5 రూపాయల చొప్పున... నిరుద్యోగులకు ఇలా ఉపాధి కల్పించండి...: అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు

First Published Jul 20, 2021, 4:40 PM IST

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 17వేల కిలోమీటర్ల పొడవునా 68 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. 

విజయవాడ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంను ఆకుపచ్చని ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పించారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం 'జగనన్న పచ్చతోరణం' పై ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్‌షాప్‌ను ప్రారంభించారు.
undefined
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ... మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 17వేల కిలోమీటర్ల పొడవునా 68 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అయితే దీనిని కోటి మొక్కల వరకు తీసుకువెళ్ళాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పనుల్లో జూన్ నెలాఖరు వరకు పదహారు కోట్ల పనిదినాలను కల్పించడం ద్వారా జాతీయ స్థాయిలో మన రాష్ట్రంను మొదటిస్థానంలో నిలబెట్టారని అన్నారు. అదే ఉత్సాహంతో మొక్కల పెంపకంలోనూ, వాటిని సంరక్షించడంలోనూ ఉత్తమ ఫలితాలను సాధించాలని కోరారు.
undefined
ప్రతి వర్షాకాలం సీజన్‌లో పెద్ద ఎత్తున మొక్కలను పెంచడం, ఆ తరువాత వాటి సంరక్షణను పట్టించుకోకపోవడం వల్ల సరైన ఫలితాలు రావడం లేదని అన్నారు. దానికి భిన్నంగా నాటిన ప్రతి మొక్కను బతికించే బాధ్యతను క్షేత్రస్థాయి నుంచి తీసుకోవాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్‌ చట్టంలో ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల్లో పంచాయతీల పరిధిలో నాటిన మొక్కల్లో కనీసం 83 శాతం మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యతను గ్రామ సర్పంచ్‌లపైన పెట్టడం జరిగిందని అన్నారు. అంటే పర్యావరణానికి, గ్రామాల్లో పచ్చదనానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను అధికారులు అర్థం చేసుకోవాలని అన్నారు. గతంలో మాదిరిగా మొక్క నాటడంతోనే సరిపెట్టడం లేదని, దానికి అవసరమైన ట్రీగార్డ్ ను కూడా అందిస్తున్నామని తెలిపారు.
undefined
ఈ ఏడాది మొక్కల పెంపకంలో ఉత్తమ ఫలితాలు సాధించిన తొలి మూడు జిల్లాల అధికారులకు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో సన్మానం చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. అన్ని జిల్లాల్లో పర్యటనలు చేసి జగనన్న పచ్చతోరణంలో చేపట్టిన మొక్కల పెంపకాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. ఎక్కడైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని అన్నారు. ప్రతి జిల్లాలోనూ ఎపిడి స్థాయి అధికారి ప్రత్యేకంగా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని సూచించారు. నిరుద్యోగులైన వారికి మొక్కల సంరక్షణ బాధ్యతలను అప్పగించాలని కోరారు. కనీసం పది కిలోమీటర్ల మేర మొక్కల సంరక్షణ బాధ్యతను చూడటం, ట్రాక్టర్ ద్వారా నీటిని అందించడం వంటి పనులు అప్పగించాలని, దానివల్ల వారికి ఉపాధి లభించడంతో పాటు మొక్కలు కూడా తరువాత వృక్షాలుగా ఎదుగేందుకు దోహదం చేస్తుందని అన్నారు. మొక్కకు రూ.5 చొప్పున కనీసం 400 మొక్కలను సంరక్షిస్తే వారికి నెలకు 2వేల రూపాయలు లభిస్తాయని, దీనిని పెద్ద ఎత్తున ప్రచారం చేసి, మొక్కల సంరక్షణకు యువతను సిద్దం చేయాలని సూచించారు.
undefined
మహాత్మాగాంధి జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 44 వేల మంది రైతులకు చెందిన 70వేల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వెయ్యి ఎకరాల్లో బండ్ ప్లాంటేషన్, 50 రైల్వే స్థలాల్లో ప్లాంటేషన్, వెయ్యి ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల పరిధిలో మొక్కల పెంపకంను చేపడుతున్నామని అన్నారు. కొండప్రాంతాల్లో మొక్కల పెంపకం కోసం కోటి సీడ్‌ బాల్స్‌ను కూడా వినియోగిస్తున్నామని తెలిపారు. అలాగే అగ్రీ న్యూట్రీ గార్డెన్స్ కింద వంద ఎకరాల్లో మల్టీ క్రాపీంగ్, 500 ఎకరాల్లో పూలతొటల పెంపకం చేపడుతున్నామని అన్నారు.
undefined
ప్రతి గ్రామంలోనూ ఒక నర్సరీని ఏర్పాటు చేసుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల పరిధిలో అగ్రీకల్చర్, హార్టీకల్చర్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారని, వారి సేవలను వినియోగించుకోవాలని కోరారు. మన ప్రాంతంలో నాటుకునే మొక్కలను ఎక్కడి నుంచో తెచ్చుకోకుండా, మన గ్రామ పరిధిలోనే పెంచుకుని, వాటిని అందించే స్థాయికి రావాలని కోరారు. దీనివల్ల గ్రామస్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పర్యావరణం పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
undefined
ఈ కార్యక్రమంలో సోషల్ ఫారెస్ట్ హెడ్, పిసిసిఎఫ్ చిరంజీవి చౌదరి, పిఆర్ కమిషనర్ గిరిజా శంకర్, ఇఎఫ్ఎస్టి చలపతి, హార్టీకల్చర్ కమిషనర్ శ్రీధర్, రూరల్ డెవలప్‌మెంట్ స్పెషల్ కమిషనర్ నవీన్, సెర్ప్ సిఇఓ, రాజాబాబు, నరేగా డైరెక్టర్ చిన్నతాతయ్య తదితరులు పాల్గొన్నారు.
undefined
click me!