
మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అన్న చిరంజీవిని మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. జనసేన పేరుతో సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకున్న పవన్.. 9 ఏళ్లు గడిచినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారనే విశ్లేషణలు ఉన్నాయి.
అయితే పవన్ ఫుల్ టైమ్ రాజకీయాలు చేయడం లేదనే విమర్శ కూడా ఉంది. అయితే ప్రస్తుతం రాజకీయ రంగంలోకి కొనసాగుతున్న పవన్ కల్యాణ్.. తన ఆర్థిక అవసరాల కోసం కొంత సమయం సినిమాలకు కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు పవన్ వ్యక్తిగత జీవితంపై రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటారు. అలాగే రానున్న ఎన్నికలకు సంబంధించిన పొత్తులు, ఇతర అంశాలను చూస్తే.. ప్రస్తుతం ఆయన పొలిటికల్ చౌరస్తాలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.
ఇక, నేడు పవన్ కల్యాణ్ తన 52వ రోజు పుట్టినరోజు జరపుకుంటున్నారు. అయితే రానున్న ఏడాది కాలం.. పవన్ రాజకీయ జీవితంలో కీలకంగా మారనుంది. పవన్ పార్టీ ప్రజలకు చేరువవుతుందా?, పవన్ చట్టసభల్లోకి అడుగుపెట్టే అవకాశం లభిస్తుందా? జనసేన భవిష్యత్ ఎలా ఉండనుంది?.. వంటి అనేక ప్రశ్నలకు సమాధానం దొరకనుంది.
పవన్ రాజకీయ పరిణామాన్ని గమనిస్తే.. తొలుత చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో యువరాజ్యం చీఫ్‌గా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనంతో పవన్ రాజకీయాలకు దూరమయ్యారు. 2014కు ముందు జనసేనతో రాజకీయ పార్టీని స్థాపించి.. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచి, ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండిపోయారు.
అయితే 2019 నాటికి టీడీపీ, బీజేపీలపై విమర్శలు చేసిన పవన్ కల్యాణ్.. వామపక్షాలు, బీఎస్పీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఆ ఎన్నికల్లో పవన్‌కు చేదు అనుభవం ఎదురైంది. పోటీ చేసిన రెండు చోట్ల పవన్ ఓడిపోయారు. జనసేన నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలిచారు. మరోవైపు పవన్ కూడా వామపక్షాల పొత్తు తెంచేసుకుని.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరారు.
అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం, కేంద్రంలో బీజేపీతో సఖ్యతగా ఉండటం.. ఇటు రాష్ట్రంలో టీడీపీ, జనసేనలకు ఇబ్బందికరంగా మారింది. బీజేపీతో జనసేన పొత్తులో ఉన్నప్పటికీ.. ఆ పార్టీ నుంచి పవన్‌కు పెద్దగా మద్దతు లభించిన దాఖలాలు లేవు. మరోవైపు ఏపీలో వైసీపీని ఎదుర్కొవాలంటే బలమైన ప్రతిపక్షం అవసరమైన విశ్లేషణలు ఉన్నాయి.
అయితే ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడించడం పవన్ కల్యాణ్‌కు కూడా చారిత్రక అవసరంగానే మారింది. దీంతో వైఎస్ జగన్‌ను గద్దె దించేందుకు తాను కృషి చేస్తానని.. ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తానని పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ వేస్తున్న అడుగులు.. టీడీపీతో కలిసి పనిచేయనున్నారనే సంకేతాలు ఇస్తున్నాయి. అటువైపు నుంచి కూడా అదే రకమైన సంకేతాలు వెలువడుతున్నాయి.
అయితే అటు జనసేన నుంచి గానీ, ఇటు టీడీపీ నుంచి గానీ.. ఏటువంటి అధికార ప్రకటన మాత్రం లేకుండా పోయింది. మరోవైపు బీజేపీ మాత్రం ప్రస్తుతానికి జనసేతో పొత్తులో ఉన్నామని.. టీడీపీ విషయంపై పార్టీ అధిష్టానం చూసుకుంటోందని చెబుతుంది. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం ఇరు పార్టీల మధ్య అలాంటి సఖ్యత కనిపించడం లేదు. ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన ఎన్డీయే కూటమి సమావేశానికి పవన్ హాజరయ్యారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో విపక్షాలకు సంబంధించిన పొత్తులపై ఏ మాత్రం క్లారిటీ లేకుండా పోయింది.
అయితే పవన్ రాజకీయంగా తన ఉనికిని సజీవంగా ఉంచడానికి, క్యాడర్‌లో విశ్వాసం నింపడానికి.. రానున్న ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. అయితే జనసేన ఒంటరిగా పోటీ చేసిన మంచిదే కానీ.. బీజేపీతో కలిసి వెళ్లొద్దని ఆ పార్టీ శ్రేణుల్లో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. జనసేనలో కొందరు టీడీపీతో పొత్తును స్వాగతిస్తుంటే.. మరికొందరు పొత్తే వద్దని అంటున్నారు.
దీంతో పవన్ ముందు పెద్ద టాస్కే ఉంది. మరోవైపు తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.. అక్కడి జనసైనికులకు పవన్ ఏ విధమైన దిశానిర్దేశం చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక, ఏపీ ఎన్నికల నాటికి పవన్ ఎలా వ్యవహరిస్తారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. జగన్ ఎదుర్కొవడానికి ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారు?, ఒంటరిగా బరిలో దిగుతారా?, మిత్రపక్షం బీజేపీని కూడా కలుపుకుని వెళ్తారా?, టీడీపీతో కూడా జట్టు కడతారా?, ఈ సారి అసెంబ్లీలో అడుగుపెడతారా? అనే ప్రశ్నలకు.. మరో 9 నెలల్లోనే సమాధానం దొరకనుంది.