తాను తలుచుకొంటే జిల్లాలో టీడీపీని లేకుండా చేస్తానని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో సంచలనానికి తెరలేపాయి. జిల్లాలో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు వైసీపీ తెరలేపనుందా అనే చర్చ ప్రారంభమైంది.
తమిళనాడు పోలీసులు సీజ్ చేసిన రూ. 5.25 కోట్ల నగదు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చెందిందని టీడీపీ విమర్శలు చేసింది. ఈ విమర్శలపై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా టీడీపీకి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ కూడ అదే స్థాయిలో విరుచుకుపడింది. దీంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బాలినేని శ్రీనివాస్ రెడ్డి టీడీపీపై ఒంటికాలిపై లేచారు.
జిల్లాలో టీడీపీకి చెందిన కీలక నేతలను వైసీపీలో చేర్పించడంలో కీలక పాత్ర పోషించినందుకు తనను టీడీపీ నాయకత్వం లక్ష్యంగా చేసుకొందని మంత్రి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు పాలేటి రామారావు, సిద్దా రాఘవరావులు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు కూడ వైసీపీ తీర్థం పుచ్చుకొన్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సీఎం జగన్ కు మద్దతు ప్రకటించారు. కరణం బలరాం తనయుడు వెంకటేష్ వైసీపీలో చేరాడు.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నాలుగు ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకొంది. ఇప్పటికే ఓ ఎమ్మెల్యే వైసీపీకి జై కొట్టారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడ వైసీపీలో చేరుతారని గతంలో ప్రచారం సాగింది.
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ లతో వైసీపీ నాయకత్వం చర్చలు జరిపిందనే జిల్లా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఏలూరి సాంబశివరావు చివరి నిమిషంలో టీడీపీని వీడకుండా వెనక్కు తగ్గినట్టుగా సమాచారం.
ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ నాయకత్వం వద్ద పెట్టిన షరతుల కారణంగా వారిని పార్టీలో చేర్చుకోలేదని వైసీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే మరోసారి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను తిరిగి వైసీపీలో చేర్చుకొనేందుకు ఆ పార్టీ నాయకత్వం అడుగులు వేస్తోందా అనే అనుమానం మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలతో నెలకొంది.
తాను తలుచుకొంటే జిల్లాలో టీడీపీని లేకుండా చేస్తానని ఆయన హెచ్చరించారు. ఎన్నికల్లో వైసీపీని క్లీన్‌స్వీప్ చేస్తానని ఆయన టీడీపీకి హెచ్చరికలు పంపారు.మైండ్ గేమ్ లో భాగంగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా... ఆపరేషన్ ఆకర్ష్ ను తిరిగి కొనసాగిస్తామనే సంకేతాలను ఇచ్చారా అనే చర్చ సాగుతోంది.రానున్న రోజుల్లో జిల్లా రాజకీయాల్లో మార్పులకు మంత్రి బాలినేని వ్యాఖ్యలు దోహాదం చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.