చంద్రబాబుకు చెక్: జగన్ ముందస్తు ఆలోచన, రంగంలోకి ప్రశాంత్ కిశోర్

First Published Sep 21, 2021, 2:19 PM IST

ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ టిడిపిని కోలుకోకుండా దెబ్బతీస్తూ వస్తోంది వైసిపి. ఈ క్రమంలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ చంద్రబాబును మరోసారి చెక్ పెట్టాలని భావిస్తున్న జగన్ మళ్లీ రంగంలోకి ప్రశాాంత్ కిశోర్ ను దించుతున్నాడు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల జరిగిన సమావేశంలో మంత్రులకు ఆ మేరకు సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) రంగంలోకి దిగుతారని ఆయన మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. దానివల్ల ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

కాగా, గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రతిపక్షాలు కుదురుకోక ముందే ఎన్నికలకు వెళ్లడం వల్ల ఎన్నికల్లో టీఆర్ విజయం సాధించిందని భావిస్తున్నారు. కేసీఆర్ బాటలోనే వెళ్లాలనే జగన్ ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కుదురుకోక ముందే ఎన్నికలకు వెళ్లాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. 

చంద్రబాబు (Chandrababu)ను పూర్తిగా దెబ్బ తీయడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్ (YS jagan) ఆలోచిస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోరమైన ఫలితాలను చవి చూసింది. వైసీపీకి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చాలా వరకు అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. అయితే, ఏపీలో ఆ అనుకూలత దిమ్మ తిరిగే స్థాయిలో ఉంది. టీడీపీ పూర్తిగా కుదేలయినట్లు కనిపిస్తోంది. ఇదే స్ధితి కొనసాగితే మాత్రం వచ్చే శాసనసభ ఎన్నికల్లో టీడీపీ మరింతగా దెబ్బ తీనే అవకాశం ఉంది.

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి, కార్యకర్తలకు భరోసా ఇవ్వడంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విఫలమైనట్లు అర్థమవుతోంది. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పర్యటనలు చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం లభించడం లేదు. ఏపీలోని బలమైన టీడీపీ నాయకులు చాలా మంది కేసుల్లో ఇరుక్కున్నారు. వారిని ముప్పు తిప్పలు పెట్టేందుకు జగన్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. టీడీపీ నేతలు దూకుడుగా వ్యవహరిస్తే చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. దీంతో ఎలా పార్టీని నిలబెట్టి, బలం పెంచుకోవాలో టీడీపీ నేతలకు అర్థమవుతున్నట్లు లేదు. 

వైఎస్ జగన్ ప్రజలకు అందించాల్సిందంతా అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ఫలితాలు నేరుగా ప్రజల ఇళ్లలోకి చేరుతున్నాయి. దాంతో ప్రజలు జగన్ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు గానీ ఇతర ప్రతిపక్షాలు గానీ వైఎస్ జగన్ మీద పెడుతున్న విమర్శలు ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని అంటున్నారు. రాజధాని తరలింపు, టీడీపీ నేతలపై కేసులు, జగన్ అప్రజాస్వామిక చర్యలు అంటూ పెడుతున్న విమర్శలను ప్రజలు అందుకోవడం లేదని అంటున్నారు. 

విశాఖ కర్మాగారం ప్రైవేటీకరణ వంటి వ్యవహారాల్లో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ దాని నుంచి గానీ ఇతర సంఘటనల నుంచి గానీ రాజకీయ ప్రయోజనం పొందకుండా ఆయనే ముందుగా ప్రతిస్పందిస్తూ బాధితులకు సహాయం అందిస్తున్నారు. అందువల్ల అటువంటి సంఘటనలు జరిగినప్పుడు టీడీపీ చేపట్టిన ఆందోళనలు ఏవీ కలిసి రావడం లేదు. ఇటువంటి స్థితిలో ఎన్నికలకు వెళ్తే చంద్రబాబుకు చెక్ పెట్టవచ్చునని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

మరో వైపు, బలాలను కూడదీుసకుని తమకు ప్రతిపక్షాలు తమకు పోటీ ఇవ్వడానికి రంగం సీద్ధం చేసుకోక ముందే ఎన్నికలకు వెళ్లాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పరిస్థితి రాష్ట్రంలో ఏ మాత్రం మెరుగ్గా లేదు. బిజెపి, జనసేనకు మధ్య కుదిరిన ఒప్పందం సరిగా ఆచరణలో లేదు. బిజెపి నేతల తీరు పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan Kalyan) అంత సంతృప్తిగా లేరనే మాట వినిపిస్తోంది. దాంతో ఈ రెండు పార్టీలు ఎవరికి వారే అన్న రీతులో సాగుతున్నాయి. వామపక్షాలు నోరు నెత్తి కొట్టుకున్నా ఫలితం సాధించే స్థితిలో లేవు. దీంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రతిపక్షాలను, ముఖ్యంగా టీడీపీ చావు దెబ్బ తీయాలనే వ్యూహంతో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. 

ఇదిలావుంటే, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేసే యోచనలో జగన్ వ్యూహం రచించినట్లు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం తగ్గించుకునే విధంగా చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గంలో ఒత్తిడి పెట్టాలని ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తూ అమలు చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇందుకు అవసరమైన వ్యూహాన్ని రచిస్తున్నారు. మొత్తం మీద, చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టే వ్యూహంతోనే జగన్ ముందస్తుకు వెళ్లవచ్చునని అంటున్నారు.

click me!