వామ్మో ... తిరుమల వెంకన్న ఆదాయం అంతుందా...! వడ్డీకాసులవాడికి వచ్చే వడ్డీలెంతో తెలుసా?

First Published Apr 22, 2024, 8:20 AM IST

ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా గుర్తింపుపొందిన ప్రాచీన దేవాలయం తిరుమల ఆదాయంలో రికార్డులు సృష్టిస్తోంది. భక్తులు స్వామివారికి సమర్పించేే నగదు, కానుకలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇలా ఈ ఏడాది కూడా రికార్డ్ స్థాయిలో ఆదాయం వచ్చింది. 

Tirumala

తిరుపతి : ఏడుకొండలపై వెలిసిన కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వర స్వామిని కనులారా చూసి తరించాలని ప్రతి హిందువు కోరుకుంటాడు.   ఒక్కక్షణం శ్రీవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని తన్మయత్వానికి గురవుతారు. కోరిన కోరికలు తీర్చే వైకుంఠవాసుడికి భక్తులు హుండీ, విరాళాలు, బంగారం, వెండితో పాటు విలువైన కానుకల రూపంలో మొక్కులు చెల్లించుకుంటారు.  ఇలా ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం వేల కోట్లకు చేరుకుంటుంది. 
 

Tirumala

ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా నిలిచింది తిరుమల. రోజురోజుకు శ్రీవారి ఆదాయం పెరుగుతూనే వుంది.  ఇలా 2023-24 ఆర్థిక సంవత్సరంలో తిరుమల ఆలయానికి రూ.1,161 కోట్ల నగదు సమకూరినట్లు టిటిడి వెల్లడించింది. దీంతో శ్రీవారితో పాటు టిటిడి పేరిట వివిధ బ్యాంకుల్లో వున్న నగదు నిల్వలు 18,817 వేల కోట్లకు చేరుకున్నాయి. 
 

Tirumala

ఇంటి ఇలవేల్పుగా పూజించే వెంకటేశ్వరస్వామికి డబ్బులనే కాదు బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులను కూడా సమర్పిస్తుంటారు భక్తులు. ఇలా ఈ ఆర్థిక సంవత్సరంలో 1,031 కిలోల బంగారాన్ని భక్తులు స్వామివారికి సమర్పించారు. కేవలం గత మూడేళ్లలోనే స్వామివారికి 4వేల కిలోల బంగారాన్ని సమర్పించారు. దీంతో నిత్యం స్వామివారికి అలంకరించే స్వర్ణాభరణాలు, వివిధ బ్యాంకుల్లో టిటిడి డిపాజిట్ చేసిన బంగారం మొత్తం 11,329 వేల కిలోలకు చేరువయ్యింది.  

Tirumala

ప్రతి నెల శ్రీవారికి హుండీ ఆదాయమే వంద కోట్లకు పైగా వస్తుంది. అలాగే బంగారం, వెండి, ఇతర విలువైన కానుకలు కూడా వస్తుంటాయి. శ్రీవారికి భక్తులు సమర్పించే తలనీలాలు కూడా టిటిడికి ఆదాయ మార్గమే. నిత్యాన్నదానం, ప్రత్యేక వేడుకల కోసం కూడా భక్తులు భారీగా విరాళాలు అందిస్తుంటారు. ఇలా తిరుమల తిరుపతి దేశస్థానం ట్రస్ట్ కు వివిధ మార్గాల్లో ప్రతినెలా వందలకోట్లు సమకూరుతాయి. 
 

Tirumala

 ఆసక్తికరమైన విషయం ఏమిటంటూ వడ్డీకాసుల వాడికి వివిధ బ్యాంకుల నుండి వడ్డీలే రూ.1200 కోట్లు వస్తాయట. ప్రతి నెలా వంద కోట్లకు పైగా స్వామివారి ఆదాయం వుండటంతో అందుకు తగ్గట్లుగానే వడ్డీ పెరుగుతోంది. 2018 లో రూ.750 కోట్లుగా వున్న వార్షిక వడ్డీ ప్రస్తుతం రూ.1200 కోట్లకు చేరుకుంది. దీంతో స్వామివారి ఆదాయం ఏ స్థాయిలో వుంటుందో ఆర్థం చేసుకోవచ్చు. 

Tirumala

 ఆదాయంలోకి కాదు ప్రతిరోజూ అత్యధిక భక్తులు సందర్శించే ఆలయంగా తిరుమలకు మరో రికార్డ్ వుంది. ప్రతిరోజూ దాదాపు 50 వేల నుండి లక్ష వరకు భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తారు. ఇక బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక వేడుకల సమయంలో ఈ సంఖ్య డబుల్ అవుతుంది. ఎక్కువగా భక్తులు కాలినడకన ఏడుకొండలపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు.  
 
 

Tirumala

కేవలం దక్షిణాది రాష్ట్రాల నుండే కాదు ఉత్తర భారతదేశం నుండి కూడా తిరుమలకు భారీగా భక్తులు వస్తుంటారు. సినీ తారలు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా స్వామివారిని దర్శించుకుంటారు. ఇక ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు ప్రజలు తిరుమల వెంకన్నను ఇలవేల్పుగా కొలుస్తుంటారు. 

Tirumala

తిరుమలకు చేరుకోడానికి హైదరాబాద్ నుండి విమాన, రైల్వే, బస్సు సర్వీసులు వున్నాయి. విమానంలో వెళ్లేవారు హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోని విమానాశ్రయాల నుండి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకోవచ్చు.  అక్కడి నుండి తిరుమలకు చేరుకుంటారు. ఇక రైలు, బస్సుల్లో వెళ్లేవారు మొదట తిరుపతి, ఆ తర్వాత తిరుమలకు చేరుకుంటారు. ఇక సొంత వాహనాల్లో కూడా ఎక్కువగా భక్తులు తిరుమలకు చేరుకుంటారు.  

click me!