అదాని విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో రూ. 1,750 కోట్ల లంచం - జ‌గ‌న్ పాత్ర ఏంటి? అస‌లు ఈ కేసు ఏంటి?

First Published | Nov 22, 2024, 11:41 AM IST

Explainer - Adani power purchase deal: ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ ను ఉల్లంఘించారని  ఆరోపిస్తూ అదానీ స‌హా ప‌లువురిపై యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అభియోగాలు మోపింది. అలాగే, ఏపీ మాజీ సీఎం జగన్ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కోసం ₹1,750 కోట్లు తీసుకున్నారని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. 
 

Jagan Mohan Reddy, gautam adani

Adani power purchase deal: అదాని గ్రూప్ కు ఉచ్చు బిగుస్తున్న‌ద‌నే టాక్ నడుస్తోంది. సౌరశక్తి విద్యుత్ సరఫరా ఒప్పందాలను పొందేందుకు గౌత‌మ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీ స‌హా మరో ఆరుగురు నిందితులు భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చారని యూఎస్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ అదానీ స‌హా ప‌లువురిపై యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అభియోగాలు మోపింది. ఇప్ప‌టికే అక్క‌డి కోర్టులో వాద‌న‌లు జ‌రిగాయి. గౌత‌మ్ అదాని స‌హా ఇందులో ప్ర‌మేయం ఉన్న ప‌లువురి కోసం అరెస్టు వారెంట్లు కూడా జారీ అయ్యాయి. ఇప్పుడు ఇదే విష‌యం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను కూడా కుదిపేస్తోంది. 

ఎందుకంటే ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కోసం ₹1,750 కోట్లు తీసుకున్నారని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అస‌లు ఎంటీ ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందం?  గౌత‌మ్ అదాని కోసం అరెస్టు వారెంట్ జారీ వెనుక కార‌ణాలు ఏంటి?  లంచం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జ‌గ‌న్ పాత్ర ఏమిటి? 

ఏమిటి ఈ సౌర‌ విద్యుత్ సరఫరా ఒప్పందాలు? 

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థల విద్యుత్ సరఫరా ఒప్పందాలు (PSAs) యూఎస్ 265 మిలియన్ డాలర్ల లంచం కేసులో ప్ర‌ధానంగా క‌నిపిస్తున్నాయి. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (USSEC) నేరారోపణ ప్రకటనలో అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్‌కి లంచం ఇచ్చిందని ఆరోపించింది. వీరిలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.

ఒడిశా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థలు జూలై 2021-ఫిబ్రవరి 2022 మధ్య తయారీ ప్రాజెక్టు కింద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI)తో ఒప్పందాలు చేసుకున్నాయి. ఏపీ రాష్ట్రం 7 గిగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి అంగీకరించింది. భారతదేశంలో అత్య‌ధిక మొత్తం వాటా కొనుగోలు ఏపీదే. మొత్తంగా అధిక ధరలకు సౌరవిద్యుత్‌ కొనేలా దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ఉన్నతస్థాయి వ్యక్తులకు కోట్ల రూపాయ‌లు లంచం రూపంలో అందిన‌ట్టు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ నివేదిక‌లు పేర్కొన్నాయి.

Latest Videos


రాష్ట్ర ఉన్న‌త వ్య‌క్తుల‌తో అదానీ వ‌రుస భేటీల తర్వాత ఒప్పందాలు 

"ఆగస్టు 2021లో అదానీ ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ను కలిశారు. రాష్ట్రం SECIతో విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకోలేదు. ఈ ఒప్పందం కోసం ఆంధ్రప్రదేశ్ ముందుకు రావడానికి అవసరమైన ప్రోత్సాహకాల గురించి చ‌ర్చించారు" అని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ (SEC) పేర్కొంది.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ "సాగర్ అదానీ సెప్టెంబరు 12, న‌వంబర్ 20న ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సమావేశాల తర్వాత, అదానీలు (గౌతమ్- సాగర్) AP ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారు లేదా వాగ్దానం చేసి సంబంధిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థలతో ఒప్పందాలు చేసుకునేలా చేశారని తెలిపింది. 

