ఏపీ, తెలంగాణను కుదిపేసిన వానలు... ఎంత నష్టం?

First Published Sep 3, 2024, 1:44 PM IST

ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. వందలాది గ్రామాలు, పట్టణాలు జలమయం అయ్యాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వరద సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. భారీగా నష్టం వాటిల్లగా.. కేంద్రం సాయం చేస్తుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.

మూడు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. వందలాది గ్రామాలు, పట్టణాలను వరద నీరు చుట్టముట్టడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. 

గతంలో ఎన్నడూ లేనివిధంగా గత మూడురోజుల్లో కురిసిన వానలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో అల్లకల్లోలం సృష్టించాయి. భారీ వర్షాలకు 3ం మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 26 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రెండు రాష్ట్రాల్లో వరద సహాయక చర్యలు చేపట్టాయి.

Rains in Andhra Pradesh

ఏపీలో సీఎం చంద్రబాబు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిస్థాయిలో వరదలపై దృష్టిపెట్టారు. భారీ వర్షాలతో నీట మునిగిన విజయవాడ, పరిసర ప్రాంతాల్లోనే సీఎం చంద్రబాబు మకాం వేశారు. విజయవాడ కలెక్టరేట్‌నే క్యాంపు ఆఫీసుగా మార్చేసుకొని రెండు రోజుల పాటు రాత్రింబవళ్లు సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులకు ఆహారం, నీళ్లు అందేలా చూశారు.

Latest Videos


Rains in Telangana

తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు పర్యటించారు. ఖమ్మం, వరంగల్‌, ఇతర జిల్లాల్లో బాధిత ప్రజలను పరామర్శించి.. సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు పర్యటించారు. బాధిత ప్రజలను పరామర్శించి.. అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను సైతం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

NDRF forces in flood relief operations

రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక హెలికాప్టర్‌లు, బోట్ల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడాయి డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ బలగాలు. భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని 4.5 లక్షల మంది ప్రభావితమయ్యారు. 166 సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి.. 30 వేల మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Submerged Vijayawada

ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రాలోని విజయవాడ నగరం వర్షంతో అతలాకుతలమైంది. నడుము లోతు వరకు నీళ్లు వచ్చేయడంతో జనం ఇళ్ల నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి. 

ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 32.3 సెంటీమీటర్లు అంటే 323 మిల్లీమీటర్లు నమోదైంది. జగ్గయ్యపేటలో 20.27 సెం.మీ, తిరువూరులో 26.0 సెం.మీ, గుంటూరులో 26.0 సెం.మీ వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లపైనే వర్షపాతం నమోదైంది. దీంతో ఏపీలో లక్షా 11 వేల 259 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 7,360 హెక్టార్లలో హార్టి కల్చర్‌  పంటలు దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున రోడ్లు ధ్వంసమయ్యాయి. 

Roads damaged by heavy rains

అటు, తెలంగాణలోనూ వర్షం చాలా ప్రభావితం చేసింది. భారీ వర్షాల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 117 గ్రామాలకు వెళ్లే రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తెలంగాణలోని తిరుమలాయపాలెం మండలంలో 24 గంటల్లోనే 52.2 సెంటీమీటర్ల భారీ వర్షం కురవడం రికార్డు. ఈ వర్షాల కారణంగా తెలంగాణకు 5 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఇంకా, లక్షన్నర హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలను వర్షాలు ముంచెత్తడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది.

Prime Minister Modi's assurance on flood relief

ఇక, తెలుగు రాష్ట్రాల్లో వర్ష ప్రభావంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

కాగా, భారీ వర్షాల కారణంగా పలుచోట్ల రైలు పట్టాలు నీటమునిగాయి. కొన్ని చోట్ల రైలు మార్గం దెబ్బతినగా.. హుటాహుటిన మరమ్మతులు చేపట్టే పనిలో పడ్డారు. ఈ పరిణామాలతో 140కి పైగా రైళ్లను రద్దయ్యాయి.

click me!