AP Localbody Elections 2026 : అధికార టిడిపిని వీడి వైసిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే... ఎవరీ లక్ష్మీదేవి?

Published : Oct 22, 2026, 03:47 PM ISTUpdated : Oct 22, 2026, 03:56 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా అధికార టిడిపిని వీడి వైసిపిలోకి జంప్ అయ్యారో మాజీ ఎమ్మెల్యే. ఎవరో తెలుసా?

PREV
14
టిడిపికి షాక్... వైసిపిలో జాయినింగ్స్

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నామినేషన్లు కూడా ముగిశాయి... ఎంపిటిజి, జడ్పిటిసి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే పంచాయితీ ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభంకానుంది. ఇలా రాష్ట్ర రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్న సమయంలో అధికార తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీ సినియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి టిడిపికి గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

24
ఎవరీ గుండ లక్ష్మీదేవి?

గుండ లక్ష్మీదేవి శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఈమె 2014 నుండి 2019 వరకు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈమె గతంలో శ్రీకాకుళం మున్సిపాలిటీ కౌన్సిలర్, వైస్ ఛైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. మొదటిసారిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మరణం తర్వాత లక్ష్మీదేవీ రాజకీయాల్లో మరింత యాక్టివ్ గా మారారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరపున మరోసారి ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆమె మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమెకు టిడిపి మళ్లీ అవకాశం ఇవ్వలేదు... 2024 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు.

34
మాజీ ఎమ్మెల్యే రాజీనామా వెనకున్న రీజన్ ఇదే..

మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి ఎమ్మెల్యేగా అవకాశం దక్కకున్నా మేయర్ గా అయినా అవకాశం వస్తుందని భావించారు. అయితే కూటమి పార్టీల మధ్య పొత్తులో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పోరేషన్ జనసేన పార్టీకి దక్కింది… టిడిపి పోటీనుండి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న లక్ష్మీదేవి మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్ ల ఆహ్వానం మేరకు వైసిపి కండువా కప్పుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో గుండ లక్ష్మీదేవి వైసిపిలో చేరారు. ఆమెతో పాటు మరికొందరు నాయకులు, కార్యకర్తలు కూడా వైసిపి కండువా కప్పుకున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. వైసిపి తరపున శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా ఈమె పోటీలో నిలిచే అవకాశాలున్నాయి.

44
వైసిపిలోకి చేరికలు..

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన పాఠంశెట్టి సూర్యచంద్ర, ఆయన సతీమణి శ్రీదేవి కూడా వైసిపిలో చేరారు. ముఖ్య అనుచరులతో కలిసి ఈ దంపతులు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ వారికి సాదరంగా ఆహ్వానించారు.

జగ్గంపేట నియోజకవర్గ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పాఠంశెట్టి సూర్యచంద్ర మూడుసార్లు బూరుగుపూడి గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా, 2024 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. పాఠంశెట్టి దంపతులు ఎన్నికల వేళ వైసిపిలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది.

Read more Photos on
click me!

Recommended Stories