IMD Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళఖాతంలో ఏర్పడనున్న కొత్త అల్పపీడనం ఏర్పడనుందని రాష్ట్ర విపత్తుల సంస్థ హెచ్చరిక జారీ చేసింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఎల్లుండి నాటికి అల్పపీడనంగా మారనుందని అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం కల్లా మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు సంస్థ అంచనా వేసింది.
25
వాయుగుండం మరింత బలపడే అవకాశం
అల్పపీడనం ముందుకు కదులుతున్నకొద్దీ దాని తీవ్రత పెరిగి, వచ్చే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో మరింత శక్తివంతమైన వాయుగుండంగా మారవచ్చని అధికారులు పేర్కొన్నారు. దీనికి అనుసంధానంగా వాతావరణం మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
35
నవంబర్ 27–29 మధ్య భారీ వర్షాలు
ఈ నెల 27, 28, 29 తేదీల్లో రాష్ట్రంలోని కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడొచ్చని విపత్తుల సంస్థ తెలిపింది. మూడు రోజుల పాటు మబ్బులు కమ్మి, ఉరుములు–మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
వాతావరణ మార్పుల దృష్ట్యా రైతులు తమ వ్యవసాయ పనులను ముందుగానే పూర్తిచేసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా కోతకు సిద్ధమై ఉన్న ధాన్యాన్ని భద్రంగా నిల్వచేసి, ఎండబెట్టే ప్రదేశాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆకస్మిక వర్షాలు పండిన ధాన్యానికి నష్టం కలిగించే ప్రమాదం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.
55
అత్యవసర సహాయానికి హెల్ప్‌లైన్ నంబర్లు
వాతావరణ పరిస్థితులు ప్రభావితం చేసే ప్రాంతాల ప్రజలు అవసరమైన సమాచారానికి లేదా ఎమర్జెన్సీ సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు. టోల్‌ఫ్రీ నంబర్లు: 112, 1070, 1800 425 0101. అలాగే శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా సంస్థ వెల్లడించింది.