
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మొదట్లో వరస విజయాలను చూసాడు. అయితే ఈ మధ్య వరస ఫ్లాపులతో సాయి ధరమ్ తేజ్ కెరియర్ లో మంచి బ్రేక్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు నాని నాగచైతన్య లాంటి హీరోలతో పాటు వరుణ్ తేజ్ కు కూడ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన నేపధ్యంలో తేజు తన రేంజ్ ని నిరూపించుకునే బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.
ఈ నేపధ్యంలో ఇప్పటి వరకు టాప్ హీరోలతో మాత్రమే చేసిన వినాయక్ అనుకోకుండా తేజు వంక చూడటంతో వినాయక్ కాంబినేషన్ లో వచ్చే సినిమా తన కలలను నిజం చేస్తుంది అని భావించాడు. అయితే అనూహ్యంగా ఈసినిమాకు ఇంకా షూటింగ్ ప్రారంభం కాకుండానే సమస్యలు మొదలైనట్లు గాసిప్పుల హడావిడి జరుగుతోంది.
తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాకు కథను అందించిన వివి వినాయక్ ఆస్థాన రచయిత ఆకుల శివ పూర్తి చేసిన ఈమూవీ కథ సాయి ధరమ్ తేజ్ కు ఏ మాత్రం నచ్చలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈమూవీ సెకండ్ ఆఫ్ కథలోని ట్విస్ట్ లు తేజూకు నచ్చలేదని అంటున్నారు.
దీనితో ఈ కథను మార్చమని మెగా మేనల్లుడు వినాయక్ కు సూచించినట్లు టాక్. దానితో ఈ కథను మార్చే పనిలో ఆకుల శివ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నడుస్తున్న పరిణామాలు వినాయక్ కు అసహనాన్ని కలిగిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీనికితోడు ఈసినిమాను ప్యాకేజ్ ప్రాతిపదికన పూర్తిచేయమని వినాయక్ కు నిర్మాతలు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో భారీ బడ్జెట్ సినిమాలు తీయడం అలవాటు పడిన ఈ ప్రాజెక్ట్ ను ఎలా పూర్తి చేసి జాగ్రత్తగా గట్టు ఎక్కాలి అన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కరుణాకరణ్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సినిమాకు ఫిలిం ఛాంబర్ లో "ఛాలెంజ్" టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. గతంలో మెగాస్టార్ కూడా ఛాలెంజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.