వారి  జీవితాల్లో తీపి, పులుపు అనుభవాలు మిన్నంటుతాయి. మిశ్రమ ఫలితాలుంటాయి.  అయితే సగటున ఈ సంవత్సరం ఈ  రాశి వారికి ఆహ్లాదకరంగా, అదేవిధంగా కాస్త గందరగోళంగా ఉంటుంది.  సంపాదనకు కొత్త మార్గాలను అన్వేషించడం వల్ల డబ్బుకి పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే  చిన్న పనికి కూడా విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం శుభకార్యాల కోసం డబ్బు విపరీతంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు అమ్మాల్సి రావటం భాదిస్తుంది. అయితే ఖర్చు అయినా కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి. క్రమశిక్షణ అలవాటవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. శుభఫలితాల కోసం ఈరాశి వారు పార్వతీ పరమేశ్వరులను ఆరాధించడం మంచిది.
 

జనవరి 2023
 
ఈ నెలలో శ్రమయేవ జయతే అన్నట్లుగా మీ పనులు సాగుతూంటాయి.  మీ పట్టుదల,ఓర్పే  మీకు శ్రీరామ రక్ష. తలపెట్టిన పనులన్నింటా ఆటంకాలు ఎదురవుతుంటాయి. ధన సంపాదన కూడా ఏమంత ఆశాజనకంగా ఉండదు. పైగా విపరీతమైన ఖర్చులు చికాకు పరుస్తాయి. అయితే శుభ కార్యాలను చేస్తారు. ఈ తరుణంలో అత్యంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిత్యం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.

 
లవ్ లైఫ్ :  మీ జీవిత భాగస్వామిపద్దతి , మాటలు తరచూ చికాకు పెడతాయి. సంతానం కూడా మాట వినకపోవడం, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుండడం, వారికి జీవిత భాగస్వామి వత్తాసు ఆందోళన కలిగిస్తాయి. అయితే అది కొంతకాలమే అని గమనించండి..కంగారుపడకండి.

ఉద్యోగం-వ్యాపారం:   వృత్తి, ఉద్యోగాల్లోని వారికి ప్రమోషన్లు, ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయి. అదే సమయంలో ఒత్తిళ్లనూ ఎదుర్కొవాల్సి ఉంటుంది. రాజకీయ రంగంలోని వారు కీలక బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. వ్యాపారస్దులకు కలిసొచ్చే కాలం
 
 ఆరోగ్యం:     చెడు వ్యసనాల వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. దాంతో చిరాకులు పెరుగుతాయి. అయిన వారు దూరం అవుతారు.  కాబట్టి ఏ సందర్భంలోనైనా సౌమ్యంగా మాట్లాడడం, సర్దుకుపోవడం ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించుకునే వీలుంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. 

Cancer Zodiac


ఫిబ్రవరి 2023

ఈ నెలలో   నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది. ఎగుమతుల రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.  రాజకీయ రంగంలోని వారికి గడ్డు కాలం. శత్రువులదే పైచేయి అవుతుంది. ఈరాశి వారికి పదవులు ఊడిపోవడం, సస్పెన్షన్లు, ఆర్థిక ప్రయోజనాలకు భంగం వంటి చెడు ఫలితాలు గోచరిస్తున్నాయి. దైవ దర్శనం తరుచు చేసుకుంటూండాలి. సంఘంలో గౌరవ మర్యాదలు, అవమానాలు సమానంగా ఉంటాయి. స్థిరచిత్తంతో ముందుకు సాగితే, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. ఈరాశి వారు దోషనివారణ కోసం సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.

లవ్ లైఫ్:    జీవిత భాగస్వామి వైఖరి, సంతానం పెడధోరణులు ఆందోళన కలిగిస్తాయి. అందుకు కారణమైన పితృదోషాల నివారణకు ప్రయత్నించండి. కష్టాలు ఎన్ని చుట్టుముట్టినా.. సమాజంలో మీకు ప్రత్యేక గుర్తింపు లభించడం పెద్ద ఊరటనిస్తుంది. అప్పుడు కుటుంబం మీకు సపోర్ట్ గా నిలుస్తుంది.

