
Petrol Price : ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.108 నుండి రూ.110 వరకు వుంది. అదే లీటర్ డీజిల్ ధర రూ.96 నుండి రూ.98 వుంది. ఏపీలోని అన్ని జిల్లాల్లో ఇవే ధరలున్నాయి. కానీ ఒక్కప్రాంతంలో మాత్రం కేవలం 96 రూపాయలకే లీటర్ పెట్రోల్, 86 రూపాయలకే లీటర్ డీజిల్ లభిస్తుంది. ఇలా అతి తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ లభించే ప్రాంతం మరేదో కాదు యానాం. అక్కడ ఎందుకంత తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ లభిస్తుందో తెలుసుకుందాం.
యానాంలో పెట్రోల్, డీజిల్ ధరలెందుకు తక్కువ?
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణం కాకినాడ. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.110, లీటర్ డీజిల్ రూ.97 రూపాయలు వుంది. కానీ ఇక్కడినుండి సరిగ్గా 28 కిలోమీటర్ల దూరంలో ఓ ప్రాంతం వుంది. అక్కడ మాత్రం లీటర్ పెట్రోల్ రూ.96, డీజిల్ రూ.86 కే వస్తోంది. అంటే ఒకే ప్రాంతంలో లీటర్ పెట్రోల్ పై రూ.13, డీజిల్ పై రూ.11 తగ్గింపు వుందన్నమాట.
ఇలా చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే పెట్రోలో, డీజిల్ ధరలే కాదు ఇతర వస్తువులు కూడా చాలా తక్కువధర కలిగివుంటాయి. ఇలా ఆంధ్ర ప్రదేశ్ భూభాగంలో వున్నా ఎన్నో ప్రత్యేకతలు కలిగివుంది యానాం. ఏపీలో భాగంగా కాకుండా ప్రత్యేక ప్రాంతంగా పరిగణించబడుతోంది యానాం. అందువల్లే ఈ ప్రాంతంలో ఏపీతో సంబంధం లేకుండా వస్తువుల ధరలున్నాయి.
ఏపీ భూభాగంలోనే వున్నా యానాం అనేది పుదుచ్చెరి కేంద్రపాలిత ప్రాంతంలో భాగం. పాండిచ్చెరిలో ఒక్కో జిల్లా ఒక్కో రాష్ట్రంలో వుంది... కీలకమైన పాండిచ్చెరి, కారైకల్ జిల్లాలు తమిళనాడులో, మాహే జిల్లా కేరళలో, యానాం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లో వుంది. ఇలా వేరువేరు రాష్ట్రాల్లోని ప్రాంతాలతో పాండిచ్చెరి కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటుచేసారు.
ఇలా ఏపీలోని యానాం కూడా కేంద్రపాలిత ప్రాంతంలో భాగం కాబట్టి ఇక్కడ లెప్టినెంట్ గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు వుంటాయి. ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నియమించిన లెప్టినెంట్ గవర్నర్ కే ఇక్కడ అత్యధిక అధికారాలుంటాయి. అంతేకాదు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పన్నులు కూడా చాలా తక్కువగా వుంటాయి... అందువల్లే ఇతర ప్రాంతాలతో పోలిస్తే ధరలు తక్కువగా వుంటాయి. అందువల్లే చుట్టూ వున్న ఏపీ ప్రాంతాల్లో కంటే యానాంలో పెట్రోల్, ఢీజిల్ ధర ఇంత తక్కువగా వుంది.
న్యూఇయర్ లో యానాం ప్రజలకు ఫస్ట్ షాక్ :
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చెరిలో గత ఏడాది ఇంధన ధరలు ఇంకా తక్కువగా వుండేవి. కానీ ఈ ఏడాది ఆరంభంలో ఆ ధరలను సవరించారు. దీంతో లీటర్ పెట్రోల్, డీజిల్ పై రెండు రూపాయలు పెరిగాయి. గతంలో లీటర్ పెట్రోల్ 94 రూపాయలుంటే ఇప్పుడు 96 రూపాయలు అయ్యింది. అదే డీజిల్ రూ.84 నుండి రూ.86 కి చేరుకుంది.
పుదుచ్చెరిలోని భాగమే ఈ యానాం... కాబట్టి ఇక్కడ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ మేరకు జనవరి 1, 2025 నుండి పెరిగిన ధరల ప్రకారం పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ ధరల పెంపు ఉత్తర్వులు పుదుచ్చెరి లెప్టినెంట్ గవర్నర్ కైలాష్ నాథ్ పేరిట వెలువడ్డాయి. నూతన సంవత్సరం ఆరంభంలోనే పెట్రోల్,డీజిల్ ధరలపెంపుతో యానాం ప్రజలపై భారం పడింది.
యానాం ఎందుకంత ప్రత్యేకం :
స్వాతంత్య్రానికి ముందు భారతదేశాన్ని కేవలం ఆంగ్లేయులే కాదు ఫ్రెంచ్ వారు కూడా పాలించారు. అయితే కాలక్రమేణా మనదేశంలో ఆంగ్లేయుల ఆధిపత్యం పెరిగి ఫ్రెంచ్ వారు కొంత ప్రాంతానికే పరిమితం అయ్యారు. ఇలా చాలాకాలం ఫ్రెంచ్ వారి ఆధీనంలో వున్న ప్రాంతాలే ఇప్పుడున్న పుదుచ్చెరి కేంద్రపాలిత ప్రాంతం.
దక్షిణభారతదేశంతో బంగాళాఖాతం తీరప్రాంతంలో చెల్లాచెదురుగా వున్న ప్రాంతాలన్నింటిని కలిపి పుదుచ్చెరి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటుచేసారు. ఇందులో భాగమే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని యానాం. అంటే ఈ ప్రాంతం కూడా చాలా కాలం ఫ్రెంచ్ పాలనలో వుంది కాబట్టి ఏపీతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా వుందన్నమాట.
దాదాపు 138 సంవత్సరాలపాటు యానాంలో ఫ్రెంచ్ వారి పాలన సాగింది. దేశం మొత్తానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా ఈ ప్రాంతం ఫ్రెంచ్ పాలనలోనే వుంది. 1963 లో యానాంతో పాటు మిగతా పుదుచ్చెరి జిల్లాలో భారతదేశంలో అంతర్భాగం అయ్యాయి. ఆ తర్వాత పుదుచ్చెరిని శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటుచేసింది భారత ప్రభుత్వం.
యానాంకు రాజధాని పాండిచ్చెరి ఏకంగా 870 కిలోమీటర్ల దూరం వుంటుంది. గతంలో ఈ యానాంను ఆంధ్ర ప్రదేశ్ లో కలుపుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి... కానీ అవేమీ ఫలించలేదు. కాకినాడకు ఈ యానాం చాలా దగ్గరగా వుంటుంది... ఆ ప్రాంత ప్రజల రాకపోకలు ఇక్కడినుండి జరుగుతాయి.