పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకుగాను టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. జమిలి ఎన్నికలు జరిగితే ఆ సమయానికి ఏపీ రాష్ట్రంలో పార్టీని ఎన్నికలకు సిద్దం చేయడానికి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శులకు ఐదేసి లోక్‌సభ స్థానాలకు ఇంచార్జీలుగా నియమించారు.
2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కొందరు టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు బీజేపీలో చేరారు. మరికొందరు వైసీపీకి మద్దతు ప్రకటించారు. మరికొందరు నేతలు కూడ ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
కొందరు నేతలపై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల్లో ఇరుక్కొన్నారు. దీంతో టీడీపీ క్యాడర్ లో కొంత నిరాశ నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడం కోసం చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు
లోక్‌సభ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమించారు. గతంలో జిల్లా అధ్యక్షులు ఉండేవారు. వారి స్థానంలో ఎంపీ స్థానానికి అధ్యక్షులను నియమించారు.
తాజాగా చంద్రబాబునాయుడు మరో నిర్ణయం తీసుకొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులకు ఐదేసి ఎంపీ స్థానాలకు ఇంచార్జీలుగా నియమించారు.
రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలను ఐదు జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్ లోని ఐదు ఎంపీ స్థానాల్లో పార్టీ కార్యక్రమాల పనితీరు పరిశీలన పర్యవేక్షణ బాధ్యతను ఒక్కో ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు అప్పగించారు.
మంగళవారం నాడు చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని ప్రకటించారు.
జోన్ 1 కింద శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి, అరకు ఎంపీ స్థానాలున్నాయి. వీటికి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇంచార్జీగా వ్యవహరిస్తారు.
జోన్ 2 కింద కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. జోన్ 2 కి పంచుమర్తి అనురాధ ఇంచార్జీగా వ్యవహరించనున్నారు.
జోన్ 3 పరిధిలో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల నియోజకవర్గాలున్నాయి. వీటికి చెంగల్రాయుడు ఇంచార్జీగా ఉంటారు.
జోన్ 4 పరిధిలో ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట ఎంపీ స్థానాలున్నాయి. ఈ జోన్ కు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పర్యవేక్షించనున్నారు.
జోన్ 5 పరిధిలో కడప, అనంతపురం, హిందూపురం, కర్నూల్, నంద్యాల ఎంపీ స్థానాలున్నాయి. ఈ జోన్ కు మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి ఇంచార్జీగా ఉండనున్నారు.
ఇతర పార్టీలతో సమన్వయం చేసే బాధ్యతను మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కు అప్పగించారు చంద్రబాబు. 25 ఎంపీ స్థానాల నుండి వచ్చే నివేదికలు, ఇతర అంశాలపై పార్టీ కార్యాలయం నుండి సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి నిర్వహించనున్నారు.