
కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా తాజాగా ఇంటర్వ్యూలో కేజీఎఫ్ చిత్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఊహించిన విధంగానే ట్రోలింగ్ తీవ్ర స్థాయిలో మొదలయింది. కంచరపాలెం చిత్రంతో వెంకటేష్ మహా సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. తాజాగా వెంకటేష్ మహా, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, శివ నిర్వాణ, నందిని రెడ్డి లాంటి దర్శకులు ప్రముఖ జర్నలిస్ట్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఒక సందర్భం వచ్చినప్పుడు వెంకటేష్ మహా కమర్షియల్ చిత్రాల గురించి మాట్లాడాడు. ఉదాహరణగా కేజీఎఫ్ చిత్ర కథని, హీరో యష్ పాత్రని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. ఏకంగా యష్ పాత్రని నీచ్ కమీన్ కుత్తే అంటూ దుమారం రేపే వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రంలో ప్రశాంత్ నీల్ తల్లి పాత్రని తెరకెక్కించిన విధానం పై వెంకటేష్ మహా వెటకారంగా మాట్లాడడం, రాఖీ భాయ్ పాత్ర ముగింపుపై విమర్శలు చేయడం అభిమానులకు నచ్చడం లేదు.
దీనితో యష్ అభిమానులు, సినీ ప్రేక్షకులు వెంకటేష్ మహాపై సోషల్ మీడియాలో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. ప్రేక్షకులు అడవి రాముడు చూస్తారు శంకరాభరణం చూస్తారు తీసే విధంగా తీస్తే. కర్తవ్యం చూస్తారు గాంగ్ లీడర్ చూస్తారు.. ఒసేయ్ రాములమ్మ చూస్తారు నిన్నే పెళ్ళాడతా చూస్తారు.. పోకిరి చూస్తారు అరుంధతి చూస్తారు.. పుష్ప చూస్తారు సీతారామమ్ చూస్తారు.. మనం తీసి చూపించాలి. అంతే అంటూ పరోక్షంగా చురకలంటించారు.
మరో నెటిజన్ ట్వీట్ చేస్తూ.. భావాన్ని తెలపడం కంటే.. తెలిపే విధానం చాలా ముఖ్యం. మీరు ఒక్కసారి కమర్షియల్ సినిమా తీయండి. దానిని పెద్ద హిట్ చేసి చూపించండి. ముందే ఎందుకు ఓవర్ యాక్షన్. ఇలాంటి చిల్లర వ్యాఖ్యలతో పరువు పోగొట్టుకోవద్దు వెంకటేష్ మహా అంటూ దుమ్మెత్తి పోశారు.
కన్నడ అభిమానులు స్పందిస్తూ వెంకటేష్ మహా వెంటనే యష్ కి క్షమాపణలు చెప్పాలి. లేకుంటే అతడి తదుపరి చిత్రం కర్ణాటకలో రిలీజ్ కానివ్వం అంటూ హెచ్చరించారు. వెంకటేష్ మహా తన క్రెడిబులిటీ కోల్పొయారు అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మరికొందరు నెటిజన్లు కెజిఎఫ్ కి వచ్చిన పాప్ కార్న్ కలెక్షన్స్ అంత ఉండదు నీ సినిమా.. కమర్షియల్ సినిమాని హ్యాండిల్ చేయడం అంత సులభం కాదు.. ఒక కమర్షియల్ మూవీ తీసి 10 కోట్ల వసూళ్లు సాధించు అప్పుడు చూద్దాం అంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా ఆ ఇంటర్వ్యూలో భాగం అయినందుకు లేడి డైరెక్టర్ నందిని రెడ్డి కూడా వివాదంలో చిక్కుకున్నారు. వెంకటేష్ మహా కేజీఎఫ్ చిత్రాన్ని విమర్శిస్తుంటే ఆమెతో పాటు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, వివేక్ ఆత్రేయ నవ్వుతూ కనిపించారు. దీనితో నందిని రెడీ రియలైజ్ అయి ట్వీటర్ లో క్షమాపణ చెప్పారు.
ఒక కమర్షియల్ చిత్రం విజయం సాధించింది అంటే.. ఆ చిత్రంలో ఎఫర్ట్ ని ప్రేక్షకుల మెచ్చుకోవడం వల్లే. ఆ చర్చ జరిగింది ఎవరిని విమర్శించాలని, కించపరచాలనే ఉద్దేశంతో కాదు. ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి అని నందిని రెడ్డి ట్వీట్ చేశారు.
మీపై గౌరవం ఉంది.. మీరు తీసే ఫ్యామిలీ చిత్రాలకు చూస్తుంటాం. కానీ మీరు కూడా అలా నవ్వడం ఏంటి అని నెటిజన్ ప్రశ్నించగా.. క్షమించండి.. ఆయన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కి అనుకోకుండా నవ్వు వచ్చింది. కానీ నాకు తెలుసు అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని అంటూ నందిని రెడ్డి ట్వీట్ చేసారు.