ఉద్యోగం-వ్యాపారం:  వాహనాల క్రయవిక్రయాలు, విదేశీ ఉద్యోగాలు, ఎగుమతుల వ్యాపారాలు చేసే వారు జీవితంలో స్థిరపడే వీలుంది. తోటి ఉద్యోగస్దుల  సూటిపోటి మాటలు మీ ఉత్సాహాన్ని నీరుగారుస్తుంటాయి. చిన్నచిన్న ఎదురు దెబ్బలను కూడా తట్టుకోలేని మనోదౌర్భల్యం ఏర్పడుతుంది. కీలక కార్యాల నిమిత్తం  చేసే ప్రయాణాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.ఆచి,తూచి అడుగువేయండి.

ఆరోగ్యం:   వృత్తి, కుటుంబ విషయాలకు సమన్యాయం చేయలేక బాగా చికాకుకు గురి అవుతారు. దాంతో  చిన్నపాటి అనారోగ్యాలు కనపడతాయి. అపమృత్యు భయాన్ని అధిగమించేందుకు నిత్యం మృత్యుంజయ స్తోత్రాన్ని పటిస్తుండండి. 
 

మార్చి 2023

 ఈ నెలలో  ఆర్థికంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మీ చేతిలో డబ్బులు ఎక్కువ రోజులు నిలవకపోవచ్చు. దీంతో కుటుంబ అవసరాలు తీర్చటం కోసం కూడా వెనక అడుగు వేస్తారు. అయితే నెల మధ్యలో  మీలోని కొత్త ప్రతిభ బయటపడి, కొత్త ఆలోచనలతో మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. కెరీర్‌లో కొత్త మలుపులు చోటుచేసుకోవచ్చు.. వృత్తి పరంగా కొన్ని ఘటనలు ఉత్సాహాన్ని పెంచుతాయి. కొందరి వింత ప్రవర్తన గందర గోళానికి గురి చేస్తుంది. కెరీర్‌లో కొత్త దశ ఆనందాన్ని ఇస్తుంది.
 

లవ్ లైఫ్ :  ఈ   నెలలో మీ ఆనందం మెరుగు పడుతుంది. మీ భాగస్వామితో కూడిన  విజయాలు ఎక్కువ అవుతాయి. కుటుంబ విషయాల్లో  ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ అనుకున్నది సాధిస్తారు. ఆనందకరమైన జీవితం మీకు సొంతం.

ఉద్యోగం-వ్యాపారం: ఈ నెల లో  ఈ రాశి వ్యక్తులు తమ నైపుణ్యంతో జీవితంలో కొత్త మెట్లు ఎక్కుతారు. దీని వల్ల  బ్యాంక్ బాలెన్స్ పెరిగి...ఆర్థికంగా జేబు భారం తగ్గుతుంది.  15 తేది దాటాక కొత్త కాంతి, కొత్త అవకాశాలు జీవితంలో ఆనందాన్ని తెస్తాయి.  వ్యాపారంలో మీ యుక్తితో మీరు ప్రయోజనం పొందుతారు. గౌరవం పెరుగుతుంది. సరస్వతి మాత మీ మాటల్లో పదును పెంచి, మాటలతో మీ జీవితాన్ని నింపుతుంది.

ఆరోగ్యం:  మానసిక అశాంతితో పాటు శరీరం వెన్ను, దిగువ భాగంలో నొప్పిని కలిగిస్తుంది.  అయితే అది కొద్ది రోజులే. గ్రహసంచారం మారగానే దానంతట అదే ఆరోగ్యపరంగా శాంతి అందుకుంటుంది.  ఈ మధ్యలో  మీ మానసిక స్థితితో ఇబ్బందులు ఎదురు అవుతాయి.  


ఏప్రియల్  2023

ఈ నెలలో గ్రహ సంచారం  అనుకూల ఫలితాలనిస్తుంది. కోరుకున్నవి సిద్ధిస్తాయి. తలపెట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఆదాయం మార్గాలు పెరుగుతాయి. ఊహించని రీతిలో డబ్బు సమకూరుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. వాహనాలు కొనే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తరచూ బంధువులను కలుస్తూ విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం మిశ్రమంగా ఉంటుంది. మేలిమి ఫలితాలకోసం ఈరాశివారు తరచూ శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.

లవ్ లైఫ్ : ఈ నెలలో ప్రేమ వ్యవహారాలు ఫలిస్దాయి. వివాహం అయ్యినవారికి మీ  జీవిత భాగస్వామి వైఖరి మిమ్మల్ని సమాజంలో చులకన చేసే అవకాసం. సంతానం వృద్ధిలోకి వస్తుంది. అయితే వారి గురించిన మీరు ఊహించని నిజాలు వినాల్సి రావచ్చు. మిత్రులకు దూరమయ్యే పరిస్థితి గోచరిస్తోంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ఎవరికీ పూచీకత్తు ఉండకండి. 

