Pawan Kalyan : ఎవరీ పవన్ కల్యాణ్? లోక్ సభ ఎన్నికల తర్వాత యావత్ దేశం గూగుల్ ని అడిగిన ప్రశ్న ఇదే. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేత శభాష్ అనిపించుకున్నారు పవన్... అందుకేనేమో ఆయన గురించి తెలుసుకోవాలనుకున్నారు. కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులకు సాధ్యంకాని 100% స్ట్రైక్ రేట్ సాధించారు పవన్... అందుకేనా ఆయనగురించి వెతికారు. తన సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు కదిలారు పవన్... మరి అందుకోసమేమో. నటుడిగా అందనంత ఎత్తుకు ఎదిగిన ఆయన డిప్యూటీ సీఎంగా, మంత్రిగానూ ప్రజలకు దగ్గరయ్యారు... మరి అందుకోసమా?
కారణం ఏదయినా ఈ ఏడాది గూగుల్ లో అత్యధికంగా వెతికింది పవన్ కల్యాణ్ గురించే. ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా గూగుల్ చెబుతోంది. 2024 లో భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన విషయాలు, వ్యక్తుల టాప్ 5 లిస్టులు గూగుల్ బైటపెట్టింది. ఇలా అత్యధికంగా సెర్చ్ చేసిన పేర్లలో పవన్ కల్యాణ్ టాప్ 5 లో వుంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి హేమాహేమీలను కాదని పవన్ కల్యాణ్ గురించి తెలుసుకునేందుకు యావత్ దేశం ప్రయత్నించింది.
దేశంలోని రాజకీయ రాజకీయ నాయకుల్లో కేవలం ఇద్దరికి మాత్రమే గూగుల్ సెర్చ్ టాప్ 5 లో చోటుదక్కింది. అందులో ఒకరు పవన్ కల్యాణ్. ఇక హీరోల విషయానికి వస్తే కేవలం పవన్ ఒక్కరే టాప్ 5 సెర్చ్ లో నిలిచారు. మొత్తంగా పవన్ క్రేజ్ తెలుగు రాష్ట్రాలను దాటి పాన్ ఇండియా స్థాయికి చేరుకుందని ఈ 2024 గూగుల్ సెర్చ్ జాబితాను బట్టి అర్థమవుతుంది.