బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ఆంధ్ర ప్రదేశ్ తీరంవైపు దూసుకొస్తోంది. దీని కదలికలను ఇండియాకు చెందిన ఇన్శాట్-3డీఎస్ సహా మూడు శాటిలైట్లు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నాయి. ఇవి తీసిన ఫోటోలు ఇలా ఉన్నాయి..
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మురసు' తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు వేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతం ఈ తుపాను నెల్లూరుకు 80 కిమీ, కావలికు 90 కిమీ, ఒంగోలుకు 120 కిమీ, బాపట్లకు 150కిమీ, తిరుపతికు 160కిమీ, మచిలీపట్నంకు 190కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ (నవంబర్ 2, సోమవారం) రాత్రి లేదా రేపు (నవంబర్ 3,మంగళవారం) తెల్లవారుజామున ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని... ఈ సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండి ప్రఖర్ జైన్ సూచించారు.
అయితే ప్రస్తుతం పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ అరసు తుపానును పలు ఇండియన్ శాటిలైట్లు నిశితంగా గమనిస్తున్నాయి. ఎప్పటికప్పుడు తుపాను కదలికలను ఫోటోలు తీసి పంపిస్తున్నాయి. ఇలా INSAT-3DS శాటిలైట్ తీసిన ఫోటోల్లో దట్టమైన మేఘాలు, తుపాను ఆకారం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
24
అంతరిక్షం నుంచి మురసు తుపాను
ఇండియాకు చెందిన INSAT-3DS శాటిలైట్ లోని 'థర్మల్ ఇన్ఫ్రారెడ్' కెమెరా నవంబర్ 2 ఉదయం 10:00 నుంచి 10:27 గంటల మధ్య కొన్ని ఫోటోలు తీసింది. ఆంధ్రా తీరాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నట్లు ఈ ఫోటోల్లో స్పష్టంగా తెలుస్తోంది. తుపాను చుట్టూ ఉన్న మేఘాలు దాని తీవ్రతను చూపిస్తున్నాయి. దక్షిణ భారతదేశం, దాన్ని ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతం అంతా ఈ మేఘాలు వ్యాపించి ఉన్నాయి.
34
తీరం దాటే సమయంలో అల్లకల్లోలం తప్పదా?
నవంబర్ 2 ఉదయం 8:30 గంటల సమయానికి మురసు తుపాను గంటకు 22 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలిందని ఐఎండీ (IMD) తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 14.1°N అక్షాంశం, 81.4°E రేఖాంశం వద్ద ఈ తుపాను కేంద్రీకృతమై ఉంది.
ఈ తుపాను వాయువ్య దిశగా కదులుతూ.. నెల్లూరు, నర్సాపురం మధ్య (ఒంగోలుకు దక్షిణంగా) తీవ్ర తుపానుగా తీరం దాటనుంది. నవంబర్ 2 రాత్రి 11:30 నుంచి నవంబర్ 3 తెల్లవారుజామున 4:00 గంటల మధ్య ఇది తీరాన్ని తాకుతుంది. ఆ సమయంలో గంటకు 100 నుంచి 110 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఒక్కోసారి గాలి వేగం 120 కి.మీ కూడా దాటొచ్చని అధికారులు హెచ్చరించారు.
ఇటీవలే వచ్చిన 'అర్నబ్ ' తుపాను ఆంధ్ర ప్రదేశ్ లో అల్లకల్లోలం సృష్టించింది… కనీసం వారంరోజులు కూడా గడవకముందే 'మురసు' తుపాను వచ్చింది. ఇలా వరుస తుపానులు తూర్పు తీర ప్రాంత ప్రజలను భయపెడుతున్నాయి.
తాజా తుపానుతో విపత్తు నిర్వహణ సంస్థలు అప్రమత్తం అయ్యాయి. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు వేగవంతం చేశారు. భారీ వర్షాలు, సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
వాతావరణ నిపుణులు థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఫోటోల ద్వారా మేఘాల కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు. ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.