ఉద్యోగం-వ్యాపారం:  ఈ నెలలో  రాజకీయ రంగంలోని వారు మానసిక స్థిరత్వాన్ని కోల్పోవడం వల్ల అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వీరికి ఉన్నత పదవులు గోచరిస్తున్నాయి.  అభివృద్ధిపథంలో ప్రయాణం సాగుతుందనే చెప్పాలి.

ఆరోగ్యం:  ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఒకరోజు సౌఖ్యంగా.. మరోరోజు చికాకుగా సాగుతుంది.  వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నాసికా సంభందం అనారోగ్యాలు. అయితే అవి చిన్నవే భయపడాల్సిందేమీ లేదు.

మే  2023

ఈ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్నవి సాధించుకోగలుగుతారు. శ్రీకారం చుట్టిన ప్రతి పనీ.. ఎన్నో ఆటంకాలను అధిగమించాకే ఫలిస్తుంది. అవసరానికి డబ్బు సమకూరుతుంది. మితిమీరిన ఖర్చుల వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. స్థిరాస్తులను అమ్మే పరిస్థితి రావచ్చు. తొందరపడి ఎవరికీ హామీ ఉండకండి. అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ దశలో కష్టాలన్నీ చుట్టుముట్టిన భావన కలుగుతుంది.  పెద్దల ఆగ్రహం మరింత ఆందోళన కలిగిస్తుంది. మనసును నియంత్రించుకోవాలి. మాట తూలకుండా చూసుకోవాలి. 

లవ్ లైఫ్ :  ఈ సమయంలో మీ మనసు ఆహ్లాదంగా ఉంటుంది. లైంగిక శక్తి , ఒకరి పట్ల ఆకర్షణ అధికారం నుంచి మరింత ఎక్కువ అవుతుంది. ఓ సంఘటన మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది.

ఉద్యోగం-వ్యాపారం:  కెరీర్‌లో కొత్త చిక్కులు ఎదురవుతాయి. ఒకరి ప్రవర్తన మిమల్ని బాధిస్తుంది. మీ విజయానికి కొత్త మెట్లు ఏర్పడతాయి. శ్రమకు తగిన ప్రతి ఫలం లభిస్తుంది. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది.

ఆరోగ్యం:   ఈ నెలలో  ఆరోగ్య పరంగా ఇబ్బందులతో కూడిన అనుభవాల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ ముఖంలో చిరునవ్వు ఉంటుంది కానీ.. మనసు మాత్రం ప్రశాంతత కోల్పోతుంది. ధ్యానం పరిష్కారం ఇస్తుంది.
 


జూన్   2023
 
ఈ నెలలో   ఆర్థికంగా అన్ని కలిసి వస్తాయి.  మీ వ్యక్తిత్వానికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారు అవుతారు. కానీ దీని వల్ల అనేక పాత సమస్యల నుంచి జీవితాన్ని మెరుగు దిద్దుకోలరు. అడ్డంకులు తొలగడం వల్ల శాంతి వ్యాప్తి చెందుతుంది. మరొకరు చేసిన తప్పుకు మీరు మద్దతు తెలుపుతారు. మీలో నైపుణ్యం వృద్ధి చెందుతుంది. అన్ని విధాలుగా కలిసొచ్చే కాలం. ఈరాశి వారు వీలు కల్పించుకుని, తరచూ నవగ్రహారాధాన, ఆంజనేయస్వామి పూజ చేస్తుంటే, పరిస్థితులు కొద్దిగా అనుకూలిస్తాయి.

లవ్ లైఫ్ : నెల మొదట్లో లైఫ్ పార్టనర్ తో  కాస్త ఇబ్బంది ఎక్కువగా ఉన్నా, రాను రాను పరిస్థితులు అనుకూలిస్తాయి. కీలకమైన పనుల విషయంలో అడుగడుగునా అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రేమికులకు ఇది కాస్త గడ్డు సమయమే. వ్యతిరేకత ఉంటుంది. 

