భారత రాజ్యాంగం ఎంత మంచిదైనా. ఏపీ సీఎం చద్రబాబు నాయుడు కామెంట్స్ వైరల్

First Published | Aug 15, 2024, 6:54 PM IST

Independence Day : 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర‌ప్రదేశ్ సీఎం చంద్ర‌బాబు నాయుడు భారతీయులకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో తాము మెరుగైన పాల‌న అందిస్తున్నామ‌నీ, రాష్ట్ర అభివృద్ధికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు.

Independence Day : దేశ‌వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జాతీయ జెండాను ఎగుర‌వేసి.. ప్ర‌సంగించారు. ఆయ‌న ప్ర‌సంగంలో చేసిన ప‌లు వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారియి. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధాని కూడా లేని పరిస్థితుల్లో నాడు పాలన ప్రారంభించామనీ, ఎక్కడ కూర్చుని పనిచేయాలో కూడా తెలియని అనిశ్చితి పరిస్థితి నుంచి పాలన మొదలు పెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించామని చెప్పారు. తమకున్న అనుభవం, ప్రజల సహకారం, కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనే నిలదొక్కుకున్నామనీ, సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.దేశంలో ఎవరూ ఊహించని విధంగా సంస్కరణలతో, సమర్థవంతమైన నిర్ణయాలతో, సరికొత్త పాలసీలతో 13.5 శాతం వృద్ది రేటుతో దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డామని చంద్రంబాబు చెప్పారు. 

తమ పాలనలో 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచామని చెప్పారు. “ఈజ్ ఆఫ్ డూయింగ్” బిజినెస్‌లో నెంబర్ వన్ స్థానంలో నిలిచామని చెప్పారు. రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించామన్నారు. 2014 - 2019 కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యంగా దూసుకుపోయిందని చెప్పిన చంద్రబాబు.. దేశంలో నాడు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద బ్రాండ్ గా ఆవిష్కృతమైందన్నారు. రాష్ట్రానికి నడిబొడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో దేశం గర్వించే స్థాయి రాజధానికి శంకుస్థాపన చేసుకున్నామని చెప్పారు. ప్రజల సహకారంతో 34 వేల ఎకరాల భూసమీకరణ చేసి ప్రపంచం చర్చించుకునే డిజైన్లతో సంపద సృష్టించే రాజధాని నిర్మాణం మొదలు పెట్టామన్నారు. 


మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని చెప్పిన చంద్రబాబు.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది తాను ఎప్పుడూ నమ్ముతానన్నారు. అందుకే సాగునీటి రంగానికి అత్యంత  ప్రాధాన్యం ఇచ్చి నాడు 5 ఏళ్ల కాలంలో రూ. 68 వేల కోట్లు ఇరిగేషన్ పై ఖర్చు చేశామని చెప్పారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఒక యజ్ఞంలా పోలవరాన్ని నాడు పరుగులు పెట్టించి 72 శాతం పనులు పూర్తి చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ పాటికే పోలవరం పూర్తై ఆ ఫలాలను రాష్ట్ర ప్రజలు పొందేవాళ్లమన్నారు.

120కి పైగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, శాంతి భద్రతలు, అందరికీ ఉపాధి, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలతో రాష్ట్రం దూసుకుపోతున్న క్రమంలో 2019లో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటి మయం చేశాయని చెప్పారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు కనీవినీ ఎరుగని విధ్వంసాన్ని సృష్టించారని వైకాపా పై విమర్శలు గుప్పించారు. "వ్యవస్థలను చెరబట్టారు. బాధితులనే నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. నియంత పోకడలతో, పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు. ప్రభుత్వ టెర్రరిజానికి నాంది పలికారు. ప్రజల, ప్రభుత్వ భూములు, ఆస్తులు దోచుకున్నారు. ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులతో పెను ఉత్పాతం సృష్టించారని" ఫైర్ అయ్యారు. 

చివరిగా భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వ్యాఖ్యలను ఒక్కసారి అందరం గుర్తు చేసుకుందామని చెప్పిన చంద్రబాబు.. "రాజ్యాంగం ఎంత మంచిది అయినా అది అమలు చేసేవాడు మంచి వాడు కాకపోతే అది చెడు ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా రాజ్యాంగం మంచిది కాకపోయినా అమలు చేసేవాడు మంచివాడు అయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది" చెప్పారు. రాజ్యాంగంతో పాటు ఇప్పుడు పాలకులూ మంచివారే కాబట్టి ప్రజలకు నూటికి నూరుశాతం మంచే జరుగుతుందని చంద్రబాబు అన్నారు. మంచి చేసే తమ ప్రభుత్వానికి మీ ఆశీస్సులు సదా ఉండాలని కోరుతున్నామని తెలిపారు.

Latest Videos

click me!