ప్రతి ఫ్లోర్‌లో మహిళా కానిస్టేబుళ్లు.. విచారణకు ప్రత్యేకాధికారులు.. గుడ్లవల్లేరులో ఏం జరుగుతోంది?

First Published | Aug 30, 2024, 8:43 PM IST

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. విద్యార్థినుల హాస్టల్‌లో స్పై కెమెరాలు అమర్చారని.. వీడియోలు రికార్డు చేశారని ఆందోళన చేపట్టారు. ఈ ఘటనను సీఎం చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు.

Gudlavalleru Engineering college

‘‘లేడీస్‌ హాస్టల్‌ వాష్‌ రూమ్స్‌లో రహస్య కెమెరాలు.. 300 వీడియోలు లీక్..’’ అంటూ గురువారం అర్ధరాత్రి నుంచి సోషల్‌ మీడియాలో పోస్టులు తెగ వైరల్‌ అయిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీలో విద్యార్థినుల వాష్‌ రూమ్స్‌లో ఓ విద్యార్థి సీక్రెట్‌ కెమెరాలు అమర్చాడని... వాటి ద్వారా వందల వీడియోలు రికార్డు చేశారని అర్ధరాత్రి నుంచి స్టూడెంట్స్‌ ఆందోళనకు దిగారు. బీటెక్‌ చదువుతున్న విద్యార్థులందరూ హాస్టల్‌ గదుల్లో నుంచి బయటకు వచ్చి... పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న ఓ విద్యార్థి ఈ పని చేశాడంటూ.. అతనిపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు సైతం అతణ్ని అదుపులోకి తీసుకొని.. సెల్‌ ఫోన్‌, ల్యాప్‌ టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. 

Chandra Babu

ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో అంతటా కలకలం రేపడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్‌ అయ్యారు. తక్షణమే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్‌లో రహస్య కెమేరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీకి చేరుకున్నారు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర. జిల్లా కలెక్టరు, ఎస్పీతో కలిసి కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. విద్యార్థినులు, విద్యార్థులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు.


తప్పు చేయాలంటే భయపడేలా చర్యలు: కృష్ణా జిల్లా ఎస్పీ

ఈ ఘటనపై స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్‌ రావు... గుడ్లవల్లేరు శేషాద్రి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన సంఘటనపై ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో అందరూ మహిళా పోలీసు అధికారులే ఉన్నారని చెప్పారు. గుడివాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇ.రమణమ్మను ప్రత్యేక అధికారిగా నియమించామన్నారు. ఆమెతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఐటీ కోర్ ఎస్సై మాధురి, కమ్యూనికేషన్ పోలీస్ సిబ్బంది నలుగురుతో కలిపి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.  ఈ విచారణ శాస్త్రీయబద్ధంగా, పారదర్శకంగా జరుగుతుందన్నారు.ఈ కేసులో ప్రస్తుతానికి ఎవరైతే బాధ్యులుగా విద్యార్థిని, విద్యార్థి పేరు చెబుతున్నారో... వారి సెల్ ఫోను, లాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ గంగాధర్‌ రావు తెలిపారు. వాటిలోని ప్రతి చిత్రాన్ని, డాక్యుమెంట్‌ని శాస్త్రీయబద్ధంగా పరిశీలిస్తామని చెప్పారు. ఏ చిన్న మెటీరియల్‌ గానీ, వీడియో గానీ లభించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ చర్యలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే... అలాంటి పనులు ఇకమీదట ఎవరూ చేయడానికి సాహసించరన్నారు. అంతేకాకుండా, ఈ విచారణ ఎన్ఎల్‌జేడీ (నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్) పరికరం ద్వారా క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా పోలీసు యంత్రాంగానికి కొంత వెసులుబాటు కల్పిస్తే... అన్ని విధాలా పరిశీలించి వాస్తవాలు వెలికి తీస్తామన్నారు.

ప్రతి ఫ్లోర్‌కి ఇంచార్జిగా పోలీసులు..

కాగా, గుడ్లవల్లేరు శేషాద్రి ఇంజినీరింగ్ కళాశాలలోని బాలికల వసతి గృహంలో విచారణ ప్రత్యేక అధికారి సీఐ రమణమ్మ, ఎస్సై పూర్ణమాధురి నేతృత్వంలో పోలీసు బృందం 10 మంది విద్యార్థినులతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి స్నానపు గదుల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల అనంతరం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిశారు. ఈ సందర్భంగా బాలికల వసతి గృహం వద్ద  విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి... పూర్తి రక్షణ కల్పిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర విద్యార్థినులకు భరోసా ఇచ్చారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. బాలికల వసతి గృహంలో ప్రతి ఫ్లోర్‌కు మహిళా కానిస్టేబుళ్లను ఇంఛార్జులుగా నియమించినట్లు ఎస్పీ గంగాధర్ రావు తెలిపారు. విచారణ స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరుగుతుందని... ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థినులకు చెప్పారు.

