
విశ్వక్ సేన్-నేహా శెట్టి జంటగా నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి మే 31న గ్రాండ్ గా విడుదలైంది. హీరోయిన్ అంజలి మరో కీలక రోల్ చేసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలయ్య హాజరయ్యాడు. దాంతో మంచి ప్రచారం దక్కింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓపెనింగ్స్ పరంగా సత్తా చాటింది. విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ నమోదు చేసినట్లు సమాచారం. అయితే మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు కృష్ణ చైతన్య పూర్తి స్థాయిలో మెప్పించలేదని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.
చిత్ర యూనిట్ మాత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సూపర్ హిట్ అని ప్రచారం చేసుకున్నారు. తీరా చూస్తే... రెండు వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జూన్ 14 నుండి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో గ్యాంగ్ ఆఫ్ గోదావరి అందుబాటులోకి వస్తుంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్ర కథ విషయానికి వస్తే... రాజమండ్రి దగ్గర్లోని ఓ లంక గ్రామానికి చెందిన రత్న(విశ్వక్ సేన్) బాల్యం నుండి క్రమశిక్షణ లేకుండా పెరుగుతాడు. దొంగతనాలు చేస్తుంటాడు. ఎప్పటికైనా గొప్ప స్థాయికి వెళ్ళాలి అనేది అతడి కల. మంచి చెడు అనేది అనవసరం. ఎలాగైనా డబ్బు సంపాదించి నలుగురిని శాసించే స్థాయికి వెళ్ళాలి అనే మనస్తత్వం కలిగి ఉంటాడు. ఈ క్రమంలో అక్రమ మార్గాలు ఎంచుకు ని ఎమ్మెల్యే స్థాయికి వెళతాడు . ఈ క్రమంలో శత్రువులు ఏర్పడతారు.
రత్న మీద పలుమార్లు మర్డర్ అటాక్ జరుగుతుంది. ఆ అటాక్ వెనుక ఎవరున్నారో తెలిశాక రత్న షాక్ కి గురవుతాడు . రత్నలో పరివర్తన వస్తుందా? అతడు శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని నిర్మించారు.