ఓ యువకుడు చదువుపై మక్కువతో సాధారణ సైకిల్ ను కాస్త ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చేశాడు. అతడి ప్రతిభకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఫిదా అయ్యారు. ఇలా ఆ యువకుడి ఆదర్శవంతమైన స్టోరీ ఏమిటో ఇక్కడ తెలుసుకొండి.
Andhra Pradesh : పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని నిరూపించాడో తెలుగు యువకుడు. ఎందరో ప్రపంపస్థాయి పరిశోధనలు, టెక్నీషియన్లు కలిగిన ఆటోమొబైల్ సంస్థలే ఎలక్ట్రిక్ వాహనాలను పర్ఫెక్ట్ గా తయారుచేయడంలో విఫలం అవుతున్నాయి. చాలా కంపెనీల EV వాహనాలు సాంకేతిక లోపాల కారణంగా పేలిపోవడం, మంటల్లో చిక్కుకోవడం వంటి ఘటనలు అనేకం చూస్తున్నాం. వందలు వేలకోట్లు పోసి అత్యాధునిక టెక్నాలజీతో తయారేచేసిన వాహనాలే ఫెయిల్ అవుతున్నవేళ నూనుగు మీసాల వయసులో తెలుగు కుర్రాడు సొంతంగా ఓ సాధారణ సైకిల్ ను ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చి ఔరా అనిపించాడు... పెద్దపెద్ద ఆటోమొబైల్ కంపెనీలనే ఆశ్చర్యపడేలా చేసాడు.
చివరకు ఈ విద్యార్థి ప్రతిభ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరకు చేరింది. యువతను నేటి టెక్ జమానాకు అనుగుణంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్న ఆయన ఈ యువకుడి ఆవిష్కరణకు ఫిదా అయిపోయాడు. వెంటనే అతడిని పిలిపించుకుని అభినందించిన పవన్ కల్యాణ్ స్వయంగా ఎలక్ట్రిక్ సైకిల్ ను నడిపిచూసారు. ఆ యువకుడి లక్ష రూపాయలు ప్రోత్సాహకంగా అందించారు. దీంతో ఒక్కసారిగా రాజపు సిద్దు అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది.
25
పవన్ కల్యాణ్ మెచ్చిన ఈ యువకుడు ఎవరు?
ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విజయనగరం జిల్లా తెర్లాం మండలం జి. కొత్తవలస గ్రామానికి చెందిన రాజపు సిద్దు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇతడు రాజాంలోని ఓ జూనియర్ కాలేజీలో ఎంపిసి చేస్తున్నాడు. అయితే ఇతడి గ్రామానికి సరైన రవాణా సౌకర్యం లేదు.. కాలేజీకి వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు నడిచివెళ్లాలి... అక్కడ బస్సెక్కి రాజాం చేరుకోవాల్సి ఉండేది. కొన్నిరోజులు ఇలాగే కాలినడకన వెళ్లి బస్సెక్కేవాడు సిద్దు.
అయితే ఇంత కష్టపడి వెళుతున్నా కాలేజీకి ఆలస్యం అయ్యేది... క్లాసులు మిస్సయ్యేవాడు. దీంతో ఇలాగైతే కుదరదని ఓ సైకిల్ తీసుకున్నాడు... రోజూ దానిపై వెళ్లడం ప్రారంభించాడు. అయినా సమయానికి కాలేజీకి వెళ్లలేకపోయేవాడు. ఈ క్రమంలోనే అతడిలోని అసాధారణ ప్రతిభను బైటపడింది. ఈ సైకిల్ ను కాస్త ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చి తన కష్టాలకు చెక్ పెట్టేసాడు. ఈ ఆవిష్కరనే సిద్దుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది... చివరకు పవన్ కల్యాణ్ వరకు చేర్చింది.
35
ఎలక్ట్రిక్ సైకిల్ మైలేజ్ ఎంతో తెలుసా?
ఎలక్ఖ్రిక్ సైకిల్ అందుబాటులోకి వచ్చాక తన కష్టాలన్ని తీరిపోయాయని సిద్దు చెబుతున్నాడు. తన గ్రామం నుండి మూడు కిలోమీటర్లు నడిచివెళ్లడం తప్పిందని... రోజూ రూ.60 బస్సు ఛార్జీలు కూడా ఆదా అవుతున్నాయని సిద్దు చెబుతున్నాడు.
ఈ సైకిల్ ను ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేయడానికి కేవలం 6 రూపాయలే ఖర్చవుతుందని... అతి తక్కువ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుందని తెలిపాడు. ఇలా ఫుల్ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని సిద్దు చెబుతున్నాడు. అంటే సిద్దు గ్రామం నుండి రాజాం దాదాపు 20 కిలోమీటర్లు, రానుపోను 40 కి.మీ... అంటే కేవలం 3 రూపాయల ఖర్చుతో అతడు కాలేజీకి వెళ్లివస్తున్నాడన్నమాట. గతంలో ఒక్కరోజు బస్సులో వెళ్లే ఖర్చుతో ఇప్పుడు 20 రోజులు వెళుతున్నాడు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తప్పాయని సిద్దు చెబుతున్నాడు.
45
ఛార్జ్ చేయకున్నా ఈ సైకిల్ నడుస్తుంది...
ఇక ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఛార్జ్ చేయడానికి మూడు గంటల సమయం పడుతుంది. ఎప్పుడైనా కరెంట్ లేకపోతే కంగారుపడాల్సిన పనిలేదు...ఛార్జింగ్ లేకుంటే దీన్ని సాధారణ సైకిల్ మాదిరిగా ఉపయోగించవచ్చు. ఇలా అవసరం ఉంటే EV సైకిల్ లా లేదంటే సాధారణ సైకిల్ లా వాడుకోవచ్చు.
55
EV సైకిల్ ను నడిపిన పవన్ కల్యాణ్
విజయనగరంకు చెందిన కొందరు నాయకుల ద్వారా రాజపు సిద్దు అద్భుత ప్రతిభ గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించే ఆయన వెంటనే సిద్దును తనవద్దకు పిలుపించుకున్నారు. అతడు సొంతంగా తయారుచేసిన ఎలక్ట్రిక్ సైకిల్ ను పరిశీలించాడు. అంతేకాదు సిద్దును వెనకాల కూర్చోబెట్టుకుని దాన్ని నడిపిచూసారు. కోట్లాదిమంది అభిమాన హీరో, ప్రజా నాయకుడు పవన్ కల్యాణ్ తన ఆవిష్కరణకు ఫిదా కావడం, ప్రత్యేకంగా అభినందించడంతో సిద్దు ఆనందానికి అవధులు లేవు.
అద్భుత ప్రతిభను మెచ్చుకుని సిద్దుకు లక్ష రూపాయలు ప్రోత్సాహకంగా అందించారు పవన్ కల్యాణ్. స్వయంగా అతడికే చెక్కును అందజేసారు. బాగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని సిద్దును ఆశీర్వదించారు.
ఇలా తన అభిమాన నాయకుడి నుండి ప్రశంసలు అందుకోవడం పట్టరాని ఆనందాన్నిచ్చిందని సిద్దు అంటున్నాడు. ఇకపై కూడా ఇలాంటి సరికొత్త ఆవిష్కరణలు రూపొందించేందుకు ప్రయత్నిస్తానని సిద్దు గర్వంగా చెబుతున్నాడు.