
ఆంధ్ర ప్రదేశ్ భారీ వరదలతో అతలాకుతలం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు వంకలు వరదనీటితో ఉప్పొంగుతున్నాయి... జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. దీంతో వరదనీరు జనావాసాల్లోకి చేరి ప్రాణనష్టమే కాదు భారీ ఆస్తినష్టం జరిగింది. ముఖ్యంగా విజయవాడలో బుడమేరుకు వరద పోటెత్తడంతో విజయవాడ నగరం మునిగిపోయింది. నగరంలోని పలు కాలనీల్లోకి భారీగా వరదనీరు చేరి భయానక పరిస్థితిని సృష్టించింది.
అయితే ఈ పరిస్థితికి బుడమేరును ఆక్రమించుకోవడమే కారణమని ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆక్రమణల కారణంగా బుడమేరు
సహజ స్వరూపం పూర్తిగా నాశనం అయ్యింది... ఈ నిర్మాణాల వల్లే విజయవాడకు వరద విపత్తు వచ్చిందన్నారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఈ ఆక్రమణలపై దృష్టిపెట్టి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
నదీ పరివాహక ప్రాంతాలు, డ్రైయిన్లు, వాగులు, వంకలు, చెరువుల్ని ఆక్రమించి ఇష్టానుసారం లే అవుట్లు వేయడం, ఇళ్ల నిర్మాణం చేయడం వల్లే వరదలు తప్పడం లేదన్నారు పవన్ కల్యాణ్. చిన్నపాటి వర్షాలకే పెద్ద నష్టం వాటిల్లడానికి ఈ ఆక్రమణలే కారణమన్నారు. ఇది ఏ ఒక్కరి తప్పో, ఏ ప్రభుత్వం తప్పో అని చెప్పడంలేదు... కానీ తప్పు మాత్రం జరిగిపోయిందన్నారు. కొంత కాలంగా ఈ ఆక్రమణలు సాగుతూనే ఉన్నాయని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేసారు.
హైడ్రా గురించి పవన్ ఏమన్నారంటే :
సహజంగా ఏర్పడిన నదులు, వాగులు, చెరువులను ధ్వంస చేయడంవల్ల అనేక అనార్థాలు జరుగుతున్నాయని పవన్ పేర్కొన్నారు. ఆక్రమణలు జరిగాక గుర్తించి ధ్వంసం చేయడంకంటే... ముందుగా గుర్తించే వ్యవస్థ ఉండాలన్నారు. అలాగైతేనే ఇలాంటి వరదలను అడ్డుకోగలమని అన్నారు.
కేంద్ర అటవీశాఖ ఆధ్వర్యంలో అడవులపై పూర్తి స్థాయి పర్యవేక్షణ వ్యవస్థ ఉంటుంది... ఏ మాత్రం అడవుల్లో చిన్న అతిక్రమణ జరిగినా శాటిలైట్ చిత్రాల ద్వారా నిమిషాల్లో గుర్తించే సాంకేతికత వారి దగ్గర ఉందన్నారు పవన్. అలాంటి సాంకేతికత నదీ పరివాహక ప్రాంతాలు, వాగులు, వంకలు, చెరువులను ఆక్రమించే వారిపైనా ఉంటేనే ఎప్పటికప్పుడు ఆక్రమణలను గుర్తించవచ్చు... విపత్తుల నుంచి రక్షించుకోగలమని అన్నారు.
ఒక అక్రమ నిర్మాణాన్ని ధ్వంసం చేసే కంటే.. దాన్ని నిర్మించక ముందే అడ్డుకోవడం ఉత్తమ మార్గమని పవన్ పేర్కొన్నారు. ఒక నిర్మాణాన్ని లేదా నివాసాన్ని తొలగించాలంటే సామాజిక పరిస్థితులు, న్యాయపరమైన అడ్డంకులు బోలెడు ఉంటాయి. వాటన్నింటినీ సరైన చర్చల ద్వారా, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా మాత్రమే అధిగమించవచ్చని అన్నారు.
హైదరాబాద్ లో హైడ్రా చేస్తున్న పని సరైనదేనని పవన్ అన్నారు. అయితే ఏ ప్రభుత్వం అయినా ముందుగా నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవాలని... అప్పుడే ఎలాంటి ప్రకృతి విపత్తులు జరగవని అన్నారు. ఓసారి నాశనం చేసాక తిరిగి సహజ పరిస్థితికి వచ్చేందుకు సమయం పడుతుందంటూ హైడ్రా గురించి పవన్ ఆసక్తికర కామెంట్స్ చేసారు.
గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు నివాస కాలనీలు కట్టబెట్టింది... అంటే వరదలతో మునిగిపోయే ప్రాంతాలను ఎంపిక చేసి ప్రజలకు నివాసాలు కేటాయించడం ఎలాంటి చర్యో అర్ధం అవుతుందని పవన్ ఆందోళన వ్యక్తం చేసారు. క్షేత్ర స్థాయిలో పంచాయతీ లేఅవుట్లు వేసినప్పుడే దాన్ని అడ్డుకుంటే మొదట్లోనే అక్రమ నిర్మాణాలను అడ్డుకోవచ్చన్నారు పవన్.
చంద్రబాబుపై పవన్ ప్రశంసలు :
అనుకోని ప్రకృతి విపత్తు వరదల రూపంలో ఆరు జిల్లాలపై విరుచుకుపడిందని పవన్ అన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాపై విరుచుకుపడిన వేళ కూటమి ప్రభుత్వం బలంగా పని చేసిందన్నారు. వరద బాధితులకు భరోసా ఇచ్చేలా యంత్రాంగం కదిలిందన్నారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ, ఎన్నో సవాళ్లు పాలనలో కనిపిస్తున్నా సమర్ధంగా యంత్రాంగాన్ని నడపడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఉపముఖ్యమంత్రి అన్నారు. చంద్రబాబు అనుభవం, పాలనలోని మెలకువలు ఈ విపత్తును ఎదుర్కోవడంలో బాగా పని చేశాయన్నారు.
74 ఏళ్ల వయసులో మూడు రోజులుగా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు వరద బాధితులను ఆదుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటే ఆయన శ్రమను గుర్తించకుండా వైసీపీ నాయకులు అడ్డగోలుగా విమర్శలు చేయడం సరికాదు. వరద నీటిలో దిగి, ప్రొక్లైనర్లు ఎక్కి, బోట్లలో బాధితుల వద్దకు వెళ్తున్నారు.
వదరల్లో చిక్కుకున్న వారి కోసం అందరూ నిద్రాహారాలు మాని కష్టపడుతున్నారని పవన్ తెలిపారు. ప్రజలకు వచ్చిన సమస్య ఏదైనా రాజకీయాలకు అతీతంగా స్పందించాలన్నారు. వైసీపీ నాయకులు కూడా అనవసరమైన విమర్శలు మానుకుని సహాయక చర్యల్లో పాల్గొనే విషయంలో ముందుకు రావాలని పవన్ సూచించారు.
వరదల వేళ ఎందుకు పర్యటించలేదంటే...
వరదల వేళ డిప్యూటీ సీఎం విజయవాడ రాలేదంటూ విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులకు పవన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. విపత్తు వేళ క్షేత్ స్థాయికి వెళితే చుట్టూ జనం గుమిగూడి సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందే వెళ్లలేదన్నారు. పోలీసులు, ఇతర అధికారుల పనితీరుకు విఘాతం కలిగించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.
ఇంకా తనపై విమర్శలు చేయాలి అనుకునే వైసీపీ నాయకులు ఎవరైనా వున్నారా? వుంటే తనతో కలిసి పర్యటనకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో స్వయంగా చూపిస్తాననని పవన్ అన్నారు. వైసీపీ నాయకులు ఇళ్లలో కూర్చుని సోషల్ మీడియాలో మాట్లాడడం కాదు.... క్షేత్ర స్థాయికి రావాలని సూచించారు. వరద బాధితులకు మీవంతు సహాయం చేయండి.... అంతేగాని ఆపద వేళ అనవసరపు విమర్శల వల్ల ఏ ప్రయోజనం ఉండదన్నారు.
సినిమా రంగంలో అనేకమంది స్పందించి విరాళాలు ప్రకటించారు... అలాగేమానవతా దృక్పథంతో అందరూ స్పందించాలన్నారు. వైసీపీ నాయకులు కూడా ఆపద వేళ అనవసరపు మాటలు మానుకుని జేబులో డబ్బును తీసి విరాళంగా ఇచ్చి ఆదుకోవాలన్నారు.
సినిమా రంగంలో ఉన్నవారి సంపాదన కంటే హడావిడి ఎక్కువ ఉంటుంది... ఇతర రంగాల్లో అక్కడి కంటే ఎక్కువ సంపాదన, ఆస్తి ఉంటుందన్నారు. సినిమావాళ్ళ దగ్గరకంటే జగన్ దగ్గరే ఎక్కువ సంపద ఉంటుంది... వారి కుటుంబ సిమెంట్ కంపెనీ విలువే ఎక్కువ ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. కాబట్టి ఆయన కూడా ఈ ఆపత్కాలంలో విరాళం ఇవ్వాలని పవన్ కోరారు.