దుర్గమ్మ సన్నిధిలో సంక్రాంతి సంబరాలు... సర్వాంగసుందరంగా ముస్తాబైన ఇంద్రకీలాద్రి

First Published Jan 14, 2022, 1:40 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తలు, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.  

విజయవాడ: ఇరు తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయి. ఇళ్లలోనే కాదు దేవాలయాల్లోనూ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ దుర్గమ్మ దేవాలయాలను సంక్రాంతి పండగ సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసారు. ఈ క్రమంలో ఇవాళ్టి నుండి ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్దానంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. 

సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 14 నుంచి 16వ తేది వరకు ఇంద్రకీలాద్రిపై ప్రత్యేకంగా ఆద్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. శుక్రవారం భోగిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో  సాంప్రదాయబద్దంగా రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు. అలాగే గంగిరెద్దులు, హరిదాసులు, మేళతాళాలు, బోగి మంటలతో వైభవంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. 

శుక్రవారం ఉదయం ఆలయ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు నాగవెంకట వరలక్ష్మితో పాటు ఆలయ అధికారులు వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా భోగి మంటలు అంటించారు. అనంతరం వీరంతా మంటల చుట్టూ ప్రదక్షిణలు చేసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. గోమాత పూజ నిర్వహించి ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 
 

అనంతరం మహామండపం 7వ అంతస్తులోని పెద్ద రాజ గోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన బొమ్మ కొలువును ఆలయ ఈవో, పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు దంపతులు ప్రారంభించారు. భోగి సందర్భముగా అమ్మవారి దర్శనార్థము విచ్చేసిన భక్తులు దేవస్థానం వారు ఏర్పాటుచేసిన భోగి మంటలు, బొమ్మకొలువు, ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు చూసి ఆనందించారు. 

సాయంత్రము పెదరాజ గోపురం ఎదురుగా ఉన్న బొమ్మలకొలువు వద్ద ఏర్పాటు చేసిన ఉత్సవమూర్తుల వద్ద చిన్నపిల్లలకు సాయంత్రం భోగి పళ్ళు పోయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. కావున భక్తులు కోవిడ్ నియమాలను పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ చైర్మన్, ఈవో సూచించారు. 
 

ఈ కార్యక్రమములో ఆలయ కార్యనిర్వహణాధికారితో పాటు వైదిక కమిటీ సభ్యులు, కార్యనిర్వాహక ఇంజినీర్లు కె. వి.ఎస్.కోటేశ్వరరావు, లింగం రమాదేవి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు, పర్యవేక్షకులు, ఇతర దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
 

click me!