
రేపు ఈ టైమ్ కు ఆదిపురుష్ సినిమా విడుదల అయ్యిపోతోంది. ప్రభాస్ హిందీలో నటించిన మొదటి స్ట్రైట్ మూవీ ఇది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో తీశారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ మూవీ ని భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఓపినింగ్స్ అదిరిపోతున్నాయి. అయితే ప్రమోషన్స్ అంతగా జరగడం లేదు. తెలుగులో అయితే కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో చేసి ఊరుకున్నారు. అంత భారీ ప్యాన్ ఇండియా సినిమాకు ఎందుకు ఇంత తక్కువ ప్రమోషన్స్ అనేది ప్రక్కన పెడితే దర్శక,నిర్మాతలు, హీరో వీళ్లెవరూ మీడియాకు ఇంటర్వూలు సైతం ఇవ్వటం లేదు.
ప్రభాస్ అమెరికాలో సేద తీరుతున్నారు. గతంలో ప్రభాస్ ..తన చిత్రాలు సాహో, రాధేశ్యామ్ చిత్రాల రిలీజ్ టైమ్ లో చాలా ఇంటర్వూలు ఇచ్చారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడటం తప్పించి , ప్రభాస్ ఈ సినిమా గురించి ఏ మీడియాతోనూ పనిగట్టుకుని ప్రత్యేకమైన ఇంటర్వూ ఇవ్వలేదు. అయితే ఎందుకు ఆదిపురుష్ టీమ్ ఇంటర్వూలకు దూరంగా ఉందనేది దానికి ఓ కారణం వినపడుతోంది.
ఆదిపురుష్ విషయమై ఇంటర్వూలు ఇవ్వటం మొదలెడితే అవి ఎటునుంచి ఎటు వెళ్లి వివాదాలకు దారి తీస్తాయనే భయంతో వద్దనకున్నట్లు వినిపిస్తోంది. దానికి తగ్గట్లు ఆదిపురుష్ సినిమాని టార్గెట్ చేయటానికి ఓ వర్గం రెడీగా ఉందని కూడా అర్దమవటం కూడా ఓ కారణం అంటున్నారు. సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ వస్తే అప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడరు అనే ఆలోచనతో కావాలనే ఇంటర్వూలు వద్దనుకున్నట్లు తెలుస్తోంది.
మరో ప్రక్క చాలా ఆలస్యం గా ప్రమోషన్స్ మొదలుపెట్టడంతో హిందీలో ప్రమోషన్ చేయాలా.. ? తెలుగులో ప్రమోషన్ చేయాలా? అన్నట్టు చిత్ర టీమ్ కన్ఫ్యూజ్ అవుతుంది? టైం తక్కువగా ఉండటంతో భక్తి అనే అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో రావణుడు పాత్రను పోషించిన సైఫ్ అలీ ఖాన్ మాత్రం (Adipurush) ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సైతం దూరంగా ఉన్నాడు.
సాధారణంగా పెద్ద సినిమా అంటే ప్రమోషన్స్ ఓ రేంజిలో ఉంటాయి. బాహుబలి ప్రమోషన్స్, పుష్ప ప్రమోషన్స్ ఎవరూ మర్చిపోరు. అంతెందుకు లైగర్ ప్రమోషన్స్ ని కూడా మర్చిపోవటం కష్టమే. అలాంటిది అత్యంత భారీ చిత్రంగా చెప్పబడుతున్న ఆదిపురుష్ కు ప్రమోషన్ బడ్జెట్ లేదో లేక అక్కర్లేదు అనుకున్నారో కానీ రాముడుపై భారం వదిలేసి సినిమాని థియేటర్ లో వదులుతున్నారు.
ఆదిపురుష్ కి కూడా తిరుపతిలో ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ గ్రాండ్ గా ఓ ఈవెంట్ చేసేసారు. మిగతా టీమ్ ముంబై లో ఇంటర్వూస్ ఇస్తూ ఆదిపురుష్ ని ప్రమోట్ చేస్తుంది. కానీ ఇప్పటివరకు తెలుగులో మళ్లీ ఓ ప్రెస్ మీట్ కానీ, మీడియా ఇంటరాక్షన్ కానీ లేదు. ప్రభాస్ అసలు కనిపించడమే లేదు. ఎల్లుండి శుక్రవారమే ఆదిపురుష్ రిలీజ్ అవుతుంది. హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్ లో అభిమానులకి కనిపించిన ప్రభాస్ ఆపై ఆదిపురుష్ ప్రమోషన్స్ లో కనబడలేదు, ఇకపై ఇక్కడ హైదరాబాద్ లో ఆదిపురుష్ ఈవెంట్స్ ఉంటాయనే నమ్మకమూ లేదు. అంత పెద్ద సినిమా.. ఇంత వీక్ ప్రమోషన్స్ అంటూ ప్రభాస్ ఫాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
అయితే ఈ చిత్రం రామాయణం ఆధారంగా చేసారు కాబట్టి ప్రత్యేకంగా రాముడుకి ప్రమోషన్స్ ఎందుకు అని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారట. తమ సినిమా అద్బుతంగా వచ్చిందని , రిలీజ్ అయ్యిన వెంటనే మౌత్ టాక్ సరిపోతుందని అంటున్నారట.అలాగే ఓపినింగ్స్ కు రాముడు, ప్రభాస్ కలిసి కృషి చేస్తారని నమ్ముతున్నారట. వారి నమ్మకం ఓపినింగ్స్ వరకూ నిజమే అనిపిస్తోంది. అన్ని చోట్లా ఓపినింగ్స్ ఓ రేంజిలో వినిపిస్తున్నాయి.