వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్ రెండో అంతస్తులో కలెక్టర్లతో సీఎం చంద్రబాబు, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
‘మా కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. అధికారం కట్టబెట్టారు. 164 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాలతో, మంచి ఓటింగ్ శాతంతో చారిత్రాత్మక విజయం సాధించాం. వ్యవస్థలను బ్రతికించాలని, వ్యవస్థలను బలోపేతం చేయాలని మేం అధికారంలోకి వచ్చాం. ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాడాం. గెలిచాం. మంచి పాలన అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీ సూచనలు చాలా ముఖ్యం. రాష్ట్ర విభజన అనంతరం అనేక అవమానాలు ఎదుర్కొన్నాం. గతంలో రాష్ట్ర సరిహద్దుకు రావాలంటే మమ్మల్ని అడ్డుకున్న పరిస్థితి. గతంలో ఏపీలో పనిచేయాలంటే ఐఏఎస్, ఐపీఎస్ లు పోటీ పడేవారు. కానీ, గత ఐదేళ్లలో ఏపీలో పనిచేయాలంటే కొంతమంది భయపడిపోయారు.’