ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది. ప్రత్యేకించి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అయితే, విద్యార్థులకు మరింత చేరువయ్యారు. ఒక్క ట్వీట్ లేదా మెసేజ్‌తో విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు.
Nara Lokesh
గతంలో వాట్సాప్‌లో ఫిర్యాదు అందుకొని 25 మంది విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం సుగమం చేశారు మంత్రి నారా లోకేశ్. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగా.. వారందరికీ జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీట్లు దక్కాయి. అయితే, ఐఐటీ మద్రాస్ తీసుకొచ్చిన కొత్త నిబంధన కారణంగా సమస్య తలెత్తింది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మంత్రి నారా లోకేశ్‌కు ఓ విద్యార్థి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయగా.. వెంటనే స్పందించారు. సమస్య పరిష్కరించి.. 25 మంది విద్యార్థులకు ఐఐటీ, ఎన్‌ఐటీలాంటి జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు దక్కేలా చేశారు.
ఆ తర్వాత నారా లోకేశ్‌కి వింత అనుభవం ఎదురైంది. లోకేశ్ వాట్సాప్ ఖాతాను మెటా బ్లాక్ చేసింది. అయితే తన వాట్సాప్ పనిచేయడం లేదని ప్రజా సమస్యలు తెలుసుకోకుండా ఊరుకోలేదు. వాట్సాప్‌కి ప్రత్యామ్నాయంగా మెయిల్ ఐడీ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చొరవ చూపారు.
తాజాగా ఓ విద్యార్థి తన సమస్యను వివరిస్తూ మంత్రి నారా లోకేశ్‌కి ట్వీట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలి గ్రామానికి చెందిన చేబ్రోలు బసవయ్య అనే విద్యార్థి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'ఎక్స్' వేదికగా నారా లోకేశ్‌కు తన సమస్య విన్నవించారు. 'నేను IIT జామ్-2024లో 930 ర్యాంక్ సాధించాను. IIIT Lucknowలో Msc Data Scienceలో సీటు పొందాను. అయితే, ఈ కోర్సు ఫీజు సుమారు 4 లక్షల రూపాయలు. నా కుటుంబం ఇంత పెద్ద మొత్తం భరించలేదు. దయచేసి ఈ పరిస్థితిలో సహాయం చేయండి' అంటూ బసవయ్య ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌పై మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. లక్నో ఐఐటీలో చదవాలన్న పేద విద్యార్థి బసవయ్య కల సాకారం అవుతుందని భరోసా ఇచ్చారు. ‘మీరు IIIT లక్నోలో చదువుతారు. మీ కలను నిజం చేసుకుంటారు. ఫీజు విషయం నాకు వదిలేయండి. ఆల్ ది బెస్ట్ బసవయ్యా!’ అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
నారా లోకేశ్
నారా లోకేశ్ వెంటనే స్పందించడంపై సోషల్ మీడియాలో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, తన సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్‌కు బసవయ్య ధన్యవాదాలు తెలిపారు. ఈ సాయం జీవితాంతం మర్చిపోలేనంటూ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.