ఉద్యోగం-వ్యాపారం: వృత్తి ఉద్యోగాల్లోని వారు అనవసర గొడవలకు దూరంగా ఉండండి. నిరుద్యోగులు ఆశించిన ఫలితం కోసం విపరీతంగా శ్రమించాలి. రాజకీయ రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారస్దులకు సామాన్యంగా ఉంది.

ఆరోగ్యం:  శ్వాస కోశ రుగ్మతలు పెరుగుతాయి. మందులతో పాటు మీకు మనశ్సాంతి అవసరం. అలాగే అహార,విహారాలలో అతి పనికి రాదు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన సమయం.


జూలై   2023

ఈ నెలలో   మీ జీవితం ఆనందంతో నిండుతుంది. మీలో ఆధ్యాత్మిక భావన నిండుతుంది. మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. మేధో సామర్థ్యం పెరిగి, ఆనందాన్ని పెంచుతుంది. ఈ సంవత్సరం మీరు లక్ష్యానికి దగ్గరగా చేరుకుంటారు.  ఈ సమయంలో మీ ఆరోగ్యానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.నెల మధ్యలో గందరగోళం నెలకొంటుంది. వింత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.  ఖర్చుల విషయంలో కాస్త ఆలోచించాలి. ఒకరి మూర్ఖత్వం వల్ల మీ తల రాత మారే ప్రమాదం ఉంది. ఈరాశి వారు తరచూ నవగ్రహారాధన, శనైశ్చరుడికి తైలాభిషేకం చేయడం వల్ల గడ్డు పరిస్థితులు ఉపశమించే వీలుంది.

లవ్ లైఫ్ :మీ లైఫ్ పార్టనర్ తో ఆనందంగా గడిపే కాలం. దూరమైన సంబంధాలు మెరుగు పడే అవకాశాలు ఉన్నాయి.పిల్లలు సైతం మీకు కలిసి వస్తారు. ప్రేమ విషయంలో వేరే వారి సలహాలు ఇబ్బంది పెడతాయి. అటు వైపు పోవద్దు.   

ఉద్యోగం- వ్యాపారం:  పై అధికారులు  మీ సహనాన్ని పరీక్షిస్తున్నట్లు అనిపిస్తుంది.  అయితే మీ గ్రహసంచారం మారినప్పుడు ప్రతిష్ట పెరుగుతుంది. ఆనందం పెరుగుతుంది. వ్యాపారంలో మీరు  సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల సానుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. మీ స్వంత పని పూర్తి కాకపోవచ్చు.కానీ  మీ తెలివి తేటలతో ప్రత్యర్థులను ఆశ్చర్యానికి గురి చేస్తారు. 

  ఆరోగ్యం: ప్రతికూల గ్రహాలు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే అవి చిన్న చిన్న సమస్యలే. కానీ మీరు ఆ బాధలో  సహనాన్ని కోల్పోకుండా జాగ్రత్తపడాలి. కొద్ది రోజులు ఓపికపడితే మీకు కలిసి వస్తుంది. 

Cancer Zodiac


ఆగస్ట్    2023

  ఈ నెల  ఈ రాశికి కొద్దిగా అశాంతి తర్వాత.. శాంతి నెలకొంటుంది. ఈ కాలంలో మీ జీవితంలో పురోగతి పొందుతారు. సరైన నిర్ణయం వల్ల అదృష్టం వరిస్తుంది. మీ ఆశలు సాధించేందుకు చేసే కృషి వల్ల విజయాలు అందుకుంటారు. కొందరి మాటలు మీ జీవితంపై ప్రభావం చూపుతాయి. మీ మంచి ప్రవర్తన మీ జీవితంలో మార్పులు చోటుచేసుకునేలా చేస్తుంది.   మీకు అపారమైన ధైర్యం, భయం రెండూ ఏర్పడతాయి.  ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల ఆసక్తి పెరుగుతుంది.

 లవ్ లైఫ్ :   ఈ నెలలో  జీవిత భాగస్వామి సహకారం అందుతుంది.  పిల్లల ప్రవర్తన మీ సహనాన్ని పరీక్షిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ వారి పనుల వల్లే మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఆనందం పెరుగుతుంది. ప్రేమికులు తమ కుటుంబాలతో మాట్లాడాలనే నిర్ణయం తీసుకోవడం వల్ల సానుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. 

