తిరుమల టూ లండన్.. భక్తులు ఇచ్చిన తలనీలాలను ఏం చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.?

Published : Jul 10, 2026, 07:33 PM IST

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల్లో చాలామంది తలనీలాలు సమర్పించడం ఒక పవిత్ర మొక్కుగా భావిస్తారు. ఇంత‌కీ సంప్రదాయం వెనుక ఉన్న పురాణ గాథ, ఆధ్యాత్మిక భావం, చారిత్రక ప్రాముఖ్యతతో పాటు భక్తులు సమర్పించే జుట్టును ఏం చేస్తారో తెలుసుకుందాం. 

PREV
15
నీలాదేవి కథతో ప్రారంభమైన తలనీలాల సమర్పణ

పురాణాల ప్రకారం, వేంకటాద్రిపై శ్రీ వేంకటేశ్వరస్వామి నివసిస్తున్న సమయంలో ఒక సందర్భంలో ఆయన తలకు గాయం అయినట్లు చెబుతారు. ఆ సమయంలో నీలాదేవి అనే గంధర్వ కన్య తన జుట్టులోని కొంత భాగాన్ని కత్తిరించి స్వామివారికి సమర్పించిందని విశ్వసిస్తారు. ఆమె భక్తిని చూసి సంతోషించిన స్వామివారు, తనను దర్శించుకునే భక్తులు సమర్పించే తలనీలాల పుణ్యం నీలాదేవికే చేరుతుందని వరం ఇచ్చినట్లు పురాణ కథనాలు చెబుతున్నాయి. అందుకే తిరుమలలో గుండు చేయించుకోవడం ఒక పవిత్ర సమర్పణగా భావిస్తారు.

25
తలనీలాలు సమర్పించడం వెనుక ఆధ్యాత్మిక భావన

హిందూ సంప్రదాయంలో జుట్టు వ్యక్తి అందానికి, అహంకారానికి ప్రతీకగా భావిస్తారు. దానిని భగవంతునికి సమర్పించడం అంటే అహంకారాన్ని విడిచిపెట్టి సంపూర్ణ శరణాగతి పొందడమేనని ఆధ్యాత్మిక గురువులు వివరిస్తారు. కోరిక నెరవేరిన తర్వాత లేదా కుటుంబ మొక్కు తీర్చుకునే సందర్భంగా భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా, దేవుని కృపకు కృతజ్ఞతగా చేసే పవిత్ర సమర్పణగా కూడా భావిస్తారు.

35
లక్షలాది భక్తులు తలనీలాలు సమర్పిస్తున్న తీరు

తిరుమలలోని కల్యాణకట్టల్లో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు గుండు చేయించుకుంటారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ప్రత్యేక సిబ్బంది, పరిశుభ్రత ప్రమాణాలు, ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఇటీవల తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వేసవి సెలవులు, వారాంతాల్లో ఒక్కోరోజు 50 వేల నుంచి 57 వేల మందికి పైగా భక్తులు తలనీలాలు స‌మ‌ర్పిస్తుంటారు.

45
భక్తులు సమర్పించిన జుట్టు ఎక్కడికి వెళ్తుంది?

భక్తులు సమర్పించిన తలనీలాలను మొదట తిరుమలలో సేకరించి, అనంతరం తిరుపతిలోని ప్రత్యేక కేంద్రానికి తరలిస్తారు. అక్కడ వాటిని శుభ్రపరిచి నాణ్యత, పొడవు ఆధారంగా వేర్వేరు విభాగాలుగా వర్గీకరిస్తారు. సాధారణంగా జుట్టును ఆరు రకాలుగా విభజిస్తారు. 31 అంగుళాల కంటే ఎక్కువ పొడవు, 16 నుంచి 30 అంగుళాలు, 10 నుంచి 15 అంగుళాలు, 5 నుంచి 9 అంగుళాలు, 5 అంగుళాల కంటే తక్కువ, తెల్లజుట్టు లేదా బూడిదరంగు జుట్టుగా డివైడ్ చేస్తారు. పొడవైన, నాణ్యమైన జుట్టుకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంటుంది. ఈ తలనీలాలను టీటీడీ ఈ-వేలం ద్వారా విక్రయిస్తుంది. వీటితో విగ్గులు, హెయిర్ ఎక్స్‌టెన్షన్లు, కాస్మెటిక్ ఉత్పత్తులు తయారుచేస్తారు. ముఖ్యంగా "తిరుపతి హెయిర్ కు లండ‌న్‌, అమెరికా, ఆసియా దేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది.

55
ఈ-వేలం ద్వారా కోట్ల ఆదాయం..

1938 వరకు తలనీలాల విక్రయాలను ప్రైవేట్ సంస్థలు నిర్వహించేవి. అనంతరం 1985 నుంచి టీటీడీ స్వయంగా ఈ బాధ్యతలు చేపట్టింది. 2011లో ఈ-వేలం విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆదాయం మరింత పెరిగింది. నాణ్యమైన పొడవైన జుట్టుకు కిలోకు లక్షలకు చేరువైన ధరలు పలికే సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు చిన్న పొడవు ఉన్న జుట్టుకు తక్కువ ధర లభిస్తుంది. ఈ వేలాల ద్వారా సమకూరే ఆదాయాన్ని టీటీడీ ఆలయ నిర్వహణ, అన్నప్రసాదం, విద్యాసంస్థలు, వైద్య సేవలు, ధార్మిక ప్రచారం, భక్తులకు కల్పించే సౌకర్యాల అభివృద్ధికి వినియోగిస్తోంది. ఇలా తిరుమలలో తలనీలాలు సమర్పించడం అనేది కేవలం ఒక మొక్కు మాత్రమే కాదు. పురాణ విశ్వాసం, భక్తి, ఆధ్యాత్మికత, ఆధునిక నిర్వహణ వ్యవస్థల సమ్మేళనంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన విశిష్టమైన ధార్మిక సంప్రదాయంగా కొనసాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories