ఇందులో భాగంగా ఆగస్టు 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ గ్రామసభల్లో లక్షలాది గ్రామీణులు, రైతులు, కూలీలు, అధికారులు, కలెక్టర్లు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వానపల్లి గ్రామంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మైసూరవారిపల్లెలో నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొన్నారు. ఈ సభల్లో మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో సాగించే అభివృద్ధి పనులు మీద, వివిధ పథకాలు ఉపయోగించుకొని గ్రామాలు ఎలా అభివృద్ధి బాటలో సాగలన్నదానిపై విస్తృత్తంగా చర్చ జరిగింది. గ్రామసభల్లో ఒకేరోజున రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,500 కోట్ల పనులను ఆమోదించారు. 87 విభిన్న పనులకు సంబంధించి తీర్మానాలు చేశారు. ఈ పనుల వల్ల 9 కోట్ల మందికి ఉపాధి లభించేలా, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి ఫలాలు అందేలా గ్రామసభల్లో నిర్ణయాలు జరిగాయి. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, పశువుల పాకలు, చెరువుల పూడికతీత, హార్టికల్చర్ పనులు, చెక్ డ్యాం నిర్మాణం, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు తదితర పనులను చేసుకునేందుకు గ్రామస్థులంతా ఒకేసారి రాష్ట్రంలో ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామసభలను తూతూమంత్రంగా నిర్వహించకుండా గ్రామీణులంతా కలిసి కూర్చొని చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకునేలా చైతన్యం కలిగించింది. మహిళలు, యువత గ్రామసభలకు తరలివచ్చి గ్రామానికి ఏమి అవసరమో దానిపై చర్చించి, తీర్మానం చేసేలా ప్రోత్సహించింది.