అధిక రక్తపోటు, డయాబెటీస్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్, ఊబకాయం మొదలైనవి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇవి గుండెజబ్బులకు కారణమవుతాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చనిపోవడానికి గుండె జబ్బులే ప్రధాన కారణమని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ వ్యాప్తి తర్వాత యువతలో కూడా గుండె జబ్బులు ఎక్కువయ్యాయి. అనారోగ్యకరమైన జీవనశైలి గుండె ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్, అధిక రక్తపోటు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి, మద్యపానం, ధూమపానం, ఊబకాయం మొదలైనవి గుండెను ప్రభావితం చేసే కొన్ని అంశాలు. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటుగా ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.
పాలకూర
పాలకూర పోషకాల బాంఢాగారం. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. పాలకూరలో ఐరన్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే పాలకూర గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది గుండె జబ్బుల రిస్క్ ను తగ్గిస్తుంది.
ఆపిల్
రోజుకు ఒక ఆపిల్ పండును తింటే డాక్టర్ ను దూరంగా ఉండొచ్చంటారు నిపుణులు. ఆపిల్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న పండు. యాపిల్స్ లో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బీట్ రూట్
బీట్ రూట్ లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. బీట్ రూట్ పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయ. బీట్ రూట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శరీరంలో రక్తం పెరుగుతుంది. రక్తపోటు కూడా తగ్గిపోతుంది.
టమాటాలు
టమాటాలు లేని కూర ఉండదు కదా.. నిజానికి టమాటాల్లో కూడా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తింటే ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. వీటిలో ఉండే విటమిన్ కె రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటుగా గుండెను కాపాడుతుంది.
బెర్రీలు
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్బెర్రీలు, కోరిందకాయలు వంటి వివిధ రకాల బెర్రీలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పోషకాల లోపం కూడా పోతుంది. అంతేకాదు ఇవి మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
క్యాబేజీ
క్యాబేజీలో విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ సి లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, సోడియం, పొటాషియం, సల్ఫర్ కూడా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
అవొకాడో
అవొకాడోలో పొటాషియంతో పాటుగా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవొకాడోను తింటే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీంతో గుండెపోటు ముప్పుతప్పుతుంది. గుండె ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.