సోము వీర్రాజు నామినేషన్ పై ఉత్కంఠ :
ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు టిడిపి, ఒకటి జనసేన పోటీ చేస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా బిజెపి తెరపైకి వచ్చింది... చివర్లో సోము వీర్రాజును బిజెపి బరిలోకి దింపింది. దీంతో కూటమిలోని టిడిపికి 3, జనసేనకి 1, బిజెపికి 1 ఎమ్మెల్సీ స్థానాలు దక్కాయి.
చివరి క్షణంలో తన పేరు ఖరారు కావడంతో సోము వీర్రాజు స్వస్థలం రాజమండ్రి నుండి హుటాహుటిన అమరావతికి చేరుకున్నారు. కానీ నామినేషన్ పత్రాల్లో కీలకమైన బీఫారం గానీ, అది అందించే అధ్యక్షురాలు గానీ అందుబాటులో లేరు. దీంతో అసలు బిజెపి అభ్యర్థి నామినేషన్ సజావుగా సాగుతుందా అన్న అనుమానం ఏర్పడింది.
అయితే తెలంగాణ బిజెపి కార్యాలయంలో బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా సంతకంచేసిన బిఫారం ఉంది. దాన్ని ప్రత్యేక విమానంలో గన్నవరం పంపించారు. ఇదే సమయంలో పార్లమెంట్ సమావేశాల కోసం డిల్లీలో ఉన్న ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా హుటాహుటిన ఏపీకి బయలుదేరారు. కానీ ఆమె వచ్చేందుకు ఆలస్యం అయ్యేలా ఉండటంతో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు బీఫారంపై సంతకం చేసి ఇచ్చారు.
కాశీ విశ్వనాథరాజు కూడా ఏలూరులో ఓ కార్యక్రమంలో ఉండగా ఫోన్ వచ్చింది...దీంతో అర్ధాంతరంగా ఆ కార్యక్రమాన్ని ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు. హైదరాబాద్ నుండి వచ్చిన బీఫారం తీసుకుని నేరుగా అసెంబ్లీకి వెళ్ళారు. అప్పటికే అక్కడ నామినేషన్ పత్రాలతో సోము వీర్రాజు సిద్దంగా ఉన్నాడు... కాబట్టి వెంటనే ఈ బీఫారం జతచేసి సమర్పించారు.
ఇలా నామినేషన్ దాఖలకు సోమవారం 3 గంటలవరకే సమయం ఉండగా 2.46 గంటలకు సోము వీర్రాజు నామినేషన్ దాఖలయ్యింది. అంటే కేవలం 14 నిమిషాల ముందు ఆయన నామినేషన్ దాఖలుచేసారు. అయితే నామినేషన్ కోసం డిల్లీ నుండి హుటాహుటిన బయలుదేరినా సమయానికి చేరుకోలేకపోయారు పురందేశ్వరి. నామినేషన్ వేసాక సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పరందేశ్వరిని కలిసారు సోము వీర్రాజు.