ఆరోగ్యం:   మీరు ఎదుర్కొంటున్న శారీరక రుగ్మతల నుండి బయటపడతారు.  ఎలాంటి సంక్లిష్టమైన ఆరోగ్య సమస్యలు ఉన్నా గ్రహ సంచారం మంచి స్థితిలో ఉండటం వలన ఇది సరిగ్గా నిర్ధారణ అవుతుంది. స్పీడు రికవరీ కోసం మీరు సరైన మందులను పొందుతారు. మీ వైద్య ఖర్చులు తగ్గుతాయి. మీకు మంచి నిద్ర పడుతుంది.  

ఉద్యోగం- వ్యాపారం:    వృత్తి, ఉద్యోగాల్లోని వారికి ఈ నెల ఏమంత అనుకూలంగా లేదు. తరచూ అధికారుల ఆగ్రహానికి గురవుతుంటారు.   నిరుద్యోగులు శుభవార్తను అందుకుంటారు.  విద్యార్థులు బాగా రాణిస్తారు. రాజకీయ రంగాల్లోని వారికి శ్రమకు తగ్గ గుర్తింపు లభించదు. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగితే లక్ష్యాలను చేరుకుంటారు. 


సెప్టెంబర్    2023

ఈ నెలఅంతా అనుకూలంగానే ఉంటుందని చెపవచ్చు. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ధనలాభం ఉంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గత సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆస్తి, కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు.ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

లవ్ లైఫ్ :  నమ్మకమే జీవితంలో ప్రేమ జీవితానికి పునాది అనే విషయం గుర్తించుకోండి. మీ లైఫ్ పార్టనర్ విషయంలో అనుమానాలకు తావివ్వకండి. గ్రహసంచారం వలన కొన్ని సమస్యలు మీ దాంపత్యంలో వచ్చినా అనుకూల ఆలోచనలతో సర్దుకుంటాయి. కలిసి యాత్రలు చేయండి.  

ఉద్యోగం- వ్యాపారం:  మీ  వ్యాపారాలలో ముందుకు వెళ్తారు.   స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మార్గంలో పయనిస్తుంది. ఉద్యోగస్దులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలుంటాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. స్టాకిస్టులు హోల్ సేల్ వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 

ఆరోగ్యం: తరచు ఆరోగ్య సమస్యలెదురవుతాయి. వైద్య సేవలతో కుదుటపడతారు.  అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా వైద్యుల సలహా పాటించండి. ఆధ్యాత్మికత  మీకు అండంగా ఉటుంది.   వాహనం నడిపేటపుడు జాగ్రత్త. పాల్గొంటారు. అసాంఘిక కార్యకలాపాలకూ దూరంగా ఉండాలి. 

అక్టోబర్    2023

 ఈ  నెలలో  గృహసంచారం యోగదాయకంగానే ఉంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం బాగుంటుంది. చక్కని ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు మీ స్తోమతకు తగ్గట్టుగానే ఉంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు ను విశ్వసించవద్దు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. విలాసమయ జీవితం గడుపుతారు. వ్యర్థపు ఖర్చులు అదుపు చేసుకుంటే, స్థిరాస్తులను కూడబెట్టే యోగం కనిపిస్తోంది. నూతన వాహనంకొనే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల నుంచి తోడ్పాటు లభించక పోవడం ఆవేదనను కలిగిస్తుంది. 

లవ్ లైఫ్ :  జీవిత భాగస్వామి తోడ్పాటుతో సర్వత్రా విజయాలు సాధిస్తారు. సంతానం మీరు అనుకున్నట్లే వృద్ధిలోకి రావడం మీకు అమితానందాన్నిస్తుంది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అలా చేస్తే మళ్లీ పాత కష్టాలు కొనితెచ్చుకున్నట్లే.

ఉద్యోగం- వ్యాపారం:  ఉద్యోగస్దులు చాలా కాలంగా ముందుకు వెళ్లని కార్యాలను సానుకూలం చేసుకుంటారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ధనాదాయం మెరుగవుతుంది. విలాసమయ జీవితం గడుపుతారు. వ్యర్థపు ఖర్చులు అదుపు చేసుకుంటే, స్థిరాస్తులను కూడబెట్టే యోగం కనిపిస్తోంది. వ్యాపారస్దులకు యోగకాలం. కలిసొస్తుంది.

