Andhra Pradesh Bandh : రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్... పరీక్షలు సైతం వాయిదా

Published : Feb 11, 2025, 01:26 PM ISTUpdated : Feb 12, 2025, 09:47 AM IST

Manyam Bandh :  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఏకంగా రాష్ట్రంలో పలుప్రాంతాల్లో బంద్ కు కారణమయ్యారు. ఇంతకూ ఆయన చేసిన కామెంట్స్ ఏమిటి? బంద్ కు పిలుపునిచ్చింది ఎవరు? తెలుసుకుందాం. 

PREV
14
Andhra Pradesh Bandh : రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్... పరీక్షలు సైతం వాయిదా
Manyam Bandh

Manyam Bandh : ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్నిప్రాంతాల్లో ఇవాళ, రేపు (మంగళ,బుధవారం) విద్యార్థులకు సెలవులు వస్తున్నాయి. విశాఖపట్నం పరిసరాల్లోని గిరిజన ప్రాంతాల్లో విద్యాసంస్థలు ఫిబ్రవరి 11, 12 తేదీల్లో మూతపడనున్నాయి.ఇవాళ ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యాయి.... రేపు కూడా ఇదే పరిస్థితి వుండనుంది. 

మన్యం ప్రాంతంలోని ఆదివాసి, గిరిజన సంఘాలు తమ హక్కులను కాపాడుకునేందుకు 48 గంటలపాటు బంద్ పాటిస్తున్నాయి. వీరికి వామపక్షాలు, వైసిపి మద్దతు తెలిపింది. దీంతో మన్యంప్రాంతంలో స్కూళ్లు, కాలేజీలే కాదు షాపులు, కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. 

అల్లూరి సీతారామరాజ జిల్లాలో ఈ బంద్ కొనసాగుతోంది. కొంతకాలంగా మన్యంలోని ఆదివాసీ, గిరిజనులు తమకు అన్యాయం జరుగుతోందని అసంతృప్తితో వున్నారు. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదివాసీల హక్కులకు భంగం కలిగించేలా కామెంట్స్ చేసారు. దీంతో ఒక్కసారిగా అడవిబిడ్డల ఆగ్రహం పెల్లుబికింది. స్పీకర్ మాటలు ప్రభుత్వ తీరును ప్రతిబింబిస్తున్నాయని... ఆయన బైటపెట్టినట్లు 1/70 చట్టాన్ని రద్దుచేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందేమో  అన్న అనుమానం మొదలయ్యింది. దీంతో ముందుజాగ్రత్తగా ఆదివాసీ, గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. 
 

24
Andhra Pradesh Bandh

మన్యంలో కొనసాగుతున్న బంద్ : 

విశాఖ మన్యం ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజాము నుండే బంద్ మొదలయ్యింది. ఉదయమే రోడ్డెక్కిన గిరిజన సంఘాలు, వామపక్ష నాయకులు ముందుగా ఆర్టిసి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం షాపులు, ఇతర కార్యాలయాలను మూసివేయించారు. 

ఇక ముందుగానే బంద్ పై సమాచారం వుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు నడిపే ప్రయత్నంచేయగా ఆదివాసీ సంఘాల నాయకులు మూసివేయించారు. బంద్ నేపథ్యంలో ఇవాళ, రేపు జరగాల్సిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ను అధికారులు వాయిదా వేసారు. 

ఆర్టిసి బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలను అడ్డుకోవడంతో అత్యవసర పనులపై బయటకు వచ్చిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.  అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో పూర్తిస్థాయిలో బంద్ కొనసాగుతోంది. గిరిజన సంఘాల నాయకులు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టారు. 

ఆదివాసీ సంఘాలు చేపట్టిన ఈ బంద్ కు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తోంది. వైసిపి నాయకులు బంద్ లో పాల్గొంటున్నారు. కూటమి ప్రభుత్వం అడవిబిడ్డల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోంది... తీరు మారకుంటే ఆదివాసీ, గిరిజనులతో కలిసి ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని వైసిపి నాయకులు హెచ్చరిస్తున్నారు. 
 

