స్లీపర్ బస్సులు కాదు కదిలే శవపేటికలు.. అక్కడ వీటిపై బ్యాన్.? పూర్తి వివరాలు ఇవిగో

Published : Oct 26, 2025, 07:00 PM IST

Sleeper Buses: స్లీపర్ బస్సులు సౌకర్యవంతంగా కనిపించినా, భద్రత విషయంలో తీవ్ర లోపాలున్నాయి. డిజైన్ లోపాలు, ఇరుకైన నడిచే దారి, అత్యవసర ద్వారాలు తక్కువ, నిబంధనల ఉల్లంఘనలు వెరిసి ప్రమాదాలకు దారితీస్తున్నాయి.  

PREV
15
సౌకర్యం కాదు.. కదిలే శవపేటికలు..

సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆశించి అధిక ధరలు ఉన్నప్పటికీ ప్రయాణికులు స్లీపర్ బస్సులు ఎంచుకుంటారు. వాస్తవానికి భద్రత విషయంలో తీవ్ర లోపాలతో కూడుకున్నవి ఇవి. హైటెక్ డిజైన్‌తో, బెడ్‌రూమ్‌ను తలపించే స్లీపర్ బెర్త్‌లు, ఏసీ సౌకర్యాలతో కూడిన ఈ బస్సులు, చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ప్రమాదం సంభవించినప్పుడు కదిలే శవపేటికలుగా మారుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ బస్సుల కంటే వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయని ప్రయాణికులు భావించినా, భద్రతకు మాత్రం ఆపరేటర్లు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రవాణా నిపుణులు చెబుతున్నారు.

25
డిజైన్‌లోనే అనేక లోపాలు..

స్లీపర్ బస్సుల డిజైన్‌లోనే అనేక లోపాలున్నాయి. బస్సుల అధిక ఎత్తు, పొడవు కారణంగా ఇరుకు రోడ్లు, మలుపులలో వీటిని నియంత్రించడం కష్టతరం. ప్రమాదం జరిగినప్పుడు బస్సు ఒకవైపునకు ఒరిగిపోయినప్పుడు, ప్రయాణికులు కిటికీలను లేదా అత్యవసర ద్వారాలను చేరడం చాలా కష్టం. లోపల బెడ్‌రూమ్ తరహాలో ఉండే బెర్త్‌లు, ఇరుకైన నడిచే మార్గం వల్ల ప్రమాద సమయంలో ప్రయాణికులు సులువుగా బయటకు రాలేకపోతున్నారు. ఎవరి బెర్త్ పైకి వారు వెళ్తే తప్ప మరొకరు నడవడానికి అవకాశం ఉండదు. గతంలో సింగిల్ బెర్త్‌లతో కూడిన డిజైన్లు ఉన్నప్పటికీ, ఆదాయం పెంచుకోవడం కోసం ఆపరేటర్ల అభ్యంతరాల మేరకు వాహన తయారీ కంపెనీలు డిజైన్లను మార్చాయి. ఇది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారింది.

35
అవి స్లీపర్ బస్సులు లేవు..

అధునాతన బస్సుల్లో ఉండాల్సిన డ్రౌజీనెస్ అలర్ట్ సిస్టమ్ వంటివి చాలా స్లీపర్ బస్సులలో లేకపోవడం లేదా పనిచేయకపోవడం మరో ప్రధాన సమస్య. రాత్రిపూట సుదూర ప్రయాణాలు చేసే డ్రైవర్లకు అలసట లేదా నిద్రమత్తు వచ్చే ప్రమాదం అధికం. ఒక సర్వే ప్రకారం, 25 శాతం మంది డ్రైవర్లు నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తున్నట్లు అంగీకరించారు. ఏసీ బస్సులు కావడం వల్ల కిటికీలు పూర్తిగా మూసేసి ఉంటాయి. అత్యవసర ద్వారాలు ఎక్కడ ఉన్నాయో కూడా చాలామంది ప్రయాణికులకు తెలియదు. ఆపరేటర్లు అవగాహన కల్పించరు. కిటికీలు పగలగొట్టడానికి సుత్తి వంటి పరికరాలు ఉండాల్సినప్పటికీ, అవి అందుబాటులో ఉండవు. కర్నూలు బస్సు ప్రమాదంలో బయటపడిన ప్రయాణికుల చేతులకు గాయాలు కావడం దీనికి నిదర్శనం.

45
వివిధ దేశాల్లో బ్యాన్..

భద్రతా లోపాలను గుర్తించి చైనా, జర్మనీ వంటి అనేక దేశాలు స్లీపర్ బస్సులను నిషేధించాయి. చైనాలో 2009-2013 మధ్య జరిగిన ప్రమాదాలలో 252 మంది మరణించడంతో 2012లో కొత్త స్లీపర్ బస్సుల రిజిస్ట్రేషన్‌లను నిలిపివేసి, క్రమంగా వాటి వినియోగాన్ని తగ్గించింది. జర్మనీ 2006లోనే స్లీపర్ కోచ్‌లను నిషేధించింది. అయితే, మన దేశంలో ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ARAI) 2016లో స్లీపర్ బస్సులకు 2+1 లేఅవుట్, 70.8 అంగుళాల పొడవు గల బెర్త్, 12 మీటర్ల పొడవు గల బస్సులకు కనీసం నాలుగు అత్యవసర ద్వారాలు, ప్రతి సీటు పక్కన సుత్తి వంటి నిబంధనలను రూపొందించినప్పటికీ.. ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు వీటిని పాటించడం లేదు.

55
రోడ్ ట్యాక్స్ తక్కువ..

ప్రైవేట్ ట్రావెల్ ఆపరేటర్లు తక్కువ రోడ్ ట్యాక్స్, సులభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియల కోసం ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, డామన్ అండ్ డయ్యూ, అరుణాచల్ ప్రదేశ్‌లలో బస్సులను రిజిస్టర్ చేయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరానికి ఐదు లక్షల వరకు పన్ను చెల్లించాల్సి ఉండగా, ఈ రాష్ట్రాల్లో 50 వేలు చెల్లిస్తే సరిపోతుంది. డైరెక్ట్‌గా వెహికిల్ తీసుకెళ్లకుండానే వాట్సాప్ ద్వారా పత్రాలు పంపించి గంటల్లో రిజిస్ట్రేషన్లు పొందుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ నష్టాన్ని కలిగించడమే కాకుండా, ఈ బస్సులపై పర్యవేక్షణ అధికారం లేకుండా చేస్తుంది. ఫిట్‌నెస్ పరీక్షలను కూడా తూతూమంత్రంగా వీడియో కాల్స్ ద్వారా క్లియర్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. బస్సుల డిజైన్ లోపాలు, భద్రతా ప్రమాణాల విస్మరణ, నిబంధనల ఉల్లంఘనల కారణంగానే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories