ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా రంగానికి మంచిరోజులు వచ్చాయని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. క్రీడలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. సుప్రసిద్ధ భారతీయ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టినరోజును పురస్కరించుకొని ఏటా జరుపుకునే జాతీయ క్రీడాదినోత్సవాన్ని గురువారం విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించారు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి హాజరవగా.. పలువురు ప్రముఖ క్రీడాకారులు కూడా పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో భాగంగా తొలుత మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. క్రీడారంగ ప్రముఖులతో కలిసి మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా క్రీడా కాన్వాస్‌పై సంతకాలు చేశారు. వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, క్రీడాకారులు, క్రీడల ఔత్సాహికులతో ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ చేయించారు. చురుకైన, ఆరోగ్యకర జీవనశైలిని పెంపొందించడానికి నా ఫిట్‌నెస్, ఆరోగ్యం కోసం రోజూ 30 నిమిషాలు కేటాయిస్తాను.. నా కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారిని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహిస్తాను.. అంటూ ప్రతిజ్ఞ చేయించారు.
Minister Mandipalli RamPrasad reddy
నెల జీతం విరాళం ప్రకటించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి. హాకీ క్రీడ ద్వారా దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిన మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినాన్ని జాతీయ క్రీడాదినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని యువత ఏదో ఒక ఇష్టమైన క్రీడను ఎంచుకొని.. అందులో రాణించేందుకు శాయశక్తులా కృషిచేసి రాష్ట్రానికి, దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు శారీరకంగా దృఢంగా ఉండేందుకు ఫిట్‌నెస్‌పైనా దృష్టిసారించాలని.. రోజులో కనీసం 30 నిమిషాలు ఇందుకు కేటాయించాలని సూచించారు. 2014-19 మధ్యకాలంలో రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు అమలుచేయడం జరిగిందని.. ఇప్పుడు మళ్లీ రాష్ట్ర క్రీడారంగానికి, క్రీడాకారులకు, కోచ్‌లకు, స్పోర్ట్స్ అకాడమీలకు మంచిరోజులు వచ్చాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ వల్లే రాష్ట్రానికి చెందిన ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తమ సత్తా చాటి, పేరు తెచ్చారన్నారు. క్రీడల పట్ల ఆసక్తి చూపే వారికి శాప్ నుంచి పూర్తి సహాయసహకారాలు ఉంటాయని.. ఔత్సాహికులు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఖేల్ ఇండియా, ఇతర కార్యక్రమాల ద్వారా కేంద్రం నుంచి కూడా సహాయ సహకారాలు అందుకొని మైదానాల అభివృద్ధికి, క్రీడా సామగ్రిని సమకూర్చుకోవడం, అత్యుత్తమ శిక్షణ తదితరాలకు కృషిచేయనున్నట్లు తెలిపారు. త్వరలో క్రీడా రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేయనున్నారని.. పేద క్రీడాకారులకు ఆర్థికంగా సహాయసహకారాలు అందించేందుకు రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు కార్పస్ ఫండ్ ఏర్పాటుచేసే అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. మన దగ్గర యువశక్తికి కొదవలేదని.. వారిని ప్రోత్సహించి, సరైన శిక్షణ అందించి అంతర్జాతీయ వేదికలపై రాణించి, పతకాలు సాధించే దిశగా కృషి చేస్తానని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. శాప్ ద్వారా పేద క్రీడాకారులను గుర్తించి వారికి సరైన శిక్షణ, కిట్లను అందించేందుకు తన నెల జీతం రూ.3,16,000ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి విరాళంగా ప్రకటించారు.
క్రీడా ఆణిముత్యాలకు సత్కారం
జాతీయ క్రీడాదినోత్సవంలో భాగంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. పీవీ సింధు, శాప్ వీసీ, మేనేజింగ్ డైరెక్టర్ పీఎస్ గిరీష, ఉన్నతాధికారులతో కలిసి క్రీడా ఆణిముత్యాలను ఘనంగా సత్కరించారు. ధీరజ్ శ్రీకృష్ణ (ఆర్టిస్టిక్ యోగా), జి.నగేష్ బాబు (బాస్కెట్ బాల్), భావన (సాఫ్ట్ టెన్నిస్), ఎం.అంకిత (వాలీబాల్), గిరిబాబు (వాటర్ స్పోర్ట్స్)లను సన్మానించారు.
అనంతరం క్రీడాకారులు, ఉన్నతాధికారులతో కలిసి ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద మెగా ర్యాలీని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఆర్చరీ అంతర్జాతీయ క్రీడాకారుడు బి.ధీరజ్, అథ్లెటిక్స్ అంతర్జాతీయ క్రీడాకారిణులు యర్రాజి జ్యోతి, జ్యోతికశ్రీ తదితరులతో పాటు శాప్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.