ఆరోగ్యం:  ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. జీర్ణకోస ఉదర సంబంధ సమస్యలుంటాయి. అయితే అవి తాత్కాలికమే. సరైన ఆహారం, నిద్ర మీకు అవసరం.  సమస్యలను తేలిగ్గా మనో నిబ్బరంతో జయించండి.
 

cancer-karkataka-rasi

నవంబర్    2023
  
 ఈ రాశివారి గోచారం ప్రకారం నెల మొదట్లో  అనుకూలతలు అంతంత మాత్రమే. అవకాశాలు అందినట్టే వెనక్కి వెళ్లిపోతాయి. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించాలి. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. పట్టుదలతో శ్రమించిన గాని వ్యవహారాలు అనుకూలించవు. మొండి బాకీలు అతికష్టంమ్మీద వసూలవుతాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి.  అవివాహితులకు వివాహయోగం. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుమిత్రులు చేరువవుతారు. వాహనయోగం, వస్త్రప్రాప్తి ఉన్నాయి.  నిత్యం పార్వతీపరమేశ్వరులతో పాటుగా, నవగ్రహాలను ఆరాధించడం మంచిది.

లవ్ లైఫ్ :     దంపతుల మధ్య అవగాహన లోపం, తరచు అకాల కలహాలు తలెత్తుతాయి. 18 వ తేదీ దాటాక  ప్రతికూలతలు తొలగి కుదుటపడతారు.  ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అవివాహితులకు శుభయోగం. ఆశించిన సంబంధం నిశ్చయమవుతుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి.

ఆరోగ్యం:  ఈ నెలలో  ఆరోగ్యపరంగా బాగుంది.  గత సమస్యలకు మంచి వైద్యం లభించి ఊరట పొందువతారు. అయితే ఆహార,విహారాలలో అప్రమత్తత అవసరం.     దైవ అనుగ్రహం ఉంది. ఆరోగ్యం పూర్తి గా మెరుగు అవుతుంది.

ఉద్యోగం- వ్యాపారం:   నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, అధికారులకు పదోన్నతి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి.  ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ఇబ్బందులెదుర్కుంటారు.  వ్యాపారాలు బాగున్నా సంతృప్తి ఉండదు. భాగస్వామిక వ్యాపారాలు కలిసిరావు. 

డిసెంబర్    2023

ఈ నెల యోగకాలం. నిరాశని వదిలేయండి.  మీ పని మరియు మీ గుర్తింపుతో, మీరు కొత్త స్థాయిలను అధిరోహిస్తారు. మీ మిత్రుల,సన్నిహితులు అనుభవం మరియు జ్ఞానం నుండి ప్రయోజనం పొందుతారు.  అంచనాలు, మానసిక గందరగోళం రెండింటినీ చూస్తారు. ఈ క్రమంలో శక్తి, ధైర్యం పెరుగుతాయి. మానవ సంబంధాలు విస్తరిస్తాయి. మీరు ప్రయాణాలు ఎక్కువ చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. మీరు చేసే కొన్ని తప్పులు, మూర్ఖత్వం జీవితాన్ని   వేరే దారి వైపు మళ్లిస్దాయి. కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.రోజూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి.  

లవ్ లైఫ్ :  మీ లైఫ్ పార్టనర్ చొరవతో  మీలోని ఎనలేని ధైర్యం బయట పడుతుంది. జీవితం కొత్త కలలను చూపుతుంది. కుటుంబ జీవితం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఒకరి వ్యాఖ్యల వల్ల మరొకరి మనసు కలత చెందకుండా చూసుకోండి. మానసిక వేదనే మిమ్మల్ని జీవితానందాల నుంచి దూరం పెడుతోంది.  

ఆరోగ్యం:   ఆర్థిక, సామాజిక, మానసిక ఒత్తిడి  కొద్ది పాటి సమస్యలు తెచ్చిపెడుతుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని సవాళ్లను అధిగమిస్తారు. మీ సత్కర్మలు కవచంలా కాపాడుతాయి. మీరు బెంగపడద్దు. 

ఉద్యోగం- వ్యాపారం :  ఈరాశి వారు ఉద్యోగ,వ్యాపార రీత్యా ఇంటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారికి అంతంత మాత్రపు వృద్ధే ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి విపరీతమైన శ్రమ, అనవసరమైన ప్రయాణాలు అలసటను తెస్తాయి. వీరు సౌకర్యాలను కోల్పోయి సౌఖ్యానికి దూరం కావాల్సి వస్తుంది.ప్రతి అడుగూ అప్రమత్తంగా వేయాలి. నిరుద్యోగులు శుభవార్తను వింటారు.
 

Latest Videos

click me!