రాజ్యాంగం ఎంత గొప్పదైనా...అమలు చేసేవాడు దుర్మార్గుడు అయితే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయని అంబేద్కర్ అన్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా జైలు వద్ద విడుదలైన టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలకు ఆయన స్వాగతం పలికారు. ఈ క్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ...రోజుకో అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకొని జైలుకెళ్లిన వాడు బయటకు వచ్చేప్పుడు తలదించుకొని వస్తాడని, ప్రజల కోసం పోరాటం చేసి జైలుకెళ్లిన వాళ్ళు తలెత్తుకొని బయటకు వస్తారని జగన్ ను ఉద్దేశించి మాట్లాడారు.
జగన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు చూసారా?తల దించుకొని వచ్చాడు.మా టిఎన్ఎస్ఎఫ్ కుర్రాళ్లు ఎలా వచ్చారో చూసారు గా తలెత్తుకొని బయటకు వచ్చారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఐపీసీ అమలు అవ్వడం లేదు... జేపిసి అమలు అవుతుంది.. కొంత మంది పోలీసులు అత్యుత్సాహంతో జగన్ పీనల్ కోడ్ ను అమలు చేస్తున్నారంటూ పోలీసుల మీద విరుచుకు పడ్డారు.
ఆటో ఆర్టిస్టులను అడ్డుకున్నారంటూ దళిత రైతులమీదే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. సీఎం సొంతూర్లోనే హత్యకు గురైన దళిత మహిళ నాగమ్మ కుటుంబానికి న్యాయం చెయ్యమని ఛలో పులివెందుల కార్యక్రమం నిర్వహించాం. దీన్ని ముందుండి నడిపించిన తెలుగు మహిళ అధ్యక్షురాలు, దళిత నాయకురాలు అనిత,ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజుల పై ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.
జివో 77 రద్దు చెయ్యాలని సీఎం ఇళ్ళు ముట్టడికి వెళ్లిన టిఎన్ఎస్ఎఫ్ నాయకులపై ఏకంగా రేప్ కేసే పెట్టారు. అంతేకాదు విద్యార్థుల భవిష్యత్తుతో జగన్ రెడ్డి ఆటలాడుతున్నారు. జివో 77 తీసుకొచ్చి బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.ఈ జీవోతో సుమారుగా 3 లక్షల మంది విద్యార్థులకు ఉన్నత విద్య చదువుకునే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ కాలేజీల్లో పీజీ చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్స్ రద్దు చెయ్యడం దుర్మార్గమైన చర్య అంటూ దుయ్యబట్టారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి పిల్లలు మాత్రం విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోవాలా? బిసి,దళిత,ఎస్టీ విద్యార్థులకి మాత్రం విదేశాల్లో చదువుకునే హక్కు లేదా? ఉన్నత విద్య చదువుకునే హక్కు లేదా? అని ప్రశ్నించారు. స్వర్గీయ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన విదేశీ విద్యా పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. పథకంలో భాగంగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు నిధులు విడుదల చెయ్యడం లేదన్నారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన ఉన్నారు. అప్పు పుట్టదు.. ప్రభుత్వం పట్టించుకోదు.. విదేశాల్లో ఉన్న పిల్లల భవిష్యత్తు ఏంటో అర్ధం కాకా ఎంతో మంది తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు.
మడమ తిప్పను, మాట మార్చను అని బిల్డప్ ఇచ్చాడు. ఇప్పుడు మాట మార్చాడు, మడమ తిప్పాడు.కుల పిచ్చికి జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. యూనివర్సిటీలను భ్రష్టు పట్టించాడు. యూనివర్సిటీలను రాజకీయ వేదికలుగా మార్చేసాడు. 13 యూనివర్సిటీలు ఉంటే,11 యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లు ఒకే సామజిక వర్గానికి చెందిన వాళ్ళని నియమించుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూనివర్సిటీల్లో ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పోస్టుల్లో 90 శాతం సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు. రాజకీయ నేపథ్యం,క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేని వారిని యూనివర్సిటీ ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లగా నియమించాలి. అలాంటిది యూజీసీ,హైయ్యర్ ఎడ్యుకేషన్ నిబంధనలు తుంగలో తొక్కి వైకాపా వాళ్ళని ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లగా నియమించారు. 90 శాతం ఒకే సామజిక వర్గం.అందులో 60 శాతం క్రిమినల్ హిస్టరీ ఉన్నవాళ్లే అంటూ దుయ్యబట్టారు.
దేశం కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తుల జన్మదినోత్సవాలు జరగాల్సిన చోట దేశాన్ని దోచిన వాళ్ళ పుట్టిన రోజు సంబరాలు చేస్తున్నారు. ప్రతి జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ అన్నారు. రెండు జనవరిలు వెళ్లిపోయాయి ఉద్యోగాల క్యాలెండర్ ఏమయ్యింది? అంటూ ప్రశ్నించారు.తక్షణమే జివో 77 రద్దు చెయ్యాలి. బడుగు,బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించాలి. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్,స్కాలర్ షిప్స్ అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.
జివో 77 రద్దు చెయ్యకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇంత జరుగుతుంటే 22 మంది ఎంపీలు ఏమయ్యారు? గాడిదలు కాస్తున్నారా? ప్రత్యేక హోదా ఏమయ్యింది? అంటూ విరుచుకుపడ్డారు.జగన్ రెడ్డి వచ్చిన తరువాత ఒక్క ఉద్యోగం రాలేదు, ఒక్క కంపెనీ రాష్ట్రానికి రాలేదు.కొత్త కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు రాష్ట్రం వదిలి పెట్టి పోతున్నాయన్నారు.
అనంతరం టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 77 ఎందుకు అమలు చేస్తున్నారో జగన్ సమాదానం చెప్పాలని ప్రశ్నించారు.జివో 77 పై ప్రభుత్వంలో ఉన్న నాయకులకే అవగాహన లేదు, విద్యాశాఖ మంత్రికి రాష్ట్రంలో యూనివర్సిటీ లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. విద్యాశాఖ మంత్రి రబ్బరు స్టాంపు లాగా పనిచేస్తున్నాడని విరుచుకుపడ్డారు.