34
1/70 Act

ఏమిటీ 1/70 చట్టం : 

అటవి బిడ్డలు అభివృద్దికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా జీవిస్తుంటారు. వారికి వ్యవసాయం, అటవీ ఉత్పుత్తులే జీవనాధారం. అయితే అభివృద్ది పేరిట ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లోకి ఇతరులు ప్రవేశించి వారి జీవనవిధానంపై ప్రభావం చూపించే ప్రమాదం వుంది. ఇది దశాబ్దాల క్రితమే గుర్తించిన పాలకులు 1/70 చట్టాన్ని తీసుకువచ్చారు. 

ఈ చట్టం ప్రకారం అటవీ ప్రాంతాల్లోని ఆదివాసులు, గిరిజన ప్రాంతాల్లో భూములపై అక్కడివారికి మాత్రమే హక్కులు వుంటాయి. ఇతర ప్రాంతాలనుండి ఇక్కడికి వెళ్లి భూములు కొనుగోలు చేయడానికి వీలుండదు. ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్ ప్రాంత భూలావాదేవీల చట్టం 1959 ద్వారా ఆదివాసీలకు ఈ ప్రత్యేక హక్కులు కల్పించబడ్డాయి. 

ఈ చట్టం ఏపీతో పాటు తెలంగాణలోని గిరిజన ప్రాంతాలకు వర్తిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 క్లాస్ (1) ప్రకారం ఈ హక్కులు కల్పించబడ్డాయి. ఇలా ప్రస్తుతం ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం,మహాబూబాబాద్ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఈ చట్టం అమలవుతోంది. 

1959 లో అమలులోకి వచ్చిన ఈ చట్టంలో 1970 లో కీలక సవరణలు చేసారు. దీంతో ఈ చట్టం 1/70 గా ప్రాచుర్యం పొందింది.  దీనిప్రకారం గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనేతరులు ఆస్తులు కొనడానికి వీలులేదు... అంతేకాదు ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాల్లోని భూములను గిరిజనేతరులకు ఇవ్వరాదని సుప్రీం కోర్టు తీర్పు వుంది. ఇలా అంతరించిపోతున్న ఆదివాసీ, గిరిజన తెగల సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకు ఈ 1/70 చట్టం ఎంతగానో ఉపయోగపడుతోంది. 

44
Ayyannapatrudu

1/70 చట్టంపై అయ్యన్నపాత్రుడు కామెంట్స్ : 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టూరిజం ప్రాంతాల అభివృద్దికి సిద్దమయ్యింది. ఇందులో భాగంగానే రాష్ట్ర టూరిజంలో పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ఇలా ఇటీవల విశాఖపట్నంలో రీజనల్ టూరిజం పెట్టుబడిదారుల సదస్సును ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆహ్వానించారు. 

అయితే రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో టూరిజం డెవలప్ మెంట్ గురించి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ 1/70 చట్టం గురించి ప్రస్తావించారు. దీనివల్ల గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులకు ఆటంకం కలుగుతోంది... కాబట్టి పర్యాటక కేంద్రాలను ఫ్రీజోన్ గా ప్రకటించాలని సూచించారు. తద్వారా టూరిస్టులను మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి... ఆ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఆదాయం వస్తుందన్నారు. కాబట్టి ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు అయ్యన్నపాత్రుడు సూచించారు.
 
ఇదే మన్యం ప్రాంతంలోని గిరిజనులు, ఆదివాసీలు ఆగ్రహానికి కారణం అయ్యింది. తమ హక్కులను కాలరేసేలా 1/70 చట్టాన్ని రద్దు చేయాలని స్పీకర్ సూచించడంపై భగ్గుమంటున్నారు. ఇందుకు నిరసగానే 48 గంటల బంద్ కు పిలుపునిచ్చారు. 

అయితే కూటమి ప్రభుత్వం మాత్రం తమకు 1/70 చట్టాన్ని రద్దుచేసే ఆలోచన లేదని చెబుతోంది. ఈ మేరకు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టమైన ప్రకటన చేసారు. గిరిజనులు, ఆదివాసీలు అసత్య ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. రాజకీయ లబ్దికోసమే వైసిపి 1/70 పై  తప్పుడు ప్రచారం చేస్తోందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.

click me!

Recommended Stories