మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి డిజిటల్ చెల్లింపులు తేలిగ్గా చేపట్టవచ్చు. ఇప్పటికే వాట్సాప్ డిజిటల్ చెల్లింపులకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఇప్పటికే అనుమతులు లభించినందుకు త్వరలో వాట్సాప్ వినియోగదారులకు వాట్సాప్ పే సేవలందుబాటులోకి వచ్చాయి.
న్యూఢిల్లీ: ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి డిజిటల్ చెల్లింపుల సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దశల వారీగా డిజిటల్ చెల్లింపుల ఫ్లాట్‌పాం వాట్సాప్ పే సేవలను ప్రారంభించేందుకు భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) వాట్సాప్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
also read ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో రారాజుగా ‘ఐఫోన్’:ఆపిల్ కంపెనీదే పై చేయి
ఆర్బీఐ అనుమతి లభించిన కొద్దిరోజులకే ఎన్‌పీసీఐ నుంచి ఆమోదం లభించడంతో వాట్సాప్ పే యూజర్లకు అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. వాట్సాప్ పే సేవల్లో జాప్యానికి కారణమైన డేటా లోకలైజేషన్ నిబంధనలపై నియంత్రణసంస్ధలకు భరోసా ఇవ్వడంతో క్లియరెన్స్‌లు లభించాయి.
డేటా లోకలైజేషన్ నిబంధనలకు అనుగుణంగా సేవలు అందిస్తామని వాట్సాప్ నియంత్రణ సంస్థలకు స్పష్టం చేసింది. తొలి దశలో భాగంగా వాట్సాప్ భారత్‌లో కోటి యూజర్లకు చెల్లింపు సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇతర నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టే క్రమంలో పూర్తిస్ధాయిలో వాట్సాప్ పే సేవలు దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని సమాచారం.
also read వొడాఫోన్ ఐడియా కస్టమర్లను వెంటాడుతున్న నెట్వర్క్ సమస్య...ఎందుకంటే..?
వాట్సాప్ పే సేవలు పూర్తిస్ధాయిలో అందుబాటులోకి వస్తే దేశంలోనే అతిపెద్ద చెల్లింపుల వ్యవస్థగా ఇది మారుతుందని భావిస్తున్నారు. ఫోన్‌పే, గూగుల్ పేలను 40 కోట్ల మంది భారత యూజర్లను కలిగిన వాట్సాప్ పే దీటుగా అధిగమిస్తుందని అంచనా.
కాగా 2018 ఫిబ్రవరిలో ట్రయల్ రన్ కింద ఐసీఐసీఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం ద్వారా వాట్సాప్ పదిలక్షల మంది యూజర్లకు చెల్లింపుల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఎన్‌పీసీఐ అభివృద్ధి చేసిన యూపీఐ ప్రమాణాలతో వాట్సాప్ పే సేవలను ప్రారంభించేందుకు వాట్సాప్ నియంత్రణ సంస్ధల అనుమతుల కోసం వేచిచూస్తోంది.