పదవికి ఎసరు తెచ్చిన ముద్దు.. స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ రాజీనామా

By Mahesh K  |  First Published Sep 11, 2023, 5:52 PM IST

స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ ముద్దు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఫిఫా ఆయనపై వేటు వేసిన తర్వాత తాజాగా, ఆయనే తన పదవి నుంచి వైదొలుగుతూ రాజీనామా లేఖ సమర్పించారు.
 


న్యూఢిల్లీ: ఫిఫా మహిళ ప్రపంచ కప్ టైటిల్ స్పెయిన్ ఎగరేసుకెళ్లింది. తొలిసారి ఈ టైటిల్‌ను స్పెయిన్ మహిళా టీం గెలుచుకుంది. దీంతో మహిళా టీంతోపాటు ఆ దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇక స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. ఆయన ఆనందం అత్యుత్సాహంగా మారింది. గెలిచి వస్తున్న క్రీడాకారిణులను అభినందించి ఆగిపోకుండా వారిని ముద్దుల్లో ముంచెత్తాడు. ఇప్పుడు ఈ ముద్దే ఆయన పదవికే ఎసరు పెట్టింది. ఈ ముద్దు దుమారం రేగడంతో పదవి నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. తాజాగా, ఆయన తన పదవికి రాజీనామా లేఖ సమర్పించారు.

ఈ ఏడాది ఆగస్టులో ఫిపా మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ జట్టుతో తలపడిన స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించింది. ఫిఫా మహిళల వరల్డ్ కప్ టైటిల్ దక్కడం స్పెయిన్‌కు ఇదే తొలిసారి. ఈ సందర్భంగా స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ జట్టు సభ్యులకు మెడల్స్ అందించారు. మెడల్స్ అందిస్తూ ఆయన వారిత అనుచితంగా ప్రవర్తించారు. స్టార్ ప్లేయర్ జెన్నిఫర్ హెర్మోసోను ముద్దు పెట్టుకున్నారు. ఇతర మహిళా ప్లేయర్ల చెంపలపైనా ముద్దు పెట్టాడు.

Latest Videos

ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. దీంతో స్పెయిన్‌తోపాటు ఇతర దేశాల్లోనూ వ్యతిరేకత వచ్చింది. ముద్దు వివాదం తుఫాన్‌గా మారింది. ముద్దు వివాదం కారణంగా వారికి తొలి సారి ఛాంపియన్‌గా నిలిచామన్న సంతోషాన్ని కూడా ఎక్కువ కాలం లేకుండా పోయింది. 

Also Read: సచిన్‌ను గాయపరచాలనుకున్నాను.. ఆ బాల్ వేసినప్పుడు చనిపోయాడనే అనుకున్నా: షోయబ్ అక్తర్ సంచలనం(Video)

అయితే.. తాను బలవంతంగా ముద్దు పెట్టలేదని ఆ క్రీడాకారిణి అంగీకారంతోనే ముద్దు పెట్టినట్టు లూయిస్ తెలిపాడు. కానీ, తాను అంగీకరించలేదని హెర్మోసో స్పందించడంతో వివాదం ముదిరింది. ఈ క్రమంలోనే లూయిస్ పై వేటుకు రంగం సిద్ధమైంది. తొలిగా ఫిఫా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో రూబియాలెస్ తన రాజీనామాను ఆదివారం అర్ధరాత్రి ప్రకటించారు.

ఫిఫా విధించిన సస్పెన్షన్ వేటు, తనపై దాఖలైన కేసులు చూస్తే.. తాను మళ్లీ పదవిలోకి తిరిగి వచ్చే అవకాశాలు లేవని స్పష్టం అవుతున్నదని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 

click me!