Minister Kollu Ravindra

అనుమానాలున్న మాట వాస్తవమే..: మంత్రి కొల్లు రవీంద్ర 
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్లో కెమెరాలున్నాయనే ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్ర కొల్లు రవీంద్ర తెలిపారు. ‘‘ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్లో కెమెరాలు ఏర్పాటు చేశారని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారనే వార్త రాగానే ప్రభుత్వం అప్రమత్తమై... గురువారం రాత్రే జిల్లా యంత్రాంగాన్ని ఇంజినీరింగ్ కాలేజీకి పంపించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్నారన్నారు. ఘటనా స్థలికి వెళ్లి సమస్యను పరిశీలించాలని ఆదేశించారని తెలిపారు. కెమెరాలు ఉన్నాయనే విషయం రెండు రోజుల క్రితమే తెలిసిందని... వార్డెన్, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడం కారణంగానే ఆందోళనకు దిగామని విద్యార్థులు చెప్పారన్నారు. 
ఇలాంటి ఘటనలు అత్యంత బాధాకరమని... పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఐదుగురు మహిళా అధికారుల బృందాన్ని నియమించిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏవైనా రికార్డింగ్స్ సెల్ ఫోన్లలో ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నామన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి నిర్దారణకు రాలేదని, అనుమానాలున్న మాట వాస్తవమేనని మంత్రి తెలిపారు. ఆడపిల్లల విషయంలో తప్పు చేయాలంటే భయపడేలా బాధ్యులపై చర్యలుంటాయని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

ys jagan

కాగా, ఈ ఘటనపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీలో గత అర్ధరాత్రి (గురువారం) నుంచి 300 మంది విద్యార్ధినులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని, వారం రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నా, దీనిపై విద్యార్థినిలు ఫిర్యాదు చేసినా కళాశాల యాజమాన్యం ఎందుకు తొక్కిపెట్టిందో చెప్పాలని డిమాండ్‌ చేసింది.

చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని మాజీ సీఎం జగన్‌ మండిపడ్డారు. ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని.... ప్రతిపక్ష పార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గొలికొదిలేశారని విమర్శించారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీ సహా గవర్నమెంటు రెసిడెన్షియల్‌ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందలమంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలేమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. పిల్లలకు నాణ్యతతో, రోజూ ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్నీ అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారన్నారు. మరోవైపు, గుడ్లవల్లేరు ప్రయివేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో హిడెన్‌ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని జగన్‌ పేర్కొన్నారు. ఇది విద్యార్థుల జీవితాలను అతాకుతలంచేసే ఘటన అని... చంద్రబాబు ఇకనైనా మేలుకోవాలని హితవు పలికారు.

సీఎం చంద్రబాబు ఆదేశాలు

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులను, మంత్రి కొల్లు రవీంద్రను, జిల్లా ఎమ్మెల్యేలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన ముఖ్యమంత్రి..... ఉదయం నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి విచారణ సాగుతున్న విధానంపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినుల ఆందోళనను, ఆవేదనను పరిగణలోకి తీసుకుని... పటిష్ట దర్యాప్తు జరపాలని ఆదేశించారు. రహస్య కెమెరాల ద్వారా వీడియోల చిత్రీకరణ జరిగిందన్న విషయంలో... నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో... అంతే సీరియస్‌గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. ఆందోళనలో ఉన్న వారికి ఒక భరోసా కల్పించాలని సీఎం ఆదేశించారు. విద్యార్థుల ఫిర్యాదును యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణపైనా విచారణ జరపాలన్నారు. కాలేజ్ యాజమాన్యం, అధికారుల అలసత్వం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థినుల వద్ద ఆధారాలు ఉంటే... నేరుగా తనకే పంపాలని ఆయన కోరారు. స్టూడెంట్స్ ఎవరూ అధైర్య పడవద్దని, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..... ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆడబిడ్డల పట్ల తప్పుగా ప్రవర్తించారని తేలితే కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి మూడు గంటలకు ఒక సారి తనకు ఘటనపై రిపోర్ట్ చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. వ్యవహారంపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సూచించారు.
 

Latest Videos

click me!