ఏపీ అసెంబ్లీ ఆగస్ట్ లో రద్దు.. తెలంగాణతోపాటే ఎన్నికలు.. రఘురామ జోస్యం...

First Published Jun 12, 2023, 8:46 AM IST

ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణతో పాటే ఎన్నికలు జరుగుతాయని.. ఆగస్టులో జగన్ అసెంబ్లీని రద్దు చేస్తారంటూ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఢిల్లీ : వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద జోస్యం చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీలోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆగస్టులో ఏపీ అసెంబ్లీని రద్దుచేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు చేశారు. ఇటీవల శ్రీకాళహస్తి సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను ఊటంకిస్తూ.. ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితులు లేవని అన్నారు. దీనివల్లే ముఖ్యమంత్రి జగన్.. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళతారని చెప్పుకొచ్చారు.

ఢిల్లీలోని తన నివాసంలో ఆదివారం రఘురామకృష్ణంరాజు విలేఖరులతో మాట్లాడారు. జేపీ నడ్డా వ్యాఖ్యల ప్రకారం ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితి లేదని.. అప్పు పుట్టకపోతే జగన్ ప్రభుత్వాన్ని ఒక రోజు కూడా నడపలేరని అన్నారు. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఏపీ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్నారు. 

ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతోనే భారీగా దొంగ ఓట్లు నమోదు చేయిస్తుంది. దీనికి విశాఖపట్నం, గుంటూరులలో బయటపడ్డ ఉదంతాలే ఉదాహరణ. వైసిపి సానుభూతిపరుల ఇళ్లల్లో కొత్త ఓట్లను నమోదు చేయిస్తున్నారు. మరోవైపు టిడిపి, జనసేన సానుభూతిపరుల ఓట్లు తీసేస్తున్నారు.

దీని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఓటర్ల జాబితాను పరిశీలించాలి. ఓటర్లు కూడా తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి’  అని సూచనలు చేశారు. మరోవైపు ముందస్తు ఎన్నికలు రావని తమ పార్టీ నాయకత్వం ప్రతిపక్షాలను మభ్యపెడుతోందని.. అలా చెబుతూ మరోవైపు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేస్తుందని అన్నారు.  అలా చేసి అసెంబ్లీని రద్దు చేయాలన్నది ఎత్తుగడ అని అన్నారు.

అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత..  ఈ ప్రక్రియ వల్ల ఓటరు నమోదులో గందరగోళం నెలకొంటుంది అని జోస్యం చెప్పారు. కాళహస్తిలో జేపీ నడ్డా మాట్లాడడాన్నిపేర్కొంటూ.. ‘ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం నివేదికల ఆధారంగానే నడ్డా మాట్లాడారు.  దీనికి సమాధానం చెప్పాల్సింది పోయి మాజీ మంత్రి పేర్ని నాని నడ్డాను వ్యక్తిగతంగా దూషించారు. ఇది కరెక్ట్ కాదన్నారు.

కర్ణాటక ప్రజలు బిజెపిని తిరస్కరించారు. అక్కడ డిజిపిని ఢిల్లీకి తీసుకువెళ్లి సిబిఐ డైరెక్టర్ చేశారని..ఈ ఘటనతో సిబిఐ ఎలా పనిచేస్తుందో తెలిసింది అంటూ నాని విమర్శించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. జగన్ కోర్టుకు హాజరు కాకపోయినా సిబిఐ మౌనంగానే ఉందని గుర్తు చేశారు. తాను జగన్ బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించానని.. ఆ సమయంలో సిబిఐ తమకు కోర్టు ఎలా చెబితే అలా నడుచుకుంటామని చెప్పి పరోక్షంగా సహకరించిందన్నారు.  

వివేకా హత్య కేసులోనూ నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డి మీద కూడా ఉదాసీనంగానే ఉందని అలాంటి సిబిఐ మీద విమర్శలు చేయడం తగదని..  వారికి ఆగ్రహం తెప్పిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నాని గుర్తుంచుకోవాలని రఘురామా హితవు పలికారు. 

click me!