గుమ్మడికాయలో బీటా కెరోటిన్, విటమిన్ సి తో పాటుగా ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీన్ని తింటే కంటిచూపు మెరుగుపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే..
గుమ్మడికాయ పోషకాలు పుష్కలంగా ఉన్న కూరగాయ. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే గుమ్మడికాయ మన శరీరం మొత్తాన్నిఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. గుమ్మడికాయలో విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్ తో సహా చర్మానికి ప్రయోజనకరమైన పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో సహాయపడతాయి.
మన శరీరంలో విటమిన్ సి ని సహజంగా ఉత్పత్తి చేయదు. అందుకే మనం దీన్ని ఆహారం ద్వారా ఖచ్చితంగా తీసుకోవాలి. విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే కొల్లాజెన్ ఏర్పడటానికి కూడా సహాయపడతుంది. ఈ కొల్లాజెన్ చర్మాన్ని దృఢంగా ఉంచుతుంది. చర్మం తేమగా, అందంగా కనిపించేందుకు సహాయపడుతుంది.
విటమిన్ ఇ ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. వడదెబ్బ, చర్మం పొడి బారకుండా రక్షించడానికి ఇది విటమిన్ సి తో కలిసి పనిచేస్తుంది. విటమిన్ ఎ వడదెబ్బ నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.
గుమ్మడికాయల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక పనితీరును ప్రోత్సహించడంలో విటమిన్ ఎ కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధనలో తేలింది. విటమిన్ సి రోగనిరోధక పనితీరుకు సహాయపడుతుంది. రోగనిరోధక కణాల పనితీరును సులభతరం చేస్తుంది. అలాగే తెల్ల రక్త కణాలను పెంచుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందన్న ఆధారాలు ఉన్నాయి. అయితే గుమ్మడికాయలో కనిపించే కెరోటినాయిడ్లు, విటమిన్ ఎ, విటమిన్ ఇ లోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రొమ్ము క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పును తగ్గిస్తాయి.
పండ్లు, కూరగాయలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కాలేయం సరిగ్గా పనిచేస్తుంది. గుమ్మడికాయలో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అలాగే సోడియం సహజంగా తక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది.
గుమ్మడికాయ గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడికాయ, గుమ్మడికాయ విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా గుమ్మడికాయ తినొచ్చు.