
Gas Cylinder : భర్త బంగారం కొనివ్వలేదని అలిగే మహిళలను చూసుంటారు. సినిమాకో, షికారుకో తీసుకెళ్లలేదని భార్య కోపానికి గురయ్యే భర్తలు ఎంతమందో. కానీ భర్త గ్యాస్ సిలిండర్ తేలేదని ఓ మహిళ తీవ్ర మనోవేదనకు గురయ్యింది... చివరికి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ విచిత్ర ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేకుంది.
ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ తో యుద్దం చేస్తుండటంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మిడిల్ ఈస్ట్ నుండే భారత్ తో పాటు అనేక దేశాలకు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సరఫరా అయ్యేది. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొనడంతో వీటి సరఫరాకు ఆటంకం కలిగింది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద ఇందన నౌకలను నిలిపివేయడంతో తీవ్ర కొరత ఏర్పడుతోంది.
ఇలా ఇండియాలో వంటగ్యాస్ (LPG Gas Cylinder) కొరత కొనసాగుతోంది. ఇప్పటికే వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను నిలిపివేశారు. కేవలం ఇంటి అవసరాల కోసం ఉపయోగించే సిలిండర్లను మాత్రమే సరఫరా చేస్తున్నారు. వీటిని కూడా బుక్ చేసుకున్న తర్వాత చాలా ఆలస్యంగా అందిస్తున్నారు. ఈ గ్యాస్ కొరతే ఓ మహిళ ప్రాణాలమీదకు తెచ్చింది.
ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో హరికృష్ణ-మహాలక్ష్మి నివాసముంటున్నారు. అయితే వీరి ఇంట్లో ఇటీవలే గ్యాస్ సిలిండర్ ఖాళీ అయ్యింది... దీంతో ఈ కుటుంబం ఇబ్బందిపడుతోంది. ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా సిలిండర్లు సరఫరా చేసే ఏజెన్సీ వద్దకు వెళ్లినా దొరకలేదు. బుక్ చేసుకున్నా డెలివరీకి చాలా సమయం పడుతుందని చెప్పారు.
గ్యాస్ సిలిండర్ దొరక్కపోవడంతో చేసేదేమిలేక హరికృష్ణ ఉసూరుమంటూ ఇంటికి వెళ్లాడు... విషయాన్ని భార్య మహాలక్ష్మికి తెలిపాడు. దీంతో ఇక వంటచేయడం ఎలాగని తీవ్ర వేదనకు గురయిన ఆమె క్షణికావేశంలో దారుణ నిర్ణయం తీసుకుంది. బాత్రూంలు క్లీన్ చేయడానికి ఉపయోగించే ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే తాగిన ఫినాయిల్ తాగినట్లే వాంతి చేసుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.
తీవ్ర అస్వస్థతకు గురయిన మహాలక్ష్మిని కుటుంబసభ్యులు గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమెకు సమయానికి వైద్యం అందడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఇలా గ్యాస్ సిలిండర్ కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
గ్యాస్ కొరత కారణంగా ఎల్పిజి సిలిండర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. రూ.2 వేల కమర్షియల్ సిలిండర్ ను రూ.5 నుండి రూ.6 వేలకు బ్లాక్ లో అమ్ముతున్నారు. అలాగే రూ.1000 ఉండే డొమెస్టిక్ సిలిండర్ ను బ్లాక్ లో రూ.2 వేలకు అమ్ముతున్నారు. ఇలా గ్యాస్ సిలిండర్ల దందా జోరుగా సాగుతోంది. చివరకు పరిస్థితి ఎలా తయారయ్యిందంటే డబ్బులు, బంగారం మాదిరిగానే సిలిండర్ల దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. ఇలా విశాఖపట్నంలో సిలిండర్ల దోపిడీ వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో అప్పారావు డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. అతడు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తానని చెప్పి వినియోగదారుల నుండి ఓటిపిలు సేకరించాడు... కానీ వారికి సిలిండర్లు సరఫరా చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఆరాతీయగా దొంగతనం వ్యవహారం బయటపడింది.
వినియోగదారులకు సరఫరా చేస్తానని చెప్పి గోడౌన్ నుండి 30 గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్లాడు అప్పారావు. వీటిని వినియోగదారులకు ఇవ్వకుండా ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని పరారయ్యాడు. గ్యాస్ సిలిండర్లను అప్పారావు దొంగిలించినట్లు గుర్తించిన ఏజెన్సీ నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు అప్పారావు ఆఛూకీ కోసం గాలిస్తున్నారు.
మధ్యప్రాచ్య యుద్ధం ఎఫెక్ట్ భారత వ్యవసాయంపై కూడా పడింది. గ్యాస్ సరఫరా తగ్గడంతో హోటళ్లు మూతపడ్డాయి, హాస్టళ్లు మెనూ తగ్గించాయి. కొన్ని చిన్న హోటళ్లు మూతపడ్డాయి. ఫలితంగా కూరగాయలకు డిమాండ్ పడిపోయి, రైతులు నష్టపోతున్నారు. మార్కెట్లో ధరలు పడిపోవడంతో, కోత కోసి తరలించే ఖర్చు కూడా రావడం లేదు. అందుకే రైతులు పంటను పొలంలోనే వదిలేస్తున్నారు. కొందరు తమ పంటను తామే నాశనం చేసుకుంటున్నారు. ఇలా కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా యలందూర్ తాలూకా హోన్నూరు గ్రామానికి చెందిన బసవన్న అనే రైతు కష్టపడి పండించిన క్యాలీఫ్లవర్ పంటను సాగుచేసి తీవ్రంగా నష్టపోయాడు. ధర లేకపోవడంతో క్యాలిప్లవర్ పంటతో సహా పొలాన్ని దున్నేశాడు. దీంతో లక్షల రూపాయలు నష్టపోయిన ఆ రైతుకు కంటతడే దిక్కయ్యింది.