రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు చకచకా జరిగిపోతుంది. ఎలాగో తెలుసా?

First Published | Nov 17, 2024, 5:10 PM IST

ఆంధ్రప్రదేశ్ లో రైతన్నలు ధాన్యం విక్రయించుకొనేందుకు వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది తెదేపా - జనసేన కూటమి ప్రభుత్వం. వాట్సాప్ ఉపయోగించి ఎంత ధాన్యం అయినా సులభంగా అమ్మే విధంగా ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 73373 59375 నెంబర్ ను రైతుల సేవల కోసం కేటాయించామన్నారు. ధాన్యం అమ్మదలచిన రైతులు ఈ నెంబర్ కు Hi అని సందేశం పంపితే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్ రైతులతో మాట్లాడుతుందని తెలిపారు. ఈ వాయిస్ తెలుగులోనే ఉంటుందని, ధాన్యం విక్రయానికి సంబంధించి అన్ని విధాలుగా మార్గదర్శకం చేస్తుందని తెలిపారు.


ఇందుకు సంబంధించిన వివరాలను నాదెండ్ల మనోహర్ వివరించారు.

"రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తరువాత..  రైతు పేరును ధృవీకరించాలి. 

అనంతరం ధాన్యం అమ్మదలచిన కొనుగోలు కేంద్రం పేరు సెలక్ట్ చేసుకోవాలి. 

తరువాత ధాన్యం అమ్మదలిచిన తేదీ సంబంధించి మూడు ఆప్షన్లు ఇస్తారు. దానిలో ఏదో ఒక తేదీని నిర్ణయించాలి. 

అనంతరం టైమ్ కూడా సెలెక్ట్  చేయాలి.

ఆ పైన ఎలాంటి రకం ధాన్యం అమ్ముతున్నారో ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. అనంతరంఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మదలిచారో తెలియజేయాలి. 

అనంతరం ఓ ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్లు ఒక కూపన్ కోడ్ వస్తుంది.


ఈ విధంగా రైతు సులభంగా తన ధాన్యం అమ్మకం తేదీ, సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి సులభంగా ధాన్యాన్ని అమ్ముకోవచ్చు. ఇందులో ఎలాంటి బాదరబందీ ఉండదు. ప్రతి ఆప్షన్ కేవలం ఒక క్లిక్ తో రైతు సులభంగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సాప్ ఆప్షన్లు అందరికీ అర్ధమయ్యే రీతిలో ఇవ్వడం విశేషం.

ఇకపై ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గంటలకు గంటలు రైతులు వేచి ఉండాల్సిన అవసరం లేదు.  ధాన్యాన్ని ఎప్పుడు కొంటారా అని కొనుగోలు కేంద్రాల వద్ద బతిమిలాడుకోవడం వంటి విషయాలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్

"సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానం తరహాలో సర్వీస్ చేస్తోంది మా కూటమి ప్రభుత్వం. ఇది రైతులకు మేలు చేసే ప్రభుత్వం. వారి ఇబ్బందులను గ్రహించి సాంకేతికత వినియోగించి ధాన్యం కొనుగోలు సరళతరం చేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ కింద ఈ సేవలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి" అని మనోహర్ పేర్కొన్నారు.

Latest Videos

click me!