
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే సోమవారంనాడు ఆయన విజయవాడకు వెళ్లారు. అక్కడ బిజెపి ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ వైయస్ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో గతంలో పవన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ బండి సంజయ్ ఇప్పుడు ఆయనను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించినట్లుగా కనిపిస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తనదైన స్టైల్ లో ప్రశంసల వర్షం కురిపించారు. అటు వైయస్ జగన్ పై విమర్శలు కురిపిస్తూనే, ఇటు పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచేతడంతో బండి సంజయ్ రూట్ మారిందా? అని చర్చించుకుంటున్నారు. గతంలో తెలంగాణలో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో బండి సంజయ్ పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి మాట్లాడారు. ఇప్పుడు పవన్ మీద ప్రశంసలు కురిపిస్తుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
తెలంగాణలో జరిగిన జీహెచ్ఎంసి ఎన్నికల సమయంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అవసరం తమకు లేదన్నారు. అప్పట్లో బండి సంజయ్ తెలంగాణ బిజెపి చీఫ్ గా ఉన్నారు. అంతేకాదు జనసేన రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లో చూసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో బిజెపితో పొత్తు అవసరం లేదని.. ఆ విషయం ప్రతిపాదనకు రాలేదని.. ఆంధ్రప్రదేశ్ లోనే జనసేనతో బిజెపికి పొత్తు అంటూ ఘాటుగా మాట్లాడారు.
ఆ సమయంలో బండి సంజయ్ వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు తీవ్ర అగ్రహావేశాలకు లోనయ్యారు. తమ అధినేతను అవమానించేలా మాట్లాడారని బండి సంజయ్ పై మండిపడ్డారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రస్తుతం బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవిలో లేరు. పార్టీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
ఏపీలో పూర్తిగా కాకపోయినా… బిజెపి ఓట్ల నమోదు కార్యక్రమం బాధ్యతలను బండి సంజయ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడకు వచ్చిన బండి సంజయ్ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. ఇది తన ఉనికిని చాటుకునేందుకే అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కు చాలా ఫాలోయింగ్ ఉందంటూ మాట్లాడారు. వైసిపి పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి యాత్రను అడ్డుకోవడం హేయమైన చర్య అంటూ వైసీపీపై మండిపడ్డారు.
మూడేళ్ల కిందట జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో బండి సంజయ్ కి ఫుల్ పవర్ ఉండేది. ఆయన మాటే శాసనంగా నడిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులు అయ్యింది. బిజెపిలో ఆయనకు ప్రాధాన్యం తగ్గిపోయింది. బిజెపి అధ్యక్షుడిగా ఏది చెప్తే అదే ఫైనల్ అనే స్థాయి నుంచి ప్రస్తుతం పార్టీలో తన పరిస్థితి అయోమయంగా మారిన స్థాయికి పడిపోయారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా కోల్పోయి.. ఏపీ రాజకీయాల్లోకి అధిష్టానం ఆదేశాల మేరకు అడుగుపెట్టారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి నియమితులయ్యారు. మారుతున్న ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీకి వెళ్లిన బండి సంజయ్ అధికార వైసీపీ మీద విమర్శలు గుప్పించారు.
జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. తాగుబోతులను తాకట్టు పెట్టి జగన్ సర్కార్ అప్పులు చేస్తోందని, ఇలా చేస్తున్న ఏకైక సర్కార్ ఇదేనన్నారు. మధ్య నిషేధ హామీలు ఇచ్చి.. మద్యం బాండ్లు రిలీజ్ చేశారు. డ్రగ్స్, మద్యం, గంజాయి, భూకబ్జాల దందాలతో.. వైయస్ జగన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
వైయస్ జగన్ ఏపీలో మళ్లీ ఎలాగైనా అధికారంలోకి రావడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారన్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి వైసిపి పదివేల ఓట్లకుపైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో పడ్డారంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం రూ. పది లక్షల కోట్ల అప్పు చేసిందని.. దీనికి వడ్డీ రూపంలోనే సంవత్సరానికి రూ.50వేల కోట్లు చెల్లిస్తున్నారని చెప్పుకొచ్చారు.
పనిలో పనిగా తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై కూడా బండి సంజయ్ స్పందించారు. బిజెపి ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన మాట్లాడుతూ.. తిరుమలకు వచ్చే భక్తుల్లో అడుగడుగునా భయాందోళన సృష్టిస్తున్నారని వైసీపీ సర్కార్ పై ఆగ్రహించారు. పెద్ద ఎత్తున హిందూ మతంపై దాడి జరుగుతోందన్నారు. తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులను కాపాడలేక కర్రలు ఇస్తారా అంటూ నిలదీశారు.
కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులు ఉండవు. ఈ సంగతి గుర్తించుకోవాలంటే హితవు పలికారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. భూమన కరుణాకర్ రెడ్డి బిడ్డ పెళ్లి క్రైస్తవ ఆచార పద్ధతిలో చేశారు. ఆయన ఎవరు? ఈ మాట నిజం కాదా? అంటూ ప్రశ్నలు సంధించారు. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి తాను నాస్తికుడు అని చెప్పలేదా? ఆయన రాడికల్ కాదా? అంటూ ప్రశ్నలు కురిపించారు. గతంలో తిరుమలలో అడవులే లేవంటూ టీటీడీ చైర్మన్ చెప్పడం సిగ్గులేనితనమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డికి ‘పుష్ప’ సినిమా చూపించాలంటూ వ్యాఖ్యానించారు.