జిబిఎస్ లక్షణాలు :
గులియన్ బారే సిండ్రోమ్ బారినపడినవారిలో ముందుగా కనిపించే ప్రధానలక్షణం తిమ్మిర్లు. అరచేతులు, పాదాల్లో తిమ్మిర్లు వచ్చి మొద్దుబారినట్లు అయిపోతాయి. ఇది క్రమక్రమంగా పెరుగుతూ శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ తిమ్మిర్ల కారణంగా శరీరం జలదరింపులకు గురవుతుంది.
ఈ వ్యాధి సోకినవారిలో జ్వరం, పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. వాంతులు, విరేచనాలు కూడా జిబిఎస్ లక్షణాలే. కండరాల బలహీనత కారణంగా కాళ్లు, చేతుల నొప్పులు వుంటాయి.
ఈ జిబిఎస్ శ్వాస వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంది. శ్వాస కండరాలపైనా ఇది ప్రభావం చూపిస్తుంది... కాబట్టి ఇది సోకినవారు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సిండ్రోమ్ రక్తపోటుపై ప్రభావం చూపి గుండె పనితీరును దెబ్బతీస్తుంది. కొందరిలో ఇది హార్ట్ ఎటాక్ కు దారితీయవచ్చు. ఏపీ మహిళ మృతి ఇలాగే జరిగి ఉండొచ్చు.
కొన్నిసార్లు గొంతులోని కండరాలపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. దీంతో అహారం నమలడం, మింగడం, మాట్లాడటం ఇబ్బందిగా వుండవచ్చు. కొందరిలో కంటి కండరాలు కూడా బలహీనపడి నొప్పి, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మూత్రాశయంపైనా దీని ప్రభావం వుంటుంది. మూత్రంపై నియంత్రణ కోల్పోవడం కూడా ఈ లక్షణాల్లో ఒకటి.