త్వరలోనే కేబుల్ టీవీకి మంగళం
ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఇంటికీ అత్యంత చౌక ధరకే ఇంటర్నెట్, టీవీ చానెళ్లకు అందించడానికి గతంలో తీసుకొచ్చిన ఏపీ ఫైబర్ నెట్ ని మరింత విస్తరించాలని కంకణం కట్టుకుంది. ఒకటీ రెండూ కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల ఇళ్లకు తమ సేవలను అందించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇది అమలైతే రాష్ట్రంలో ప్రధాన MSOలు, కేబుల్ టీవీ దాదాపు కనుమరుగు అవడం ఖాయం. దీంతో కేబుల్ టీవీ చానెళ్లలో పని చేసేవారు, కేబుల్ టీవీ రంగ కార్మికుల్లో ఆందోళన మొదలైంది.
అడ్డుకునే కుట్రలు
గత కొంత కాలంగా తీవ్రంగా సబ్ స్క్రైబర్లను నష్టపోతున్న కేబుల్ టీవీ సంస్థలు ఇప్పుడు తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీనికి తోడు ఈ ఏపీఫైబర్ నెట్ విస్తరిస్తే.. తమ మనుగడే ప్రశ్నార్థకం కానుంది. దీంతో కొందరు ఎలాగైనా ఏపీ ఫైబర్ నెట్‌ను తమ నెట్ వర్క్ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకోవాలని ఆలోచిస్తున్నారు. తమకు బాగా పట్టున్న విజయవాడ, నెల్లూరు, ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం తదితర నగరాల్లో ఏపీ ఫైబర్ నెట్ సేవలు విస్తరించకుండా పలుకుబడి కలిగిన ఎంఎల్‌ఏలు, ఎంపీల ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు మొదలెట్టాలని కసరత్తు చేస్తున్నారు.