Tirumala App: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. భక్తులు కోసం ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ఒక సూపర్ యాప్ ను తీసుకొచ్చింది. టీటీడీ తీసుకొచ్చిన ఈ వేంకటాద్రి యాప్ ప్రత్యేకతలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
తిరుమలలో భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేలా వేంకటాద్రి యాప్
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కొండపై వివిధ ప్రాంతాలను గుర్తించడం కొన్నిసార్లు నిజంగా పెద్ద సవాల్‌గా మారుతుంది. ముఖ్యంగా మొదటిసారి వచ్చే వారికి దర్శన క్యూలైన్లు ఎక్కడ ఉన్నాయి, ఉచిత బస్సులు ఎక్కడ దొరుకుతాయి, అన్నప్రసాద కేంద్రం, వసతి గదులు, తలనీలాల సమర్పణ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయనే విషయాలపై స్పష్టత ఉండదు.
ఇలాంటి చిన్న చిన్న సందేహాల వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక అద్భుతమైన సాంకేతిక సేవను తీసుకువచ్చింది. అదే ‘వేంకటాద్రి’ నావిగేషన్ మొబైల్ అప్లికేషన్. భక్తులు కొండపై దారితప్పకుండా తాము వెళ్లాల్సిన ప్రాంతాలకు సులభంగా చేరుకునేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
25
ఇంటర్నెట్ లేకపోయినా సజావుగా పనిచేసే అద్భుతమైన ఫీచర్లు
ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే, తిరుమలలో కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు లేదా ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేకపోయినా ఇది ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తుంది. ఇందులో ప్రత్యేకంగా ఆఫ్‌లైన్ నావిగేషన్ సౌకర్యాన్ని పొందుపరిచారు. అంతేకాకుండా, తిరుమలలోని శ్రీవారి ఆలయం, క్యూ లైన్లు, లడ్డూ కౌంటర్లు, అన్నాప్రసాదం కేంద్రాలు, వసతి గృహాలు, కల్యాకట్టలు, తాగునీటి కేంద్రాలు, ఆస్పత్రులు వంటి ముఖ్యమైన వందకు పైగా ప్రదేశాలు ఇందులో కచ్చితంగా మ్యాప్ చేసి ఉన్నాయి.
భక్తులు తమ ప్రస్తుత లొకేషన్ నుంచి తాము వెళ్లాల్సిన ప్రాంతానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లేదా జీపీఎస్ విధానాల ద్వారా సరైన మార్గాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.
35
గోవింద వాయిస్ అసిస్టెంట్, మార్క్ మై స్పాట్ ప్రత్యేకతలు
ఈ యాప్‌లో భక్తుల సౌకర్యం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత గోవింద వాయిస్ అసిస్టెంట్‌ను కూడా అందుబాటులో ఉంచారు. "సమీపంలో తాగునీరు ఎక్కడ ఉంది?" లేదా "దర్శన లైన్‌కు ఏ వైపు వెళ్లాలి?" వంటి ప్రశ్నలను వాయిస్ ద్వారా అడిగి క్షణాల్లో సమాధానాలు పొందవచ్చు.
అలాగే మార్క్ మై స్పాట్ అనే మరో అద్భుతమైన ఫీచర్ ద్వారా భక్తులు తమ వాహనాలను పార్క్ చేసిన ప్రదేశాన్ని లేదా తాము నిలబడిన ముఖ్యమైన ప్రాంతాన్ని సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల తిరుమలలో వాహనాలు లేదా వస్తువులను వెతుక్కోవాల్సిన శ్రమ పూర్తిగా తగ్గుతుంది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో వివిధ వాహన సేవల సమగ్ర సమాచారాన్ని కూడా ఇందులో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ప్రస్తుతానికి ఈ ‘వేంకటాద్రి’ యాప్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంది. త్వరలోనే యాపిల్ యూజర్లకు కూడా ఈ యాప్‌ను తీసుకురానున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఎవరైనా సరే గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి 'Venkatadri' అని సెర్చ్ చేసి, సరైన యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. తిరుమల కొండపై కొత్తగా వచ్చే భక్తులకు, వృద్ధులకు, పిల్లలతో వచ్చే కుటుంబాలకు ఈ యాప్ ఒక నమ్మకమైన డిజిటల్ గైడ్‌లా అడుగుడుగునా మార్గదర్శనం చేస్తుంది.
55
భక్తులు గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు
ఈ 'వేంకటాద్రి' యాప్ ప్రధానంగా తిరుమల కొండపై వివిధ ప్రదేశాలను గుర్తించి అక్కడికి సులభంగా చేరుకునేందుకు ఒక నావిగేషన్ గైడ్‌లా మాత్రమే పనిచేస్తుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. దర్శన టికెట్లు బుక్ చేసుకోవడం, వసతి గదుల రిజర్వేషన్ వంటి ఇతర సేవల కోసం ఎప్పటిలాగే టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఇతర అధికారిక యాప్‌లను ఉపయోగించుకోవాలి. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఈ సాంకేతిక సేవను సద్వినియోగం చేసుకొని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా ముగించుకోవాలని టీటీడీ కోరుతోంది.