సినీ హీరోయిన్లు పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయితే.. అందరూ వారిని ప్రత్యేకించి చూస్తుంటారు. లైమ్‌లైట్‌లో రాణించిన ఈ నటీమణులు రాజకీయ క్షేత్రంలో నెగ్గుకువస్తారా? అనే అనుమానాలు మొదటి నుంచీ ఉంటాయి. వారు ఏ చిన్న పని చేసినా.. ఏ చిన్న పొరపాటు చేసినా అది పెద్ద చర్చగా మారుతుంది. అదీగాక, రాజకీయ ప్రత్యర్థుల నుంచి వచ్చే బలమైన సవాళ్లను ధైర్యంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సొంత పార్టీలోనూ ముసలం పెట్టే మహానుభావులూ ఉండే ఉంటారు. రాజకీయాల్లో నటీమణుల గురించిన చర్చ టీడీపీకి దివ్యవాణి రాజీనామాతో మరోసారి ముందుకు వచ్చింది. అందులోనూ టీడీపీలోనే నటీమణులు ఎందుకు ఇమడలేకపోతున్నారు? వారు ఎందుకు వరుసపెట్టి పార్టీని వీడుతున్నారు అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్నది.
టీడీపీ నుంచి చాలా మంది సినీ నటీమణులు బయటకు వెళ్లారు. జయప్రద, జయసుధ, రోజా, కవితలు టీడీపీ వీడి వెళ్లిపోయారు. తాజాగా, దివ్యవాణి కూడా చంద్రబాబు నాయుడు పార్టీకి రాజీనామా చేశారు.
ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు 1994లో ఆమె టీడీపీలో చేరారు. చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత కూడా ఆమె రాజ్యసభ సభ్యురాలిగా, మహిళా విభాగం నాయకురాలిగా సేవలు అందించారు. కానీ, పార్టీలో విభేదాల కారణంగా ఆమె పార్టీ నుంచి బయటకు వెళ్లారు. తన రాజకీయాలను ఏకంగా ఏపీ నుంచి యూపీకి మార్చుకున్నారు.