
గొప్పగా కాదు హ్యాపీగా బతకాలి.. లేదంటే ఈ కథలో నరేష్, సురేష్ పరిస్థితే..!
సురేష్, నరేష్.. పొరుగువారు.
ఇద్దరికీ రీల్స్ పిచ్చి.
అవతలి వాడి కన్నా గొప్పగా బతకాలని ఆశ.
దేవుడ్ని ప్రసన్నం చేసుకొని వరం సాధించి నరేష్ కన్నా గొప్పగా బతకాలని ట్యాంక్ బండ్ పై తపస్సు చేయడం మొదలెట్టాడు సురేష్.
ఇది తెలుసుకొని "తగ్గేదెలా" అంటూ నెక్లెస్ రోడ్డులో తపస్సు మొదలెట్టాడు నరేష్.
దేవుడు ముందుగా ట్యాంక్ బండ్ పైఉన్న సురేష్ దగ్గరకు వచ్చి..
"భక్తా ! నీ భక్తికి మెచ్చితి. ఎలోన్ మస్క్ , జెఫ్ బెజోస్ , బిల్ గేట్స్ లా ఆస్తులు కావాలా..?
ఇక్కడే హుస్సేన్ సాగర్ లో బుర్జ్ ఖలీఫా అంతటి పాలస్ కావాలా..?
బుగ్గాటి, బెంట్లేయ్, రోల్స్ రోయ్స్ కార్లు కావాలా..?"
అని అడిగాడు.
"నాకు అవేమి వద్దు స్వామి.
అదిగదిగో .. బుద్ధుడి విగ్రహం అవతల నెక్లెస్ రోడ్డులో ఉన్న .. నరేష్ గాడి కన్నా గొప్పగా బతకాలి.
ముందు వాడి దగ్గరికి పో.
వాడేమి అడిగితే నాకు అదే... అచ్చం అదే డబుల్ కావాలి.
వాడికి పది బిల్డింగ్ లు ఇస్తే ... నాకు ఇరవై.
వాడికి యాభై కోట్లు ఇస్తే... నాకు వంద కోట్లు "... అన్నాడు.
"సరే" అంటూ దేవుడు... ట్యాంక్ బండ్ పొగకు దగ్గుతూ... ముఖానికి స్కార్ఫ్ (కండువా) అడ్డుపెట్టుకొని నెక్లెస్ రోడ్డుకు వెళ్ళి .. నరేష్ ముందు ప్రత్యక్షమై... ఎలోన్ మస్క్ నుంచి రోల్స్ రోయ్స్ కారు దాక.. మొత్తం లిస్ట్ చదివాడు.
"సామీ.. సామీ... ముందుగా సురేష్ దగ్గరికి పోతివి కదా. వాడేమి అడిగాడు..?" నరేష్.
"నీకేమి ఇస్తే వాడికి డబుల్ కావాలంట" - దేవుడు.
మనం నాశనమయినా పరవాలేదు .. పక్కోడు బాగుపడితే చూడలేని డిజిటల్ డిప్పమ్ గాళ్ళ టైపోడు నరేష్.
" సామీ నాకొక కన్ను పోవాలా" కోరుకున్నాడు నరేష్ .
వెంటనే నెక్లెస్ రోడ్డు నరేష్ కు ఒక కన్ను..
డబుల్ కోరుకొన్న సురేష్ కు రెండు కళ్ళు పోయాయి.
హైదరాబాద్ జనాలు ఈ పొల్యూషన్ తో ఎలా వేగుతారో అని జాలి పడుతూ బతుకు జీవుడా అంటూ దేవుడు పైలోకాలకు వెళ్లి పోయాడు.
కథలో నీతి:
గొప్పగా కాదు ..
హ్యాపీగా బతకాలనుకో..
ఈ పోస్ట్ లో చివరిగా ఒక పద్యం .
అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను (గమనిక ఇక్కడ బల్కు అంటే నెల నెల జనాలు వాడే బల్క్ డిజిటల్ డేటా కాదని మనవి)
సజ్జనుండు బల్కు చల్లగాను (సజ్జనుండు అంటే హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అని కాదు. టెక్నాలజీ ని వాడుకునేవాడు. అంతే కానీ టెక్నాలజీ చేత వాడబడే వాడు కాదు.. అని అర్థం)
రోల్డ్ గోల్డ్ భాయ్ మోగినట్లు..
24 క్యారెట్ గై మోగునా..
రసాయన రుచులు కాదు .. మంచి ఫుడ్ తినరా మామ..!