Amaravati
Amaravati : 'రాజ్యమా... ఉలికిపడు' అన్నట్లుంది ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పరిస్థితి. గత ఐదేళ్లు ఎలాంటి అభివృద్ది పనులకు నోచుకోని అమరావతి మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఊపిరి పీల్చుకుంటోంది. గతంలో ఇదే చంద్రబాబు హయాంలో (2014-2019) కంటే వేగంగా పనులు జరుగుతున్నాయి. దీంతో అమరావతి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మళ్లీ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.
గత ఐదేళ్లు అమరావతి వైపు కన్నెత్తి చూసేవారు లేకుండాపోయారు...కానీ ఇలా కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అలా రాజధానిపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. ఇటీవల రాజధాని పనులు తిరిగి ప్రారంభంకాగానే రియల్ ఎస్టేట్ మరింత జోరందుకుంది. సామాన్యులు సైతం చంద్రబాబు విజన్, భవిష్యత్ ను దృష్టిలో వుంచుకుని రాజధానిలో స్థలాలు, భూములు కొనేందుకు సిద్దమయ్యారు. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే భూమిని కొనడంతో అమరావతిపై అంచనాలు మరింత పెరిగాయి.
Amaravati
అమరావతిలో ఐదెకరాల భూమి కొన్న చంద్రబాబు :
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో భూమి కొనుగోలు చేసారు. కొద్దిరోజులుగా అమరావతిలో మంచి భూమి కోసం చంద్రబాబు అన్వేషిస్తున్నారు. తాజాగా వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఐదెకరాలు భూమి ఆయనకు బాగా నచ్చింది. దీంతో వెంటనే ఆ భూమి యజమానులతో మాట్లాడి కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు... ఇప్పటికే డబ్బులు కూడా చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఐదెకరాల భూమిలో చంద్రబాబు నివాసాన్ని నిర్మించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ భవనాల నిర్మాణంకోసం మట్టి పరీక్షలు కూడా జరుపుతున్నారు. తన కుటుంబంకోసం విశాలవంతమైన భవనంతో పాటు క్యాంప్ ఆఫీస్ కోసం మరో భవనాన్ని నిర్మించుకునే ఆలోచనలో చంద్రబాబు వున్నట్లు తెలుస్తోంది. ఇక సెక్యూరిటీ సిబ్బంది, వర్కర్ల కోసం మరికొన్ని నిర్మాణాలు చేపట్టి మిగతా ప్రాంతాన్ని వాహనాల పార్కింగ్, పచ్చటి ఉద్యానవనాన్ని ఏర్పాటుచేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్నారు. అది ఇంకా నిర్మాణ దశలో వుంది. ఇప్పుడు రాజధాని అమరావతిలో మరో ఇంటిని కట్టుకోడానికి ఆయన సిద్దమయ్యారు. పాలనా వ్యవహారాలను చూసుకోవడంతో పాటు రాజధాని నిర్మాణ పనులను దగ్గరుండి పరిశీలించేందుకు అనువుగా వుంటుందనే చంద్రబాబు అమరావతిలో ఇంటిని కట్టుకుంటున్నట్లు టిడిపి నాయకులు చెబుతున్నారు.
Amaravati
అమరావతిలో ఆ ప్రాంతం మరో బంజారాహిల్స్ , జూబ్లిహిల్స్ అవుతుందా?
ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడి ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు వెలిసాయి. తాత్కాలిక హైకోర్టు, న్యాయమూర్తుల బంగ్లాలు, గెజిటెడ్ అధికారులు,ఎన్జివోల నివాస సముదాయాలతో పాటు అనేక కార్యాలయాలు ఈ వెలగపూడి చుట్టుపక్కలే వున్నాయి. ఇప్పుడు చంద్రబాబు కొనుగోలుచేసిన భూమి వీటికి కేవలం ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలోనే వుంటుంది.
దీంతో ఇప్పటికే వెలగపూడి ప్రాంతంలో భూములకు మంచి గిరాకీ ఏర్పడింది. ఇప్పుడు చంద్రబాబు భూమి కొనుగోలు చేయడంతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మరో స్థాయికి చేరుకునే అవకాశం వుంది. అంతేకాదు ప్రస్తుతం సీఎం కొనుగోలు చేసిన భూమి పక్కనుండే కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ వెళుతుంది.
భవిష్యత్ లో చంద్రబాబు ఇక్కడే నివాసం వుండనున్నారు... ప్రభుత్వ కార్యాలయాలన్ని ఈ చుట్టుపక్కలే వున్నాయి. కాబట్టి భవిష్యత్ లో ఈ ప్రాంతం బాగా డెవలప్ అయ్యే అవకాశం వుందని రియల్ ఎస్టేట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. హైదరాబాద్ లో బంజారాహిల్స్,జూబ్లిహిల్స్ మాదిరిగా కాస్ట్లీ ప్రాంతంగా మారినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
Amaravati
అమరావతిలో ఊపందుకున్న పనులు :
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి భారీ విజయాన్ని సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కూడా ఈ కూటమి కీలకంగా మారింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు భారీగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే కేంద్ర బడ్జెట్ లో అమరావతి నిర్మాణానికి భారీ నిధులు దక్కాయి.
ఇక అమరావతిలో గత ఐదేళ్లుగా ఎలాంటి నిర్మాణాలు జరక్కపోవడంతో ఆ ప్రాంతమైన ముళ్లపొదలు, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. అసంపూర్తిగా వున్న నిర్మాణాల్లో వర్షపునీరు చేరి అధ్వాన్నంగా తయారయ్యాయి. గతంలో వేసిన రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో అధికారంలో వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో క్లీనింగ్ పనులు చేపట్టారు.
ఇన్నిరోజులు ఈ పనులతోనే సరిపోయింది... ఇప్పుడు అసలు పనులు షురూ చేసింది చంద్రబాబు సర్కారు. ఒక్కొక్కటిగా అమరావతి అభివృద్ది పనులను ప్రారంభిస్తున్నారు. ఈ ఐదేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేయాలనే పట్టుదలతో ప్రభుత్వం వుంది. కేంద్ర ప్రభుత్వం ఎలాగూ సహాయం చేయకతప్పని పరిస్థితి... కాబట్టి భారీగా నిధులు రాబట్టి ఈ టర్మ్ లోనే రాజధానిని పూర్తిచేయాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది.
అయితే ఈ రాజధాని నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, వేగం పెంచేలా నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అందువల్లే ఆయన అమరావతికి మకాం మార్చాలని నిర్ణయించుకున్నారు. తన సతీమణి నారా భువనేశ్వరి, కొడుకు కోడలు నారా లోకేష్, బ్రహ్మణి, మనవడు దేవాన్ష్ తో కలిసి అమరావతిలో నివాసం వుండనున్నారు చంద్రబాబు నాయుడు.