నెల్లూరు: నివర్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఆంధ్ర ప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకల్లోకి వరదనీరు పోటెత్తడంతో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే ఇలా ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్న నీటిలో నాలుపడవపై ప్రయాణించారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వరదనీటిలో చిక్కుకున్న గ్రామాల ప్రజల యోగక్షేమాలను తెలుసుకునేందుకు ఆయన ఈ సాహసం చేశారు.
నెల్లూరు జిల్లా సంగం మండలంలోని వీర్లగుడిపాడు గ్రామం వరదనీటిలో చిక్కుకుంది. అయితే ఇప్పటికే గ్రామస్తులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించగా ఇంకో 100మంది వరదనీరు చుట్టుముట్టిన ఆ గ్రామంలోనే వున్నట్లు మంత్రి మేకపాటి దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు.
ప్రమాదకర నీటి ప్రవాహంలో స్వయంగా పడవ నడుపుతూ వెళ్లి గ్రామస్థులను పలకరించారు మంత్రి.వీర్లగుడిపాడు గ్రామంలో చిక్కుకున్న ప్రజలకు భోజన సదుపాయాలు, ఇతర అత్యవసరాలపై పడవలోనే అధికారులతో చర్చించారు.ఎంతో శ్రమకోర్చి ఉదృతంగా ప్రవహిస్తున్న నీటిలో పడవను స్వయంగా నడుపుతూ తమ ఊరికి రావడంతో ప్రజల సంతోషం వ్యక్తం చేశారు. తమ బాగోగుల కోసం మంత్రి చేసిన ప్రయత్నాన్ని వారు ప్రశంసించారు.
ఇకపై ఎలాంటి సమస్య లేకుండా గ్రామస్తుల రాకపోకలకు అనువుగా బ్రిడ్జి కట్టిస్తానన్న మంత్రి గౌతమ్ రెడ్డిహామీ ఇచ్చారు. బ్రిడ్జి ఎలా కడితే సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుందో కూడా అప్పటికప్పుడే పరిశీలించారు మంత్రి. వరద వస్తున్న నేపథ్యంలో ముందు ముందు ప్రజలకు మంచినీరు, భోజన సదుపాయాలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆర్డీవోను మంత్రి ఆదేశించారు.
అంతకు ముందు పెన్నా నది ప్రవాహాన్ని పరిశీలించారు మంత్రి మేకపాటి. ఈ తరం చూడని పెన్నా ప్రవాహం అని మంత్రి వ్యాఖ్యానించారు.1995 తర్వాత పెన్నా నదికి వచ్చిన గరిష్ట వరద ఇదేనన్నారు. సముద్రాన్ని తలపిస్తోన్న పెన్నానది ప్రవాహం ప్రస్తుత వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కుండపోత వర్షాల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మతులు, పంటపొలాలకు నష్టపరిహారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్న మంత్రి ఆదేశించారు.
ఇకరెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నిండిన చేజర్ల మండలంలోని నాగుల వెల్లటూరు గ్రామంలోని చెరువు పరిస్థితిని పరిశీలించారు మంత్రి మేకపాటి.విద్యుత్ లేకపోవడం, పంట పొలాలు నీట మునిగడం వంటి సమస్యలను మంత్రి మేకపాటికి వివరించిన గ్రామ ప్రజలు. చెరువుకు గండి పడడం వలన ఇబ్బంది పడే గ్రామాల వివరాలపై మంత్రి ఆరాతీశారు. రోడ్లపై నడుస్తూ వర్షం వల్ల ఎదురైన ఇబ్బందుల గురించి ప్రజలతో మాట్లాడారు మంత్రి.అన్ని సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని, ఆందోళన చెందవద్దని ప్రజలకు మంత్రి మేకపాటి భరోసా ఇచ్చారు.