చిరంజీవి,నాగబాబు ఇద్దరూ గ్రాడ్యుయేట్సే ... మరి పవన్ ఇంటర్ లో చదువెందుకు మానేసారో తెలుసా?

First Published | Jan 3, 2025, 1:29 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేవలం పదో తరగతి వరకే చదువున్నారు. ఇంటర్మీడియట్ లో చదువు ఎందుకు మానేయాల్సి వచ్చిందో స్వయంగా పవనే తాజాగా వెల్లడించారు. 

Pawan Kalyan

Pawan Kalyan : పెద్దన్న చిరంజీవి గ్రాడ్యుయేషన్ (బీకామ్) పూర్తిచేసారు... చిన్నన్న నాగబాబు అయితే ఎల్.ఎల్.బి చదివారు... కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఇంటర్మీడియట్ లోనే చదువు ఆపేసారు.  అయితే ఇలా తన చదువు మధ్యలోనే ఎందుకు ఆపేయాల్సి వచ్చిందో స్వయంగా పవన్ కల్యాణ్ వెల్లడించారు. 

విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడామైదానంలో పుస్తక మహోత్సవ సంఘం (వీబీఎఫ్ఎస్) ఆధ్వర్యంలో పుస్తకాల ప్రదర్శన ఏర్పాటుచేసారు. ఈ 35వ బుక్ ఫెస్టివల్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటుచేసిన బుక్ స్టాల్స్ ను పరిశీలించిన తనకు పుస్తకపఠనంపై వున్న ఆసక్తిని బైటపెట్టారు. 

Pawan Kalyan

అందుకే చదువు మానేసా : పవన్ కల్యాణ్ 

విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేసారు. కేవలం అకడమిక్ పుస్తకాలనే కాదు ఇతర పుస్తకాలను కూడా చదవడం అలవాటు చేసుకోవాలని పవన్ సూచించారు.
 
తాను విద్యార్థి దశలో వుండగా అలాగే చేసేవాడినని... స్కూల్ పుస్తకాలతో పాటు ఇతర సాహిత్యాన్ని చదివేవాడినని పవన్ వెల్లడించారు. అప్పుడే తనకు ఓ విషయం అర్థమైంది... పాఠ్య పుస్తకాల్లో కంటే వేరే పుస్తకాల్లోనే మన జీవితానికి సంబంధించిన విషయాలు దాగున్నాయని అని తెలిపారు. 

విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, పాఠ్య పుస్తకాలతో పనిలేకుండా విజ్ఞానాన్ని పొందాలనుకున్నానని... అందువల్లే ఇంటర్ లోనే చదువు మానేసినట్లు పవన్ వెల్లడించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి గొప్పవాళ్లు కూడా ఇంటివద్దే వుండి విజ్ఞానాన్ని పొంది మేధావులుగా మారారని తెలిపారు. ఇలాంటి మహనీయులనే ఆదర్శంగా తీసుకోవాలని నేటి యువతకు పవన్ సూచించారు. 
 


Pawan Kalyan

ఇంకా చదువుతున్నా : పవన్ కల్యాణ్ 

ఇంటర్ తోనే చదువు మానేసానని చెబుతూనే ఇంకా చదువుతున్నానని పవన్ వెల్లడించారు. అంటే అకడమిక్ పుస్తకాలు చదివితేనే మనం చదువుకున్నవాళ్ళం కాదు... మనలోని విజ్ఞానాన్ని పెంచే ఏ పుస్తకం చదివినా మనం చదివుతున్నట్లే అని చెప్పడం పవన్ కల్యాణ్ ఉద్దేశం అయివుంటుంది.  అందువల్లే అకడమిక్ చదువు మానేసి ఇతర పుస్తకాలు చదువుతున్నాను... చదవడం ఆపలేదంటూ పవన్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. 

మంచి పుస్తకాలను ఎంపిక చేసుకుంటే విద్యాబుద్దులు మనంతట మనమే నేర్చుకోవచ్చు... ఉపాధ్యాయులతో పనిలేదని పవన్ అన్నారు.  తాను అకడమిక్ పుస్తకాలు చదవలేకనో, మార్కులు తెచ్చుకోలేకనో ఇంటర్ తో విద్యాభ్యాసం మానేయలేదు... అంతకంటే ఎక్కువ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను చదవాలని నిర్ణయించుకుని మానేసానని పవన్ వెల్లడించారు. 

తాను కోరుకున్న చదువు పాఠ్యపుస్తకాల్లో లేదని యువకుడిగా వుండగానే అర్థమయ్యింది... అందుకే చదువు మానేసానని పవన్ తెలిపారు. తన తల్లిదండ్రుల వల్ల సాహిత్య పుస్తకాలు చదవడం అలవాటయ్యిందని...దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నానని  తెలిపారు. ఇప్పటికే అనేక పుస్తకాలు చదివాను...ఇకపైనా చదువుతూనే వుంటానని పవన్ తెలిపారు.
 

Pawan Kalyan

పుస్తకాలంటే నాకు ఎంత ప్రేమంటే..: 

పుస్తకాలంటే తనకు ఎంతో ప్రేమని... అందువల్లే ఎక్కడికి వెళ్లినా నచ్చిన పుస్తకాలను తెచ్చుకుంటానని పవన్ వెల్లడించారు. ఇలా తనవద్ద వున్న పుస్తకాలను ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడను... అవసరం అయితే కోటి రూపాయలు ఇచ్చేందుకు కూడా ఆలోచించను...కానీ పుస్తకాలు ఇవ్వాలంటే మనసొప్పదని అన్నారు. ఎవరికైనా తనవద్ద వున్న పుస్తకాలు ఇవ్వాల్సివస్తే సంపద మొత్తం ఇచ్చేసినట్లు అనిపిస్తుందని పవన్ అన్నారు. 

తనకు పుస్తకం పఠనం అలవాటు లేకుంటే ఏమయిపోయేవాడినో అని పవన్ అన్నారు. పుస్తకాలు చదివే అలవాటును ఎప్పటికీ మానుకోబోనని... గతంలో సినిమాలు, ఇప్పుడు రాజకీయాలు, పాలనతో ఎంత బిజీగా వున్నా పుస్తకాలు చదివేందుకు సమయం కేటాయిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరు మరీముఖ్యంగా చిన్నారులు, యువత పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలని జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. 

Latest Videos

click me!