Green Energy

అమెరికాలో నిధుల సమీకరణతో వెలుగులోకి లంచాలు 

అదాని గ్రూప్ లంచాల ఆరోప‌ణ‌లు మొద‌ట‌గా అమెరికా లో వెలుగులోకి వ‌చ్చాయి. అమెరికాకు ఏంటి సంబంధం అని మీకు డౌట్ రావ‌చ్చు. అస‌లు విష‌యం ఏమిటంటే భార‌త్ లో ఈ విద్యుత్ ఒప్పందాల్లో లంచాలు ఇవ్వ‌డం కోసం ఆదాని గ్రూప్ నిధుల సేక‌ర‌ణ మొద‌లుపెట్టింది. అమెరికా బ్యాంకులు, ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధులు సేక‌రించింది. ఈ క్ర‌మంలోనే అక్కడి ద‌ర్యాప్తు సంస్థ‌ల్లో ఈ నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి. 

మ‌న దేశంలో  సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI)తో సౌర విద్యుత్తు ప్రాజెక్టుల ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భారీగా లంచాలు ఇచ్చేందుకు గౌతమ్, సాగర్‌ అదానీలు అమెరికాలో నిధుల సమీకరణ కొన‌సాగించారు. అదానీ గ్రీన్ లో పెట్టుబడిదారుల నుంచి మిలియన్ల కొద్దీ డాలర్లు వ‌చ్చాయి. అయితే, సెక్యూరిటీలు విక్రయించేందుకు తప్పుదారి పట్టించే సమాచారం ఇవ్వ‌డంతో అమెరికా ద‌ర్యాప్తు సంస్థ‌లు ఈ మొత్తం భాగోతాన్ని వెలుగులోకి తెచ్చాయి.

అదాని స‌హా ప‌లువురి అరెస్టుకు వారెంట్స్ జారీ చేసిన అమెరికా కోర్టు 

సౌర విద్యుత్ సరఫరా కాంట్రాక్టులను పొందడానికి అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీ, మరో ఆరుగురు ప్రతివాదులు భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చారని యుఎస్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురు ఎగ్జిక్యూటివ్లపై 250 మిలియన్ డాలర్లకు పైగా లంచం, మోసం కేసులో అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. దీంతో వీరి కోసం కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 

ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్ సిపిఎ)ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ అదానీ, ఇతరులపై న్యూయార్క్ లోని యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అభియోగాలు మోపింది. దీనిపై న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో మొద‌ట‌ ఫిర్యాదు దాఖలైంది. వాద‌న‌ల త‌ర్వాత అరెస్టుకు ఆదేశాలు ఇచ్చింది.

Jagan Mohan Reddy, gautam adani

అదాని గ్రూప్ ఈ ఆరోప‌ణ‌ల‌పై ఏం చెబుతోంది? 

ఈ అభియోగాలను నిరాధారమైన ఆరోపణ అని అదానీ గ్రూప్ ఖండించింది. అదానీ గ్రీన్ డైరెక్టర్లపై యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి.. అవి తిరస్కరించబడ్డాయి. సాధ్యమైన అన్ని చట్టపరమైన సహాయం తీసుకుంటామ‌ని తెలిపింది.  అదానీ గ్రూప్ తన కార్యకలాపాల అన్ని అధికార పరిధులలో అత్యున్నత స్థాయి పాలన, పారదర్శకత, నియంత్రణ సమ్మతిని నిర్వహించడానికి ఎల్లప్పుడూ ముందుంటుంద‌ని పేర్కొంది. 

జ‌గ‌న్ పై ఆరోప‌ణ‌లు.. వైకాపా ఏం చెప్పిందంటే? 

ఏపీలో గ‌త వైకాపా స‌ర్కారు విద్యుత్‌ కొనుగోలు విష‌యంలో నేరుగా అదానితో ఒప్పందం చేసుకోలేద‌నీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తో మాత్రమే ఒప్పందం చేసుకుంద‌ని తెలిపింది. వైకాపా ప్ర‌భుత్వం పై విద్యుత్‌ కొనుగో­లుకు సంబంధించి వస్తున్న ఆరోపణల్లో నిజం లేద‌ని తెలిపింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించే ల‌క్ష్యంతోనే 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను చౌకగా కొనుగోలు చేసేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా  తో ఏపీ డిస్కమ్‌­లు ఒప్పందం చేసు­కు­న్నాయని పేర్కొంది. 

click me!